దళిత మహిళా వైస్ చైర్మన్‌కు అవమానం జరిగింది
ప్రోటోకాల్ పాటించని కమిషనర్ పై కలెక్టర్ కు పిర్యాదు చేస్తాం
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్
పరకాల,నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీలో దళిత మహిళా వైస్ చైర్మన్‌కు అవమానం జరిగిందంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ తీవ్రంగా మండిపడ్డారు.శుక్రవారం నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో ప్రోటోకాల్‌ను పాటించకుండా వైస్ చైర్మన్‌ను వేదికపైకి ఆహ్వానించకపోవడం వివక్షకు నిదర్శనమని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా ఏకు శంకర్ మాదిగ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వడం అధికారుల బాధ్యత అని అన్నారు.ముఖ్యంగా దళిత మహిళగా ఉన్న వైస్ చైర్మన్‌ను వేదికపైకి పిలవకపోవడం తీవ్ర అవమానకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు.స్థానిక ఎమ్మెల్యే కుట్రపూరితంగానే ఎలా చేశారని ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్‌ను పూర్తిగా విస్మరించి కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు.అధికారిక కార్యక్రమాల్లో చైర్మన్,వైస్ చైర్మన్ సహా అన్ని ప్రజాప్రతినిధులను గౌరవప్రదంగా ఆహ్వానించడం విధిగా ఉండాలని తెలిపారు.ఈ ఘటనకు మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని,వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.మున్సిపాలిటీ చట్టం ప్రకారం వైస్ చైర్మన్ కు కచ్చితంగా స్థానం కల్పించాలని,కావాలని పిలవలేదా లేక వివక్షత చూపిస్తున్నారా అని ప్రశ్నించారు.బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.దళిత మహిళా నాయకురాలిని అవమానించే విధంగా జరిగిన ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.మున్సిపల్ కమిషనర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసి తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడడం అధికారుల బాధ్యత అని, ఇకపై ప్రోటోకాల్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు.
