మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..

 మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

 

మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు గోదావరి నదిలోని ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు.

Mouni Amavasya
నేటితో పుష్యమాసం ముగుస్తోంది. పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరాయణంలో వచ్చే తొలి అమావాస్య. అసలు దీనికి మౌని అమావాస్య అని పేరు రావడానికి గల కారణాలను వేద పండితులు వివరిస్తున్నారు. ఉత్తరాయణ కాలంలో వచ్చే ఈ రోజున ఉపాసకులు, సాధువులు తదితరులు మౌనంగా వారి వారి సాధనను కొనసాగిస్తారు. ఉత్తర భారతదేశంలో మౌనవ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. అందుకు ఈ మౌనవ్రతానికి ప్రతీకగా దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. తపస్సిద్ధి పొందిన వారిని మౌని అని అంటారు. తపస్సు అనగా తప ఆలోచన అని అర్థం. ఇంకా చెప్పాలంటే.. సంకల్పించిన విషయం మీద తప్ప వేరే ఆలోచన లేకపోవడం అని అంటారు. ఈ రోజు సముద్ర లేదా నదీ స్నానం చేయడం మంచిదని అంటారు.
చొల్లంగి అమావాస్య..

ఈ మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. గోదావరి నదిలోని ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు. ఇలా గోదావరిలో స్నానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగుతాయంటారు. ఈ సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య రోజు చొల్లంగి వద్ద గోదావరి సంగమ స్నానంతో ముగుస్తుంది. అందుకే దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు.

సూర్యభగవానుడు..

ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడికి ఆదివారం అత్యంత ఇష్టమైన రోజు. ఈ ఏడాది జనవరి 18వ తేదీ మౌని అమావాస్య.. ఆదివారం వచ్చింది. ఈ రోజు విశేషమైన దినంగా చెబుతారు. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య రోజు.. సముద్ర లేదా నదీ స్నానం చేసి సూర్యడికి అర్ఘ్యం సమర్పించి.. ఎర్రని పువ్వులు, ఎర్ర చందనంతో అర్చన చేయాలి. దీనివల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుజడితోపాటు రాహుకేతు గ్రహ దోషాలు తొలగి.. ఆరోగ్య ప్రదాయకుడైన ప్రత్యక్ష భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు.. బ్రహ్మీ ముహూర్తంలో.. సూర్యోదయానికి ముందు ఆ తర్వాత 90 నిమాషాల్లోపు స్నానం చేయడం మంచిదని అంటారు.

పితృ కార్యాలు..

మౌని అమావాస్య రోజు.. పితృ శాపాలు, జాతకంలో పితృ దోషాలు ఉన్న వారు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. సంక్రాంతి రోజు ఆచరించవల్సిన దానాలు చేయలేకుంటే.. ఈ అమావాస్య రోజు చేయడం వల్ల మంచి ఫలితాన్ని అందుకుంటారని పండితులు అంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version