రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పెరుగుతున్న “డాక్యుమెంట్ రైటర్లు”?
కాపీ–పేస్ట్ పొరపాట్లతో లక్షలు నష్టపోతున్న ప్రజలు..!
నేటిధాత్రి, వరంగల్.
నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ, వారి పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ఎవడు పడితే వాడు డాక్యుమెంట్ రైటర్ అవతారం ఎత్తుతున్నాడు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుభవం, న్యాయపరమైన అవగాహన లేకుండానే కేవలం కాపీ–పేస్ట్ విధానంలో పత్రాలు తయారు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది జూనియర్ న్యాయవాదులు కూడా సీనియర్ న్యాయవాదులకు తెలియకుండా డాక్యుమెంట్ రైటర్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే పత్రాలు సక్రమంగా సిద్ధం చేస్తున్నారా అంటే అనుమానాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని మరుసటి రోజు గృహప్రవేశం నిర్వహించుకోవాలని భావించిన కుటుంబానికి భారీ షాక్ తగిలింది. డాక్యుమెంట్లో తీవ్రమైన తప్పిదం ఉండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటికే రూ.3 లక్షల చలానా చెల్లించిన తర్వాత లోపం బయటపడటంతో కార్యాలయ సిబ్బంది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
చలానా డబ్బులు వృథా కావడంతో పాటు గృహప్రవేశం కూడా వాయిదా పడింది. “ఏమైంది సారు?” అని ప్రశ్నిస్తే “రేపు మాపు చూస్తాం” అంటూ ఫోన్ ద్వారా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
“ఎవరు చేసే పని వాళ్లే చేయాలి. చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి” అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సగం సగం తెలిసిన పరిజ్ఞానంతో కీలకమైన రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేయడం ప్రజలకు ప్రమాదకరమని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుకుగా మాట్లాడటం ఒకే కావొచ్చు కానీ, చట్టపరమైన పత్రాలు తయారు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లపై పర్యవేక్షణ కఠినతరం చేయాలని, అనుభవం ఉన్నవారికే అనుమతి ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇలాంటి తప్పిదాలు కొనసాగి మరింత మంది ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
