`కుక్కకాటుతో లక్షల మందికి గాయాలు!
`పోతున్న వేలాది మంది ప్రాణాలు!
`దేశ వ్యాప్తంగా పిల్లల్ని పీక్కుతింటున్నాయి
`పిల్లలు గొంతులు కొరికేస్తున్నాయి
`పెద్దల పిక్కలు పీకేస్తున్నాయి
`మందకు మంద మీద పడి కరిచేస్తున్నాయి
`పల్లె నుంచి పట్నం దాకా స్వైర విహారం చేస్తున్నారు
`రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
`జాగింగ్‌కు వెళ్లాలంటే జనం జంకుతున్నారు
`రాత్రి వేళ కొలువుల నుంచి ఇంటికి చేరుకోవాలంటే నరకం చూస్తున్నారు
`బైక్‌ల మీద వచ్చే వారు ఇంటికి చేరే వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు
`హైవేల మీద కార్లను కూడా కుక్కలు వెంబడిస్తున్నాయి
`పొరపాటున రాత్రివేళ టూ వీలర్లు కుక్కల మూలం ప్రాణాలు కోల్పోతున్నారు
`అడుగు తీసి బైట పెట్టాలంటే గజగజ వణుకుతున్నారు
`ఏ సందు నుంచి వచ్చి కుక్కల మంద మీద పడుతుందో అని భయపడుతున్నారు
`ఒంటరిగా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు
`మహిళల రోడ్డెక్కాలంటే గజగజ వణుకుతున్నారు
`మీద పడిన కుక్కల కాట్లతో విలవిలలాడుతున్నారు
`రేబిస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు
`అభం శుభం తెలియని పిల్లలు కక్క కాటుతో ఆసుపత్రుల్లో కుక్కల్లా అరుస్తున్నారు
`తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు
`హాయిగా వున్న పిల్లలు కళ్ల ముందు రేబిస్ తో చనిపోతుంటే కడుపు కోతను తట్టుకోలేకపోతున్నారు
`జంతు ప్రేమికులకు ఈ మరణాలు కనిపించడం లేదు
`ప్రజల ప్రాణాలకన్నా కుక్కల మీద ఎనలేని ప్రేమను వలకబోస్తున్నారు
`కుక్కలను బోన్‌లో పెట్టడాన్ని ఖండిస్తున్నాయి
`సినిమా హీరోయిన్లు కొందరు మరీ విపరీతం చేస్తున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒకప్పుడు రోడ్ల మీద కుక్కలున్నాయంటే ధైర్యంగా వుండేది. కాని ఇప్పుడు రోడ్ల మీద కుక్కలు కనిపిస్తున్నాయంటే చాలు గుండెలు అదిమి పట్టుకోవాల్సిన పరిస్ధితి ఎదురౌతోంది. ఊళ్లలోకి ఒకప్పుడు పిచ్చి కుక్క వచ్చిందని చెప్పగా వింటూ వుండేవాళ్లం. కాని ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా మన చుట్టూ వున్న కుక్కల్లో ఏది వీది కుక్కో, ఏది పిచ్చి కుక్కో తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడు ఏ కుక్క వచ్చి కరుస్తుందో కూడా అంచనా వేసుకోలేకపోతున్నాం. ఏ కుక్కల మంది ఎటు నుంచి వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టంగా మారుతోంది. కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడిపోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఒక వీధిక కొత్త కుక్క వచ్చిందంటే ఆ కుక్కను తరిమేందు కుక్కల మంద వెళ్తుండేది. కాని ఇప్పుడు కొత్త, పాత అనే తేడా లేదు. ఏ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చినా సరే కరవకుండా వదలడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలలో నడుచుకుంటూ వెళ్లాలంటే అందరూ భయంతో వణికిపోతున్నారు. ఏ కాలనీలో చూసినా కుక్కల గుంపులే..కనిపిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 37లక్షల మంది కుక్క కాటుకు బలౌతున్నారు. ఇది రికార్డులకు ఎక్కిన లెక్క మాత్రమే. రికార్డులకు ఎక్కవని ఎన్ని ఎన్ని లక్షల కేసులుంటాయో చెప్పలేం. అలా ప్రతి ఏటా కోట్లాది మంది కుక్క కాటును చవి చూస్తున్నారు. కుక్కల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో పదివేల మందికి పైగారేబిస్ బారిన పడుతున్నారని ఓ అంచనా? అందులో రేబిస్ నయం కాకుండా చనిపోతున్నవారు వందల్లో