సాహసం సేయరా డింభకా…

సాహసం సేయరా డింభకా!

 

పాతాళ భైరవి ఈ సినిమా పేరు వినగానే- ‘సాహసం సేయరా డింభకా..’ డైలాగ్‌ అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. ఈ డైలాగ్‌ తొలిసారి ఎప్పుడు విన్నానో గుర్తులేదు. కానీ జీవితంలో ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురయినప్పుడు ఈ డైలాగే…

వెండితెర జానపద అద్భుతం – పాతాళ భైరవి. తెరపైన.. తెరవెనుక పనిచేసిన ప్రతిభావంతుల చాతుర్యం, కార్యదీక్ష తోడై పురుడుపోసుకున్న ఈ చిత్రం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇప్పటికీ నిత్య నూతనంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

పాతాళ భైరవి ఈ సినిమా పేరు వినగానే- ‘సాహసం సేయరా డింభకా..’ డైలాగ్‌ అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. ఈ డైలాగ్‌ తొలిసారి ఎప్పుడు విన్నానో గుర్తులేదు. కానీ జీవితంలో ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురయినప్పుడు ఈ డైలాగే గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ డైలాగ్‌ తొలి సారి థియేటర్లలో ధ్వనించి 75 ఏళ్లు అయిందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా తెలుగు ప్రేక్షకులు ఈ డైలాగ్‌ను ఆదరించటం కూడా గొప్ప విషయమే!

నేను నా జీవితంలో కొన్ని వేల సినిమాలు చూసి ఉంటా! వేల డైలాగ్‌లు విని ఉంటా. కానీ వీటన్నింటిలోను పాతాళ భైరవికి ఒక ప్రత్యేక స్థానముంది. నేను దర్శకుడిగా మారటంలో ఈ చిత్ర ప్రభావం కూడా ఎంతో ఉంది. మా నాన్నగారు ఒక నిర్మాత. దీనితో నా చిన్నతనమంతా సినీ ప్రపంచపు వీధుల్లోనే గడిచింది. కెమెరాలు, ఎడిటింగ్‌ సూట్స్‌, డైలాగ్‌ రిహార్సల్స్‌, లైట్లు, మేక్‌పలు నాకు కొత్త కాదు. కానీ ఇప్పటికీ కూడా ఎప్పుడైనా పాతాళ భైరవి సినిమాను చూసినప్పుడు- ఈ షాట్స్‌ను కె.వి. రెడ్డి ఎలా తీసి ఉంటారు?అనే ఆలోచన మెదడును తొలుస్తూనే ఉంటుంది. అన్ని పాళ్లు సమానంగా పడిన గుత్తి వంకాయ కూర ఎంత రుచిగా ఉంటుందో- పాతాళ భైరవి సినిమా కూడా అలాగే ఉంటుంది. నటీనటుల నటనా వైదుష్యం.. దర్శకత్వ ప్రతిభా విన్యాసం.. కళాదర్శకుల పనితనం.. కెమెరాను ఉపయోగించుకున్న తీరు- ఇప్పటికీ ఈ చిత్రాన్ని అపురూపమైన కళాఖండంగా నిలబెట్టాయి. ఒక దర్శకుడిగా నాకు ఈ విషయాలన్నీ పాఠాలే! ముందు కళాదర్శకుల పనితనం గురించి చెప్పుకుందాం! ఈ సినిమా మొత్తాన్ని ఒక స్టూడియోలో నిర్మించారు. నేపాళ మాంత్రికుడి గుహలు, పాతాళ భైరవి మాయా ప్రపంచం, కోటలు ఇవన్నీ సెట్స్‌ అంటే నమ్మబుద్ధి అవదు. మనకు అనేక ఆశలు.. భయాలు.. ఊహలు ఉంటాయి. ఇవన్నీ మన మనసులో మెదులుతున్నంత వరకూ పర్వాలేదు. వాటిని అక్షర రూపంలో పెట్టడం కూడా కొంత వరకు సాధ్యమే! కానీ వాటిని దృశ్యరూపంలో మలచటం అంత సులభం కాదు. సీజీ, ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అందుబాటులో లేని సమయంలో సీనుకు తగినటువంటి సెట్‌లను నిర్మించి ప్రేక్షకులను మెప్పించటం అసాధ్యమే! కానీ దర్శకుడు కె.వి.రెడ్డి దీనిని సుసాధ్యం చేశారనే చెప్పాలి. అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించటం ఎంత కష్టమో ఒక దర్శకుడిగా నాకు తెలుసు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version