చేర్యాల నేటిధాత్రి….
శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా? అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగపురాణంలో ఓ చక్కటి కథ ఉంది. ఆ మహాదేవుడే చెప్పిన కథ ఇదే..
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం.. సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటిపడే వేళైనా ఒక్క జంతువూ దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటిముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని.. అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తనకంటి చూపునకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కిందపడవేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ.. ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు.
రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడ జింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని.. తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం.. పైగా అది మానవభాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండోజాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృశించి ఉన్నానని.. పైగా బక్కచిక్కిన తన శరీరమాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయ ఆశ్చర్యపోయాడు. మూడోజాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువూ దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగోజాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది.
బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక.. దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలూ బోయవాడికిచ్చిన మాటప్రకారం సత్యనిష్ఠతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయబాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టుకావటం, అతడు తెలియకుండానే శివ శివా అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం.. తన చూపునకు అడ్డంవచ్చిన మారేడు దళాలను కోసి కిందపడవేయటం చేశాడు బోయవాడు. ఆ చెట్టుకిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజాఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకూ మెలకువతోనే ఉన్నాడు గనక జాగరణ ఫలితం వచ్చింది.
క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠ అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్ఠతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలంపాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణమూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించినవారు, సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది.
రవిందర్ రెడ్డి…✍