ఆర్టీసీ కార్మికుల సమ్మెకు యంసిపిఐ(యు) సంపూర్ణ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు యంసిపిఐ(యు) సంపూర్ణ మద్దతు

ప్రభుత్వం మొండి వైఖరి విడిచిపెట్టి వెంటనే చర్చలు జరపాలి

యంసిపిఐ(యు) పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

హైదరాబాద్,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెకు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) — యంసిపిఐ(యు) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరే ఈ సమ్మెకు ప్రధాన కారణమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విమర్శించారు.హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్‌లో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అమోఘమని గుర్తుచేశారు. అలాంటి పోరాట వర్గం డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు.గతంలో బీఆర్‌ఎస్ పాలనలో ఆర్టీసీ సమ్మెలు దీర్ఘకాలం కొనసాగి, ప్రభుత్వ నియంతృత్వ వైఖరి కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడవడం తగదని హెచ్చరించారు.ప్రభుత్వం తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని యంసిపిఐ(యు) డిమాండ్ చేసింది.

ప్రధాన డిమాండ్లు..

ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా ప్రకటించి విలీన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.
యూనియన్లను పునరుద్ధరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి.
వేతన సవరణ, పీఆర్‌సీ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.
ఎలక్ట్రిక్ బస్సుల పెంపును తక్షణమే ఉపసంహరించాలి.ఇవే కాకుండా కార్మికుల అన్ని డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరుతున్నట్లు యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version