రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక రూపొందించాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
శనివారం ఐడీఓసీ కార్యాలయంలో పోలీస్, రవాణా, ఆర్టీసీ, వైద్య, విద్యా, సంక్షేమ శాఖలు, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రహదారి ప్రమాదాలపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాలకు కారణాలు గుర్తించి వాటి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి అవసరమైన ఇంజినీరింగ్ మార్పులు చేపట్టాలని, వేగ నియంత్రణ, హెల్మెట్ సీటు బెల్ట్ వినియోగాన్ని కఠినంగా అమలు చేయాలని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రహదారి భద్రతా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు.
పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన 10 బ్లాక్ స్పాట్స్ ను పోలీస్, రవాణా, రహదారుల అధికారులు పరిశీలించి ఇంటర్ వెన్షన్స్ తయారు చేయాలని సూచించారు. రహదారులపై సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనవరి 2026 చేపట్టనున్న రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహణకు శాఖల వారిగా కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
ఎఎస్పీ నరేష్ కుమార్, ఆర్టిఓ సంధాని, ఆర్టీసీ డిఎం ఇందు, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, డీఈఓ రాజేందర్, జాతీయ రహదారుల డీఈ కిరణ్, ఐఆర్డీ డిఆర్ఎం లక్ష్మణ్, అన్ని శాఖల
సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
