*సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది
*ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మళ్ళీ కారు గుర్తుకే ఓటేస్తారు
*గెలిచిన వెంటనే ఊహించిన దానికంటే ఎక్కువే కోనరావుపేట మండలాన్ని అభివృద్ధి చేస్తా
– బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ
కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ-రాఘవ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డిలతో కలిసి కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, గొల్లపల్లి(నిమ్మపల్లి), వెంకట్రావు పేట, ఎగ్లాస్ పూర్, శివంగాలపల్లితో పాటు కోనరావుపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీ నరసింహా రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూస్తున్న ప్రజలు మళ్ళీ ఒకసారి కారు గుర్తుపై ఓటేస్తారనే నమ్మకం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.యువత భవిష్యత్ బాగుండాలని మంత్రి కేటీఆర్ ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ఉపాధి అవకాశాలు తీసుకువస్తున్నాడని, దీంతో వలసలు ఆగిపోయి, నేడు స్వరాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ముందుకు వస్తున్నానని, ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే కోనరావుపేట మండలాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని, పోడు భూముల సమస్యలు, ఎక్ సాల్ పట్టా, మిగతా అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడకు గ్రామస్తులు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికి, గజామాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. పలు ప్రాంతాల్లో మహిళలు నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మార్క్ ఫెడ్ చైర్మన్ బండ నర్సయ్య యాదవ్, ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, మాజీ ఎంపిపి మ్యాకల రజని, మండల మహిళ విభాగం అధ్యక్షురాలు సంధ్య, యువజన విభాగం అధ్యక్షుడు జీవన్ గౌడ్ లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏకగ్రీవ తీర్మానం చేసిన పలు సంఘాల సభ్యులు, గొల్లపల్లి గ్రామస్తులు
నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకే ఉంటుందని గొల్లపల్లి(నిమ్మపల్లి) గ్రామస్తులతో పాటు వెంకట్రావు పేట గ్రామంలోని వృద్ధుల సంఘం, వికలాంగుల సంఘం, గ్రామాభివృద్ధి కమిటీ, రజక సంఘాలతో పలు కుల సంఘాల సభ్యులు తీర్మానం చేశారు. అనంతరం తీర్మానం చేసిన సంఘం సబ్యులకు చల్మెడ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మృతుడి కుటుంబ సబ్యులకు పరామర్శ
కోనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన పల్లం లక్ష్మణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మృతిచెందగా విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావులు శనివారం మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి ఇద్దరు చిన్నారులు ఉన్నారనే విషయం తెలుసుకుని రాబోయే రోజుల్లో చిన్నారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.