‘సతీ లీలావతి’ నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
లావణ్య త్రిపాఠి కొణిదెల టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘సతీ లీలావతి’. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ (Dev Mohan) జంటగా నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగ మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తాతినేని సత్య (Thathineni Satya) దర్శకత్వం వహిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని ఎమోషనల్ గానే కాకుండా ఎంటర్ టైనింగ్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తొలి గీతం విడుదలైంది.
హీరో, హీరోయిన్ల పెళ్ళి నేపథ్యంలో వచ్చే ఈ ‘చిత్తూరు పిల్లా…’ పాటను వనమాలి రాయగా, మిక్కీ జే మేయర్ స్వరపరిచారు. బృందా మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటను నూతన మోహన్, కృష్ణ తేజస్వి, రితేష్ జి రావ్ పాడారు. మేన బావను ప్రేమించి పెళ్ళి చేసుకునే అమ్మాయి తన మనసులో భావాలను వివాహ తంతు నేపథ్యంలో వెల్లడిచేసే పాట ఇది. హృద్యమైన మిక్కీ జే మేయర్ బాణీలకు తగ్గట్టుగా చక్కని, అర్థవంతమైన సాహిత్యాన్ని వనమాలి సమకూర్చారు. కాబోయే భర్త మీద హీరోయిన్ చూపించే అతి ప్రేమను చూస్తుంటే… ఆ తర్వాత దానికి భిన్నమైన సన్నివేశాలను సినిమాలు దర్శకుడు చూపించ బోతున్నాడనిపిస్తోంది. ఆలుమగలు మధ్య ఏర్పడే కలతలు, కలహాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందనిపిస్తోంది. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను నరేశ్ విజయకృష్ణ, విటీవీ గణేశ్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సిద్ధిక్, తాగుబోతు రమేశ్, జోషి తదితరులు పోషించారు.