వుంటున్నారు. ఇక కుక్కల దాడిలో అక్కడిక్కడే చనిపోతున్నవారు కూడా వేలల్లో వుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వాలకు కనిపించడం లేదా? జంతు ప్రేమికుల కోసం, మనుషుల ప్రాణాలు పాలకులకు లెక్క లేకుండాపోతుందా? సహజంగా నోరున్న సమాజం కొద్దిగానే వుంటుంది. అది నిజం చెప్పాలంటే చాలా చిన్న సమూహమే. కాని దాని విసృతి మీడియా ద్వారా పెరుగుతోంది. కాని ఇబ్బందులు పడుతున్న, సమస్యలు ఎదుర్కొంటున్న సమాజం చాలా పెద్దది. కాని ఆ సమాజం మాటలు, వ్యధలు మీడియాకు కూడా పట్టవు. వాళ్లు వెళ్లి మీడియా ముందు మొరపెట్టుకోరు. అధికారుల వద్దకు వెళ్లి కంప్లైట్ ఇవ్వరు. అందుకే కుక్కల సమస్య వెలుగులోకి రావడం లేదు. కాని పిడికెడు మంది వుండే జంతు ప్రేమికులు మాత్రం హడావుడి చేస్తారు. మూగజీవాలంటూ లేనిపోని రాద్దాంతం చేస్తుంటారు. ఆ మధ్య హైదరాబాద్‌లో వరుస సంఘటనలు జరిగాయి. ఓ పసిపాప ఇంటి ముందు ఆడుకుంటుంటే కుక్కల మంద వచ్చి ఆ పసిపాపను పీక్కు తిన్నాయి. నోట్లో కరుచుకొని వెళ్లాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం కోకొల్లలు జరుగుతున్నాయి. జనగామ జిలాల్లో గత ఏడాది కూడా ఇలాంటి భయంకరమైన ఘటన జరిగింది. పసిపాపై దాడి చేసి చంపేశాయి. దేశ వ్యాప్తంగా అలా ఎంత మంది పిల్లలను వీధి కుక్కలు పీక్కుతుంటున్నాయో లెక్కలేకుండా పోతోంది. పసి పిల్లలపై ఇలా కుక్కలు దాడి చేస్తుంటే మాత్రం మన సమాజానికి కనికరం రావడం లేదు. పాలకులు కళ్లు తెరవడం లేదు. కాని మూగజీవాల పట్ల మాత్రం ఎక్కడలేని జాలి దయ పుట్టుకొస్తాయి. ఇలా జాలి, దయ చూపించే వారు ఎవరూ వీధి కుక్కలకు తమ ఇళ్లలో స్ధానం కల్పించరు. వాటిని ఇంట్లో పెంచుకోరు. కనీసం వాటి దగ్గరకు వెళ్లాలంటే కూడా ఇష్టపడరు. కాని పరపతి కోసం, ప్రచారం కోసం మాత్రం ఇలాంటి వేషాలు వేసే వారుచాలా మంది వున్నారు. నిజమైన జంతు ప్రేమికులైనా సరే ప్రజల ప్రాణాల కోల్పోవాలని చూడరు. తాజగా సుప్రింకోర్టు తీర్పుతోనైనా ప్రజల్లో, పాలకుల్లో మార్పు వస్తుందని అనుకున్నారు. కాని సుప్రింకోర్టు తీర్పునుకూడా తప్పు పట్టే దశకు కొందరు జంతు ప్రేమికులు చేరుకున్నారు. ప్రజల ప్రాణాలు కుక్కలు హరిస్తుంటే, వాటిని కాపాడాలని కోరుకోవడంలో వుండే జాలి ఏమిటో అర్దం కావడం లేదు. అయినా సుప్రింకోర్టు కుక్కలను చంపేయాలని తీర్పున్విలేదు. వాటికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయమని సూచించారు. ఇది కూడా తప్పేనా? ఇంతకన్నా వీదికుక్కలకు పరిష్కారం వుంటుందా? అంటే వాటిని ఊరు మీద తిరగనివ్వమని, మనుషులను కరిచినా తప్పు లేదని జంతు ప్రేమికులు కోరుకుంటున్నారా? అన్నది అర్దం కాకుండాపోతోంది. అలహాబాద్‌లోని ఓ వ్యక్తి వీది కుక్కలకు తోటి కాలనీ వాళ్లు భోజనం పెట్టనివ్వడం లేదని కోర్టుకెక్కాడు. అతని పిటీషన్‌ను విచారించిన రాష్ట్ర ఉన్నత ధర్మాసనం ఈ వ్యక్తికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. కుక్కల మీద అంత ప్రేమ వుంటే ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి, వాటిని సంరక్షించుకోవచ్చని చెప్పింది. ఈ తీర్పు సదరు వ్యక్తికి నచ్చలేదు. సుప్రింకోర్టును ఆశ్రయించారు. సుప్రింకోర్టు అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్ధించింది. కుక్కలను పెంచుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు. వాటిని సంరక్షించాలనుకునేవారు వాటికి ఆశ్రయం కల్పించండి? అని చెప్పింది. వీది కుక్కల మూలంగా జరుగుతున్న అనర్ధాలను కూడా సుప్రింకోర్టు చెప్పింది. కుక్కల వల్ల కొన్ని వేల మంది ఎలా