దేవాలయం మీద పెత్తనం కోసం కోర్టు మెట్లు…

దేవాలయం మీద పెత్తనం కోసం కోర్టు మెట్లు?

శివరాత్రి వేళ కాశీబుగ్గ గుడిలో రాజకీయ వేడి..

నూతన కమిటీ ఏర్పాటుపై తీవ్ర వివాదం

దళిత యువకుడు, పేద మహిళలకు చోటు కల్పించడంపై అభ్యంతరాలా?

కోర్టు ఆదేశాల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు

ఆలయ వ్యవహారాల్లో ఆధిపత్య పోరాటం? కొత్త కమిటీ రాగానే కోర్టు హడావిడి ఎందుకు?

సమాన ప్రాతినిధ్యానికి అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలా?

కాశీబుగ్గ రాజకీయాలు ఆ నలుగురి చేతిలోనే?

కార్పొరేటర్ మాటల వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ?

నేటిధాత్రి, కాశీబుగ్గ, వరంగల్.

 

కాశీబుగ్గలో రాజకీయాలు కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయనే విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయ నూతన కమిటీ ఏర్పాటు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు “నాలుగు స్థంభాల నాటకాలు” బట్టబయలయ్యాయనే చర్చకు దారితీశాయి. ఆలయ కమిటీలో యువత, దళితులు, పేద మహిళలకు ప్రాధాన్యం కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త కమిటీ ఏర్పాటవుతుందనే సమాచారం వెలువడగానే కోర్టు ఆదేశాల పేరుతో అడ్డంకులు సృష్టించడం రాజకీయ వ్యూహమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. “ఇన్నాళ్లు ఆలయ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇప్పుడు మాత్రం కొత్త ముఖాలు ముందుకు వస్తేనే హడావిడి ఎందుకు?” అని యువత ప్రశ్నిస్తోంది. ఆలయం ఎవరి స్వంతం కాదని, ఇది ప్రజల ఆధ్యాత్మిక స్థలమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. దళిత యువకుడికి కమిటీలో స్థానం ఇవ్వడాన్ని వ్యతిరేకించడం సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. పాత రాజకీయాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే ఈ వివాదం రగిలించబడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల అభిప్రాయం ప్రకారం, కొత్త తరం ముందుకు రావడం కొందరికి అసహనంగా మారిందని, అదే కారణంగా ఆలయ వ్యవహారాలను రాజకీయ రంగంలోకి లాగుతున్నారని చెబుతున్నారు.
ఇప్పటికైనా ఆలయ పరిపాలన పారదర్శకంగా, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కొనసాగాలని భక్తులు కోరుతున్నారు. కాశీబుగ్గ రాజకీయాల్లో “నాలుగు స్థంభాల నాటకం”కి తెరపడాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే….

మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ కాశీబుగ్గ శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆలయ నూతన కమిటీ ఏర్పాటు నేపథ్యంలో నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యంగా కమిటీలో ఒక దళిత యువకుడికి, ఇద్దరు పేద మహిళలకు అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ కార్పొరేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువత, దళిత సంఘాలు, పలువురు భక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత, యువతకు ప్రాధాన్యం, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు యువకులు చెబుతున్నారు. అయితే దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని వారు స్పష్టం చేస్తున్నారు.

➤ కోర్టు ఆదేశాల వెనుక రాజకీయాలా?

నూతన కమిటీ ఏర్పాటుతో తన ప్రభావం తగ్గిపోతుందనే ఆందోళనతోనే సంబంధిత కార్పొరేటర్ కోర్టు ఆర్డర్లు తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ఇన్నాళ్లు జరిగిన పండుగల సమయంలో కోర్టు ఆదేశాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం కొత్త కమిటీ వస్తేనే ఎందుకు?” అని యువత ప్రశ్నిస్తోంది. కోర్టు పేరుతో కమిటీ సభ్యులకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దసరా వేడుకల సమయంలో ఎలాంటి కోర్టు ఆదేశాలు తీసుకురాలేదని, ఇప్పుడు మాత్రం శివరాత్రి ఉత్సవాల ముందు కోర్టు పేరుతో అడ్డుపడటాన్ని స్థానికులు అనుమానాస్పదంగా చూస్తున్నారు.

➤ “ఇది ఎవరి స్వంత గుడి కాదు”

కమిటీలో దళిత యువకుడికి చోటు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. “మూడు రోజుల పాటు ఒక దళిత యువకుడు కమిటీలో ఉంటే ఏమవుతుంది? ఇది ఎవరి స్వంత గుడి కాదు. ఇది ప్రజల ఆలయం” అంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో అదే యువకుడికి రాజకీయ కార్యక్రమాల్లో మద్దతుగా నిలిచిన నాయకులు, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

➤ పాత వ్యవహారాలపై కొత్త ప్రశ్నలు

ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఉన్న షట్టర్ల కిరాయి కొందరు కాంగ్రెస్ నాయకులు వసూలు చేసే వ్యవహారం, గత పండుగల నిర్వహణలో జరిగిన ఖర్చుల వివరాలు వంటి అంశాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై స్పష్టమైన స్పందన రాకపోవడం గమనార్హం.

➤ ఆలయం ఐక్యతకు ప్రతీకగా నిలవాలి

“ఆలయం సామాజిక ఐక్యతకు ప్రతీకగా ఉండాలి గానీ, వ్యక్తిగత రాజకీయాల వేదికగా మారకూడదు” అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కొత్త తరం ముందుకు రావడం కొందరికి ఇష్టం లేకపోవచ్చని, అదే కారణంగా నూతన కమిటీపై అపప్రచారం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. కమిటీలో దళిత యువకుడికి చోటు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని దళిత సంఘాలు మండిపడ్డాయి.

వివాదం మరింత ముదరకముందే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షించాలని భక్తులు కోరుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే ఆలయం నిజమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version