భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలి

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలి

పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్

నర్సంపేట, నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమాలు చేపట్టాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్ పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) డివిజన్ కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులు అర్పించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా గుర్రం అజయ్, పార్టీ జిల్లా నాయకులు గట్టి కృష్ణ మాట్లాడుతూ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎత్తి ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం, సమసమాజ స్థాపన కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ ఘటన భగత్‌సింగ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, చిన్న వయసులోనే దేశ విముక్తి కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొని చివరకు 1931 మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీశిందని పేర్కొన్నారు.వీరంతా దోపిడీ, పీడన లేని సమసమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేశారని, వారి ఆశయ సాధన కోసం నేటి విద్యార్థులు ప్రగతిశీల ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరియు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటాలు నిర్వహించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగించాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. అలాగే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల ఉద్యమ స్ఫూర్తితో మార్చి 23 నుండి 30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ డివిజన్ నాయకులు మహేష్, ప్రణయ్, చరణ్, శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version