లక్కీ డ్రా పేరుతో కార్ల అమ్మకాలు..

లక్కీ డ్రా పేరుతో కార్ల అమ్మకాలు

అధిక వసూళ్లపై ఆరోపణలు

చట్ట బద్ధమా? ప్రజలు జాగ్రత్త..!

వరంగల్, నేటిధాత్రి.

లక్కీ డ్రా పేరుతో 200రూపాయలు చెల్లిస్తే కారు సొంతమవుతుందని ప్రచారం చేస్తూ వరంగల్ నగరంలో లక్కీ డ్రా స్కీములు మళ్లీ వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఉర్సు గుట్ట శివారులో ఓ వ్యక్తి పాత కార్లను లక్కీ డ్రా ద్వారా ఇస్తామని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రచారం ప్రకారం, ప్రతి వ్యక్తి నుంచి నిర్దిష్ట మొత్తం 200 నుండి 2వేల వరకు వసూలు చేసి కూపన్లు ఇస్తున్నారు. అనంతరం లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి కారు అందజేస్తామని చెబుతున్నారు. అయితే ఎంతమంది నుంచి డబ్బులు సేకరించారు, ఎన్ని కూపన్లు ముద్రించారు, మొత్తం వసూళ్లు ఎంత అన్న వివరాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.

కార్ల స్థితిగతులపై సందేహాలు

లక్కీ డ్రా ద్వారా ఇస్తున్న కారు ఏ కండిషన్‌లో ఉందో స్పష్టత లేదని పలువురు పేర్కొంటున్నారు. కారు పాతదా, కొత్తదా అన్నది కూడా వెల్లడించడం లేదని ఆరోపిస్తున్నారు. వాహనం విలువ, రిజిస్ట్రేషన్ వివరాలు, యాజమాన్య పత్రాలు వంటి అంశాలు ప్రజలకు తెలియజేయకుండా కేవలం కూపన్ల విక్రయంపైనే దృష్టి పెట్టుతున్నట్లు సమాచారం.

కారు ధర కంటే అధిక వసూళ్లు?

లక్కీ డ్రా కూపన్ల ద్వారా సేకరించే మొత్తం కారు అసలు ధర కంటే రెండింతలు ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. కొందరు నిర్వాహకులు ఏకంగా కొత్త కారు కొనుగోలు చేసి లక్కీ డ్రా పేరుతో విక్రయాలు చేపడుతున్నారని సమాచారం. ఈ విధంగా భారీ లాభాలు పొందుతూ అధికారులను సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చట్టపరమైన అంశం

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, డబ్బులు వసూలు చేసి బహుమతులు ఇవ్వడం “లాటరీ” లేదా “ప్రైజ్ చిట్” పరిధిలోకి రావచ్చు. ఇది ప్రైజ్ చిట్స్ మరియు సర్కులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ 1978 మరియు ఇతర సంబంధిత చట్టాల కింద నియంత్రణలో ఉంటుంది. సరైన అనుమతులు లేకుండా ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడం చట్టవ్యతిరేకం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

గతంలో కూడా ఇదే తరహాలో లక్కీ డ్రా నిర్వహించగా స్థానిక పోలీసులు పిలిపించి హెచ్చరించినట్లు తెలిసింది. అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

చర్యలు తీసుకోవాలి

లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రకటనలను నమ్మే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version