-సీఎం రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ విజ్ఞప్తి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 26
రాష్ట్రంలోని 20 లక్షల మంది ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల మొత్తం ఫీజు బకాయిలు రూ. 5 వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో బిసి, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజుల బకాయిలను చెల్లించకపోవడంతో లక్షలాదిమంది విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడం వలన కళాశాలల యజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని, కొన్ని కళాశాలల యజమాన్యాలు క్లాసుల నుంచి బయటకు పంపుతున్నాయని ఆరోపించారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో వారు ఇతర ఉన్నత కోర్సులు చదవడానికి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని మహేందర్ గౌడ్ కోరారు.