ఆర్టీసీ కార్మికుడి మృతదేహంపై రాజకీయాలు ఎందుకు?
శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వద్ద 5 నిమిషాలు ఉంచేందుకు అనుమతి ఇవ్వాలన్న బండి సంజయ్
కుటుంబ సభ్యులు, కార్మికుల కోరికను పట్టించుకోలేదని విమర్శ
పోలీసుల తీరుపై, ప్రభుత్వంపై తీవ్ర కేంద్రమంత్రి ఆగ్రహం
నర్సంపేట, నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో కార్మికుడు శంకర్ గౌడ్ భౌతిక దేహానికి నివాళులు అర్పించే విషయంలో ప్రభుత్వం అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. నర్సంపేటలో విలేకర్లతో మాట్లాడిన ఆయన, డెడ్ బాడీతో పోలీసుల రాజకీయాలు చేయడం సరికాదన్నారు.శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద కొద్ది సేపు ఉంచి నివాళులు అర్పించాలన్నది కుటుంబ సభ్యులు, కార్మికుల కోరిక అని తెలిపారు. ఆర్టీసీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న డిపో వద్ద చివరిసారి చూసే అవకాశాన్ని ఇవ్వాలని కోరినా పోలీసులు అనుమతి నిరాకరించడం బాధాకరమన్నారు.
కేవలం ఐదు నిమిషాలపాటు మృతదేహాన్ని డిపో వద్ద ఉంచేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య రాకుండా తానే చూసుకుంటానని హామీ ఇచ్చినా స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు.శంకర్ గౌడ్ ఇంటి వద్ద ఏర్పాట్లు చేసిన వారిని కూడా పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ సహచరుడికి చివరి నివాళులు అర్పించాలనుకునే కార్మికులను అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు.తమపై ‘శవ రాజకీయాలు’ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండించిన ఆయన, గతంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. ఇప్పటికైనా మృతదేహాన్ని డిపో వద్ద ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించేందుకు నర్సంపేట మున్సిపాలిటీ పరిధి ముత్తోజిపేటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వస్తున్న క్రమంలో పోలీసులనుండి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ముత్తోజిపేట లోని సగృహం వద్ద డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళులు అర్పిస్తున్న క్రమంలో పోలీసులకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు తీవ్రమైన తోపులాట జరిగింది.
