లెనిన్ మార్గమే దోపిడి నిర్మూలనకు దిక్సూచి
మార్క్సిజాన్ని ఆచరణలో చూపిన మహా విప్లవకారుడు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నేటిధాత్రి ప్రతినిధి,వరంగల్ జిల్లా:
ప్రపంచ చరిత్రను మలుపుతిప్పిన మహా విప్లవకారుడు వ్లాదిమీర్ లెనిన్ అని, మార్క్సిజాన్ని కాలానుగుణ పరిస్థితులకు అన్వయించి ఆచరణలో నిరూపించిన గొప్ప యోధుడు ఆయనేనని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. దోపిడి, అసమానతలకు ప్రత్యామ్నాయం మార్క్సిజమేనని, కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.లెనిన్ 156వ జయంతి సందర్భంగా బుధవారం వరంగల్ ఓంకార్ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ, రష్యాలో బోల్షివిక్ పార్టీ స్థాపించి జార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి 1917లో కమ్యూనిస్టు వ్యవస్థను అమలు చేసిన నాయకుడు లెనిన్ అని పేర్కొన్నారు.అనేక రష్యన్ రాష్ట్రాలను ఏకం చేసి సోవియట్ రష్యాగా రూపుదిద్దిన లెనిన్, శ్రామిక వర్గానికి దిక్సూచి చూపారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో చైనా, క్యూబా, కొరియా, వియత్నాం వంటి దేశాలు సోషలిస్టు విధానాలను అవలంబించాయని తెలిపారు. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి సమాన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, స్థానిక నాయకులు రవి, రాజు, వెంకన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
