హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కీలక లేఖ…

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కీలక లేఖ

 

హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. హిడ్మా, శంకర్లు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వస్తే పోలీసులు పట్టుకుని చంపేశారని ఆరోపించారు.

 మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లనే వీళ్ళు దొరికిపోయారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లినట్లు చెప్పారు.
కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళితే వాళ్ళని పట్టుకున్నారన్నారు. వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఆంధ్రా పోలీసులు చంపేశారని ఆరోపించారు. హిడ్మా, శంకర్ల ఎన్‌కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ లేఖలో స్పష్టం చేశారు.

కాగా.. గత నెలలో (నవంబర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావో కీలక నేత హిడ్మాతో పాటు ఆయన భార్య, పలువురు అనుచరులు హతమవ్వగా, నవంబర్ 19న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ శంకర్ సహా ఆరుగురు మృతి చెందారు. ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. అలాగే ఘటనా స్థలంలో దొరికిన డైరీలోని సమాచారం ఆధారంగా ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేసి దాదాపు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version