మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ లేదా నియోఫాసిస్ట్ కాదన్న సీపీఎం
భగ్గుమన్న కాంగ్రెస్, సీపీఐ
కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న సీపీఎం మారిన వైఖరి
ఎల్‌డీఎఫ్‌పై ఎదురుదాడిని పెంచిన కాంగ్రెస్
సీపీఎం వ్యూహాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడంలేదా?
వచ్చే ఏడాదిలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు
చాపకింద నీరులా వ్యవహరిస్తున్న బీజేపీ
హైదరాబాద్,నేటిధాత్రి:
భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, భారతీయ జనతాపార్టీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు పరస్పర విరుద్ధ భావజాలాలు కలిగినవన్న సంగతి మనకు తెలిసిందే. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి, భాజపా అనుసరించే జాతీయవాద సిద్ధాంతానికి ఉప్పు`నిప్పు సంబంధమంటే అతిశయోక్తి కాదు. అటువంటిది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వచ్చే ఏప్రిల్ నెలలో పార్టీ కాంగ్రెస్ జరుగనున్న నేపథ్యంలో ఒక ముసాయిదాను విడుదల చేసింది. భాజపాను ఫాసిస్ట్, నియో`ఫాసిస్ట్ పార్టీగా ఎప్పుడూ తనదైన శైలిలో విమర్శించే సీపీఐ(ఎం) ఈసారి ముసాయిదాలో నరేంద్రమోదీ ప్రభుత్వం ‘నియో`పాసిస్ట్’ లేదా ‘ఫాసిస్ట్’గా పిలవడానికి అవసరమైన అర్హతలు లేవని పేర్కొనడం దేశంలో ఒక్కసారి రాజకీయ ప్రకంపనలు రేకెత్తించింది. ఈ ముసాయిదా విడుదల కాగానే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిజం చెప్పా లంటే ఈ ముసాయిదా విపక్షపార్టీల మధ్య కొత్త విభేదాలను సృష్టించడమే కాదు, వాటిల్లో నెల కొన్న నిలకడలేని రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసింది.
విషయమేంటంటే వచ్చే ఏప్రిల్ నెలలో సీపీఐ(ఎం) పార్టీ 24వ కాంగ్రెస్ మీటింగ్ జరుగనుంది. పార్టీ రాజకీయ తీర్మానానికి సంబంధించి ముసాయిదా నోట్‌ను రూపొందించి తన రాష్ట్ర శాఖలకు పంపింది. ఇటువంటి ప్రతి పార్టీ కాంగ్రెస్ సమావేశానికి ముందు ఇటువంటి ముసాయిదానుపంపడం రివాజు. అయితే ఇప్పటివరకు బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌పై పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై సీపీఎం యూటర్న్ తీసుకోవడమే ఈ ముసాయిదాలోని ఆశ్చర్యం కలిగించే విశేషం! నిజానికి బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లను ఫాసిస్ట్ అజెండాతో ముందుకెళ్లేవిగా సీపీఎం ఎప్పుడూ విమర్శిస్తూ రావడం కద్దు. మాజీ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో మోదీ ప్రభుత్వాన్ని, ఫాసిజాన్ని సమాంతర రేఖలుగా వివరించడానికి ప్రయత్నించారు. ఇదిలావుండగా సీపీఎం తన అభిప్రాయాన్ని సమర్థించుకోగా, సహచర సీపీఐ మాత్రం ఈ ‘తప్పిదాన్ని’ సరిదిద్దుకోవాలని డిమాండ్ చేసింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీపీఎం మరియు సీపీఐలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి సీపీఎం కేవలం తన ఉనికికోసమే ఈవిధంగా మాటమార్చిందంటూ విరుచుకుపడిరది.
