ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రెవెన్యూ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాల మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కొక్కసారి నిర్ణీత పని వేళలను మించి పని చేయవలసి ఉంటుందని తెలిపారు.ఈ తరుణంలో రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడంతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు.కార్యాలయాలలో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పని చేయడంతో 40 సంవత్సరాల వయసుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని,నిత్యజీవితంలో వ్యాయామం ఒక భాగంగా పాటించాలని తెలిపారు.అనంతరం ఆర్.బి.హెచ్.వి. పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని,ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్ 1, 2 పరీక్ష ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.50 గం||ల వరకు,ఫిజికల్ సైన్స్,బయాలజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గం||ల నుండి 11 గం॥ ల వరకు,ఎస్.ఎస్.సి. ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్ష ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు,మినహా మిగతా పరీక్షలు ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.30 గం||ల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇందు కొరకు జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
