బొల్లికొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి దిశగా అడుగులు
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పర్యాటక శాఖ అధికారులు మంగళవారం రోజు సందర్శించారు. సామాజిక కార్యకర్త రమేష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలయాన్ని పరిశీలించిన అధికారులు, ఇది అత్యంత పురాతనమైన పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఈ దేవస్థానాన్ని ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించి, భక్తులకు అనుకూలంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త రమేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఐదు నుండి ఆరు లక్షల మంది భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. అయితే, ఆలయంలో తగిన వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అందువల్ల ప్రభుత్వం ఈ ఆలయాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసి, భక్తుల భద్రతతో పాటు కనీస సౌకర్యాలను కల్పించాలని ఆయన కోరారు. ఈ దేవస్థానం భవిష్యత్తులో “మినీ భద్రాచలం”గా పరిణమించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ, పంచాయతీ కార్యదర్శి పెంటయ్య, కారోబార్ పాషా, మాజీ సర్పంచ్ వెంకన్న, బాణోత్ యాకు, శీను, గుగులోతు రాములు, గ్రామ ప్రజలు, ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.