సీపీఎం, సీపీఐ మరియు కాంగ్రెస్‌లు జాతీయస్థాయిలో ఒకే కూటమిలో వుండగా, కేరళలో మా త్రం సీపీఎం, సీపీఐల కూటమితో ఏర్పడిన ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో వుంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యు.డి.ఎఫ్. ఈ రాష్ట్రంలో విపక్షంలో వుంది. సీపీఎం తాజా వైఖరి నేపథ్యంలో ప్రముఖ రచయిత తుషార్ గాంధీ ‘ఎక్స్’వేదికలో ఈవిధంగా పోస్ట్ చేశారు. ‘‘కేరళ సీపీఎం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అంగీకరించడంలేదు. అంటే ఇప్పుడు సీపీఎం తన ఎర్ర జెండానుమడతపెట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ను కేరళలోకి ‘రెడ్ కార్పెట్’ వేసి మరీ ఆహ్వానించాలని చూస్తున్నదనుకోవాలా? ఇప్పుడు ‘లాల్’ కాస్తా ‘భగ్వా’గా మారిపోయిందా?’’ అంటూ ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ‘నియో`ఫాసిస్ట్’ లక్షణాలను ప్రదర్శిస్తున్నప్పటికీ, దాన్ని ‘ఫాసిస్ట్ లేదా నియో` ఫాసిస్ట్’గా పిలిచేందుకు అవసరమైన యోగ్యతలు దానికి లేవని సీపీఎం ముసాయిదా స్పష్టం చేసింది. ‘మేం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ లేదా నియో`ఫాసిస్ట్ అని ఎప్పుడూ పేర్కొనలేదు. ఇదేసమయంలో భారత్‌ను నియో`ఫాసిస్ట్ రాజ్యంగా పరిగణించడంలేదు. మేం చెప్పేదల్లా ఒక్కటే. ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగమైన బీజేపీ పదేళ్లుగా దేశాన్ని పాలిస్తోంది. ఈ కాలంలో బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో రాజకీయ సుసంఘటితను సాధించాయి. దీని ఫలితంగా నియో`ఫాసిస్ట్ లక్షణాలు వ్యక్తమవడం మొదలైంది’ అని సీపీఎం ముసాయిదా తీర్మానం పేర్కొంది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్ పార్టీ అభిప్రాయాన్ని గట్టిగా సమర్థించారు. ‘‘మేం ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా వ్యవహరించలేదు. ఫాసిజం మళ్లీ పురుడుపోసుకుందన్న మాట కూడా మేం ఎప్పుడూ అనలేదు. నిజంగా ఫాసిజం దేశంలోని ప్రవేశిస్తే రాజకీయ నిర్మాణం ఒక్కసారిగా మారిపోతుంది.’ అని బాలన్ పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఐ (ఎంఎల్)లు తమ అభిప్రాయానికి భిన్నంగా దేశంలోకి ఫాసిజం వచ్చేసిందని భావిస్తున్నాయి, అని కూడా బాలన్ పేర్కొ న్నారు. నిజానికి దేశంలోకి ఫాసిజం వచ్చిందని భావిస్తే అందుకు రుజువులు చూపండి అని బాలన్ కోరినట్టు మళయాల న్యూస్ పోర్టల్ ‘మాధ్యమం’ పేర్కొంది.
మధ్యంతరాసామ్రాజ్యయుగంలో పురుడుపోసుకున్న క్లాసికల్‌ాఫాసిజానికి మరియు నియోాఫాసిజానికి మధ్య వున్న తేడాను తాము గుర్తించామని, ఇది కేవలం నియోాలిబరలిజంలో చోటుచేసుఉన్న సంక్షోభం నుంచి పుట్టుకొచ్చింది మాత్రమేనని సీపీఎం పేర్కొంది. నియోాఫాసిజం నిజా నికి ప్రజాస్వామ్య చట్రంలో నిరంకుశ లక్షణాలు కలిగివుంటుందని, క్లాసికల్‌ాఫాసిజం మాదిరిగా కాకుండా ఇది పూర్తిగా ఎన్నికల వ్యవస్థనే తిరస్కరిస్తుందని వివరించింది.
కేరళ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత సీపీఎం వైఖరిని, కేరళ కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి యత్నాలు మొదలుపెట్టింది. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ‘ప్రస్తుత సీపీఎం వైఖరి పూర్తిగా దాని వ్యాపారధోరణికి నిదర్శనం’ అని విమర్శించింది. కేరళలో సీపీఎంను ఇకనుంచి ‘కమ్యూనిస్ట్ జనతా పార్టీ’ (సీజేపీ)గా పిలవాలంటూ ఎద్దేవా చేసింది. సీపీఎంకు, బీజేపీకి మధ్య అంతర్గతంగా ‘అంగీకారం’ కుదిరిందా? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ కాదనడమంటే ఆపార్టీకి సీపీఎం కోవర్ట్‌గా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.
