రెండేళ్లయిన.. రాళ్ల రోడ్డులోనే ప్రయాణం..

రెండేళ్లయిన.. రాళ్ల రోడ్డులోనే ప్రయాణం..
7 కిలోమీటర్లు ఇదే దుస్థితి..
రిలే దీక్షతో .. నస్కల్ రోడ్డు పనులు పూర్తి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత రెండేళ్ల నుండి రాళ్ల రోడ్డు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. నిజాంపేట మండలం చల్మెడ కమాన్ నుండి నందగోకుల్ గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రోడ్డు పై కంకర పోసి వదిలేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఈ రోడ్డు గుండా గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు వెళ్లాలంటే భయాందోళనకు గురికావాల్సి వస్తుంది. కంకర తేలిన రోడ్డులో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి కింద పడిపోతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ రోడ్డు గుండా రామాయంపేట, నిజాంపేట మండలాలకు ప్రజలు అధిక సంఖ్యలో వెళుతుంటారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు వేస్తామని పాత తార్ రోడ్డును తీసేసి.. కంకర పోసి వదిలేయడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో.. నస్కల్ నిజాంపేట రోడ్డు పై కూడా కంకర పోసి వదిలేయడంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు నిజాంపేట మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పందించి.. సదర్ కాంట్రాక్టర్ కు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించడంతో నిజాంపేట, నస్కల్, రాంపూర్ గ్రామాలకు రోడ్డు వేశారు.
కానీ చల్మెడ కమాన్ – నందగోకుల్ గ్రామాలకు మాత్రం రోడ్డు వెయ్యకపోవడంతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే రోడ్డు మరవత్తులు చేపట్టాలని వేడుకుంటున్నారు.

• నేను కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాను. ఈ రోడ్డుపై పని పూర్తవుగానే ఇంటికి వెళ్తాను. రాత్రి వేళలో ఈ రోడ్డుపై వెళ్లాలంటే భయంగా ఉంది. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి.
ప్రభాకర్ రెడ్డి 
 నంద గోకుల్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version