రాజీవ్ ఆరోగ్యశ్రీ నా ప్రాణాలను కాపాడింది.
చిట్యాల, నేటిధాత్రి :
తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాలకు పేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలు ఇతర వైద్య చికిత్సలు ఉచితంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ పి విక్రమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని అన్నారు. చిట్యాల మండల కేంద్రం సమీప వెంకట్రావుపల్లి (సి) గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగితే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్న రోగిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారుల ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్ర గుర్రపు రాజమౌళి మంగళవారం పేషంటు ను కలిసి వివరాలు సేకరించారు. వెంకట్రావుపల్లి (సి)గ్రామానికి చెందిన రంపిస లింగాభాయి(84) అను మహిళ వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఈనెల 10న తమ ఇంటి సమీపంలో కాలుజారి కింద పడగా ఆమెకు ఎడమ కాలు విరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పరకాల పట్టణంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పటల్ ఐనా సుశ్రుత హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి తెల్ల రేషన్ కార్డు ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆమెకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా పేషంట్ లింగాభాయి మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం నా ప్రాణాలను కాపాడిందని ఆపరేషన్ కోసం హాస్పటల్ వారు నావద్ద చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి నాణ్యమైన వైద్యం అందించి ఉచిత భోజనం వసతి రవాణా చార్జీలు మెడిసిన్ అందించి తనను ఇంటికి చేర్పించారని ఆమె తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే తన కుటుంబం అప్పుల పాలు అయ్యేదని ఇబ్బందులు పడే వారమని ఆమె అన్నారు. నా ప్రాణాలను కాపాడిన రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి విక్రమ్ టీం లీడర్ యామంకి అనిల్ సుశ్రుత హాస్పిటల్ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.