శివాజీ మహారాజ్ ఆశయ సిద్ధికి యువత పాటుపడాలి
మందమర్రి, నేటిధాత్రి:-
ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు చత్రపతి శివాజీ మహారాజ్ అని, శివాజీ మహారాజ్ ఆశయ సిద్దికై నేటి యువత పాటుపడాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్, నాయకులు దుర్గం అశోక్ లు పిలుపు నిచ్చారు. చత్రపతి శివాజీ జయంతి వేడుకలను సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ హిందూ కమిటీ ఆద్వర్యంలో పట్టణంలోని పాతబస్టాండ్ నుండి మార్కెట్ మీదుగా పాలచెట్టు వరకు మెగా ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత చెడు మార్గంలో పయనించకుండా మహనీయుల ఆశయాలను, ఆలోచన విధానాలను అనుసరిస్తూ, మంచి మార్గంలో పయనించి ప్రయోజకులు కావాలని సూచించారు. చత్రపతి శివాజీ విదేశీ దురాక్రమదారులతో ఎన్నో యుద్ధాలు చేసి, దేశ మహిళలను, ప్రజలను కాపాడి, హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని, అదేవిధంగా అఖండ భారతంలో ఎన్నో రాజ్యాలు మొగలులా ఆధీనంలో ఉండి, హిందువులను ఎంతో హింసిస్తుంటే, శివాజీ వారందరినీ ఓడించి, అఖండ భరత్ ను సుసాధ్యం చేసిన వీరుడని కొనియాడారు. ప్రజలంతా శివాజీ స్ఫూర్తితో దేశాన్ని కాపాడాలని, సమాజంలో ఉన్న అంతరాలను తొలగించి, అందరూ ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ లో త్వరలో ఏర్పాటు చేయబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ 50వేల రూపాయల విరాళాన్ని ప్రకటించగా, ఆయనకు పట్టణ హిందూ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ కమిటీ సభ్యులు శివ, సంతోష్, ప్రసాద్, పిట్టల సుధాకర్, ఆవుల సాగర్, మాయా రమేష్, రాకేష్, బండారి రవికుమార్, రొడ్డ మోహన్, సుమన్, దీక్షితులు, సురేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.