ఇబ్బందులు పడుతున్నారో చెప్పింది. రేబిస్ వ్యాది ఎంత భయకంరమైందో తన తీర్పులో వెల్లడిరచింది. దానిపై కొన్ని జంతు ప్రేమికులు డిల్లీలో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. ఇక సినీ రంగానికి చెందిన కొంత మంది మాత్రం ఏడుస్తూ వీడియాలు చేశారు. అలాంటి వారికి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటైన సమాధానమిచ్చారు. అయినా సమాజంలో ఏదైనా జరగనీ, జనం ప్రాణాలు పోనీ అనే ఆలోచనతోనే కొంత మంది జంతు ప్రేమికులు వ్యవహరిస్తున్నారు. వీధి కుక్కల వల్ల ఎదురౌతున్న సమస్యలు ఎంత భయంకరంగా వుంటాయో మాటల్లో చెప్పలేం. దేశ వ్యాప్తంగా వీధుల్లో వుండే కుక్కలు ఎంతో మంది పసి పిల్లల్ని పీక్కు తింటున్నాయి. అవి జంతు ప్రేమికులకు కనిపించడం లేదా? కుక్క మూగజీవి కాదు. మూగ జీవి అంటే ఆవు, గొర్రె, మేక, కుందేలు ఇలాంటి వాటిని కూడా మూగ జీవాలంటారు. అంతే కాని కుక్కను జాగిలం అంటారు. అంటే వాటికి వుండే పళ్లు ఎంత దృడంగా వుంటో చూడని వారు ఎవరూ వుండరు. ఒకప్పుడు కుక్కల తెరువు వెళ్తే వెంటపడుతాయనేవారు. కాని ఇప్పుడు వాటిలో ఏవైనా జన్యుపరమైన మార్పులు వచ్చాయో అర్ధం కావడం లేదు. కాని మనిషిని చూస్తే చాలు మీద పడేంత కోపంగా వుంటున్నాయి. దీనిపై కూడా అద్యయనాలు జరగాల్సిన అవసరంవుంది. ఒకప్పుడు కుక్క వుందని అరిస్తే తెలిసేది. కాని ఇప్పుడు అరిచే కుక్క కరవదు. కరిచే కుక్క అరవదు. అనే సామెతను నిజం చేస్తున్నాయి. ఒక్కసారిగా వచ్చి మీద పడుతున్నాయి. కుక్కల మందలే ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. పెద్దల పిక్కలు పీకేస్తున్నాయి. ఏ వ్యక్తి అయినా ఒక్క కుక్క వస్తే అదించగలడు. బెదిరించగలదు. చేతిలో కర్ర వుంటే ఒక్క కుక్కను కొట్టగడలడు. పది కుక్కలు మీద పడితే చేతిలో కర్ర వున్నా ఏమీ చేయలేని పరిస్ధితులు ఎదురౌతున్నాయి. మందకు మంద మీదపడి కరిచేస్తుంటే చేసేదేమీ వుండదు. పల్లె నుంచి పట్నం దాకా ఊరిలో, ఊరి పొలిమేరలో, రహదారుల మీద, కాలనీల్లో, వీది వీధిలో, సందు సందులో ఎక్కడ చూసినా కుక్కల మందలు స్వైర విహారం చేస్తున్నాయి. పల్లెల్లో రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారంటే పరిస్ధితి ఎంద భయంకరంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాలో కొంత కాలం క్రితం వరకు నాలుగు గంటల ప్రాంతంలో కూడా ఒక్కరే జాగింగ్‌కు వెళ్లేవారు. కాని ఇప్పుడు ఒక్కరే కాదు నలుగురైదుగురు వున్నా, జాగింగ్ వెళ్లాంలంటే భయపడుతున్నారు. కుక్కల భయానికి మార్నింగ్ వాక్ మానేసి, ఇంట్లోనే ధ్రెడ్ వీల్ తెచ్చుకుంటున్న వారి సంఖ్య చాలా పెరిగింది. ఇక రాత్రి వేళ డ్యూటీ ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్న వారి కష్టం పగవాడికి కూడా రావొద్దు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. నిత్యం నరకం చూస్తున్నారు. బైకుల మీద వెళ్లేవారి వెంట పడుతున్నాయి. బైక్‌లకు అడ్డం తిరుగుతున్నాయి. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇక మహిళలు బైటకు వెళ్లాలంటే గజగజ వణుకుతున్నారు. హైవేలపై కుక్కలు కార్లును కూడా వెంబడిస్తున్నాయంటే పరిస్ధితి ఎంత ఘోరంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. హైవేల మీద సైకిళ్ల మీదనో, బైక్‌ల మీదనో వెళ్లే పరిస్ధితి కూడ లేకుండాపోతోంది. ఒకప్పుడు కుక్కల సంఖ్యపెరిగిపోయిందంటే చాలు కుక్కల వ్యాన్‌లువచ్చేవి. పట్టుకెళ్లేవి. కాని ఇప్పుడు ఆ కుక్కల వ్యాన్‌లు ఎక్కడిపోయాయో? మున్సిపల్ శాఖ ఏంచేస్తుందో.. దేశమంతా ఇదే దిగులు వ్యక్తమౌతోంది.