ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క

మంగపేట నేటిధాత్రి:

ప్రజల సమస్యలను గ్రామాలలోనే క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, నేరుగా ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు, మంగపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

మండలానికి విచ్చేసిన మంత్రి సీతక్క మొదట మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మల్లూరు, మంగపేట గ్రామాలలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…. గ్రామాలలోని సమస్యలను నేరుగా పరిష్కరించడానికి గ్రామాలలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు.

మారుమూల ప్రాంతాలలో ఉండే గ్రామస్తులు కార్యాలయాలకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో ఉంచుకొని స్వయంగా ఆ గ్రామాలలోనే ప్రజా దర్బార్ నిర్వహించి, సమస్యలపై గ్రామ అభివృద్ధిపై కూలంకషంగా చర్చించుకోవడానికి అణువుగా ఉండటానికి ఇలాంటి కార్యక్రమాలను ప్రజలతో మమేకమై ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించడం వలన ప్రజలు సమస్యల నుంచి ఉపశమనం కలగడమే కాక అనేక ప్రయోజనాలు చేకూరుతూ మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, పంచాయతీ రాజ్ స్టేట్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, తహశీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ బి.బద్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version