‘సీపీఎం ఉన్నతస్థాయిలో తీసుకొచ్చిన కొత్త సిద్ధాంతం నేపథ్యంలో ఇప్పటివరకు సెక్యూలర్ విలువలకోసం పోరాడే పార్టీగా భావించేవారు, నేటివరకు వామపక్షంగా పరిగణిస్తూ తప్పుచేశామన్న భావనకు గురవుతారు. గత అసెంబ్లీ, లోక్‌సభ మరియు ఇతర ఉప`ఎన్నికల్లో క్రమంగా రైట్ వింగ్‌వైపుకు మారుతున్న పరిణామాలు, సీపీఎంను దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా స్థానం లేకుండా చేస్తున్నాయి. అంతేకాదు ఈ పార్టీ ప్రస్థానం ముగింపు దశలో ఉన్నదన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి’ అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.
కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వి.డి. సతీశన్ మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎం వైఖరి, బీజేపీతో దానికున్న రహస్య ఒప్పందాన్ని వెల్లడిస్తోందని ఆరోపించారు. ‘కేరళలో సీపీఎం ఎప్పుడూ ఫాసిజంతోశాంతిగానే వ్యవహరిస్తోంది. సంఫ్‌ుపరివార్‌తో అది ఒక అంగీకారానికి వచ్చింది. ఈ సంబంధాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ కాదంటూ కొత్త ముసాయిదాను ముందుకు తెచ్చింది. మోదీతో చేతులు కలపడానికి, సంఘపరివార్‌తో శాంతి ఒప్పందం ద్వారా వారికి లంగిపోవడానికి సీపీఎం సిద్ధపడిరది’’ అని సతీశన్ ఆరోపించారు.
కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు సీపీఐ కూడా సీపీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళప్రభుత్వంలో సీపీఎంకు జూనియర్ భాగస్వామిగా కొనసాగుతున్న సీపీఐ, ‘సీపీఎం ముసాయిదా లో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి’ అని డిమాండ్ చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ అంటేనే ఒక ఫాసిస్ట్ సంస్థ. ఆర్‌ఎస్‌ఎస్ కింద పనిచేసే మోదీ నేతృత్వంలోని బీజేపీ కూడా ఫాసిస్ట్ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో సీపీఎం తన పంథాను సరిదిద్దుకోవాలని కేరళ సీపీఐ ప్రధాన కార్యదర్శి బినోయ్ విశ్వం డిమాండ్ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
విషయాన్ని పరిశీలిస్తే కేరళలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీపీఎం, వ్యవహారజ్ఞానంతో సమ తుల్య వైఖరితో అడుగులు ముందుకేస్తుంటే, సీపీఐ మాత్రం తన వైఖరిలో ఏవిధమైన మార్పులే కుండా పూర్వపు పంథాతోనే ముందుకెళుతుండటం వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఇక కాంగ్రెస్ కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకమే కనుక, అధికారంలోకి రావడానికి సీపీఎం వైఖరిని ఒక అవకాశంగా తీసుకొని మరింత దూకుడుగా ముందుకెళ్లే వైఖరిని అనుసరిస్తోంది. ఏది ఏమైనా సీపీఎం తాజాగా మారిన తన వైఖరితో విపక్షాలను ఒక్క కుదుపునకు లోను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేరళలో క్రమంగా బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఇలాగే వచ్చే ఎన్నికల్లో కూడా జరిగితే తాము నష్టపోక తప్పదన్న అభిప్రాయానికి సీపీఎం వచ్చి వుండాలి. అందుకనే రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జా గృతి పవనాలను గుర్తించే తాను బీజేపీకి వ్యతిరేకం కాదన్న ముద్రను సుస్థిరం చేసుకుంటే, వచ్చే అసెంబ్లీ హిందూ ఓట్లను కాపాడుకోవచ్చన్నది సీపీఎం వ్యూహం కావచ్చు. ఓట్లశాతం పెరుగు తున్నా కేరళలో బీజేపీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ పెరుగుతున్న బీజేపీ అనుకూల ఓటింగ్ అధికార ఎల్‌డీఎఫ్‌ను దెబ్బతీస్తుంది. ఈ వ్యూహంతోనే తాను బీజేపీకి వ్యతిరేకం కానన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే, బీజేపీ ఎట్లాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక, ఆ పార్టీకి అనుకూల ఓట్లను తమవైపుకు తిప్పుకోవచ్చన్న సీపీఎం వ్యూహం నిజమైతే సహచర పార్టీలు తొందరపడి సీపీఎంను విమర్శిస్తున్నాయనుకోవాలి. ఇదే సమయంలో భాజపా కూడా ఈ ట్రాప్‌లో పడకుండా తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటూనే మరింత చొచ్చుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాల్సి వుంటుంది.