RS పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటన

RS పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటన

కవిత అన్నంత పని చేశారు. తన పార్టీ పేరును టీఆర్ఎస్‌గా ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటించడానికి సాంకేతిక ఇబ్బందులు రావడంతో..తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ముహుర్తం ప్రకారం ఉదయమే కవిత కొత్త పార్టీ పేరు , జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావసభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేశారు. కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించినా .. దాదాపుగా యాభై వేల మంది హాజరయ్యారు.

పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన గా ప్రకటించడం వెనుక కవిత వ్యూహాత్మక ఆలోచన కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన ఏ విధంగానైతే ప్రాంతీయ అస్తిత్వం కోసం తీవ్రస్థాయిలో పోరాడుతుందో, అదే తరహాలో తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామనే సంకేతాన్ని ఆమె పంపారు. కేవలం రాజకీయ పార్టీగానే కాకుండా, తెలంగాణ హక్కులను కాపాడే ఒక రక్షణ కవచంలా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిపోయిన తరుణంలో, తెలంగాణ గుండె చప్పుడు వినిపించే అసలైన ప్రాంతీయ పార్టీ ఇదే అని ఆమె భావన

మరోవైపు పార్టీ పేరు ప్రకటనతోనే బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు కవిత . ఇకపై టీఆర్‌ఎస్‌గా మార్చుకునే వీలు లేకుండా చేశారు. 2023 ఎన్నిలక ముందు దేశ రాజకీయాల్లో అడుగు పెట్టాలని టీఆర్‌ఎస్ పేరును కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చేశారు కేసీఆర్. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీతో యుద్ధం చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే అదే పేరుతో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దీంతో చాలా మంది విమర్శలు చేశారు. తెలంగాణతో ఉన్న సెంటిమెంట్‌ పోయిందని ఇది కూడా ఓటమికి ఒక కారణంగా విశ్లేషించారు.

ప్రజల్లోకి మరోసారి టీఆర్‌ఎస్ పేరుతో వెళ్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని నేతలు భావించారు. ఇదే విషయం చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా మార్చే డిమాండ్ గురించి ఆలోచిస్తున్నామని కేటీఆర్ అన్నారు. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ వద్ద చర్చించాల్సి ఉంటుందని కూడా అన్నారు.

కేటీఆర్ ఇంకా చర్చల దశలోనే ఉండగానే కవిత సిక్సర్ కొట్టారు. వారికి ఉన్న ఆప్షన్‌ను ఎత్తుకుపోయారు. టీఆర్‌ఎస్ అనే పేరుతో ప్రత్యేకంగా పార్టీ పెట్టారు. ఆ టీఆర్‌ఎస్‌, ఈ టీఆర్‌ఎస్ వేరు అయినప్పటికీ ఇకపై అలాంటి పేరుతో పార్టీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ప్రారంభించిన మొదటి రోజే బీఆర్‌ఎస్‌కు ఇది షాకింగ్ విషయమని అంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version