తెలంగాణలో ఎరువుల డీలర్ల బంద్ పిలుపు
పట్టణ,గ్రామాల డీలర్లు అందరం కలిసి ఐక్యత చాటాలి
రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు
పరకాల,నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల డీలర్లు ఏప్రిల్ 27న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు.ఎరువుల ఉత్పత్తిదారుల అన్యాయ విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది.హైదరాబాద్‌లోని బాబు ఖాన్ ఎస్టేట్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డీలర్లు తమ సమస్యలను ప్రస్తావిస్తూ కీలక డిమాండ్లు చేశారు.ఎరువుల సరఫరాపై వెంటనే ఎఫ్ఓఎల్ విధానం అమలు చేయాలని,ఎలాంటి లింక్ ప్రొడక్ట్స్ లేకుండా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 27న రాష్ట్రంలోని అన్ని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్,సీడ్స్ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నిజిల్లాలు,మండలాలు,గ్రామాల డీలర్లు ఐక్యంగా ముందుకు వచ్చి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
మన హక్కుల కోసం మన ఐక్యతే ఆయుధమని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామడుగు మనోహర్ రావు,రాష్ట్ర కోశాధికారి సిద్ధి నాగరాజు,పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
