తేజస్వీ వర్సెస్ తెలంగాణ బీజేపీ సెల్ఫ్ గోల్?

తేజస్వీ వర్సెస్ తెలంగాణ బీజేపీ సెల్ఫ్ గోల్?

 

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు సెన్సేషన్ సృష్టిస్తోంది.. అదే తేజస్వీ సూర్య! పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనను భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చిచ్చు పెట్టాయి. నిజానికి రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్ మోడల్’ పాలనపై ఆయన వేసిన పంచ్‌ల కంటే, విభజనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఒక పవర్ ఫుల్ వెపన్‌లా దొరికాయి. ఇంకేముంది, తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో నేతలంతా వరుసగా రంగంలోకి దిగిపోయారు.

​ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తేజస్వీ సూర్యను ‘వెధవ’ అని సంబోధిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన అలా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని, ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించడమే కాకుండా.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హరీష్ రావు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం, ఇక్కడి పోరాటం గురించి తేజస్వీకి కనీస అవగాహన లేదంటూ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌ కాంగ్రెస్ నేతలంతా దాడి మొదలు పెట్టారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కూడా ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

తేజస్వీ వ్యాఖ్యలను ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే తేజస్వీ సూర్య ఉద్దేశం విభజనను కించపరచడం కాదని, కాంగ్రెస్ ఆనాడు విభజన చేసిన ‘అస్తవ్యస్త’ తీరును మాత్రమే ఇండియా-పాక్ తో పోల్చారని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా, లోకల్ ఇష్యూస్ పై బీజేపీని కార్నర్ చేయడానికి ప్రత్యర్థులకు తేజస్వీ సూర్య కావాల్సిన కంటెంట్ అయితే ఇచ్చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version