ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది
బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధిన కేసు విచారణ ఈరోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో (Supreme Court) జరగనుంది. వింటర్ వెకేషన్ తరువాత తొలిసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. మరోవైపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఏడుగురిపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. నిన్న (జనవరి 15) పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వీరిపై పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ఆయన తేల్చారు. అలాగే ఇంతకుముందు ఐదుగురిపై కూడా స్పీకర్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.
