హెల్మెట్ లేనందుకు రూ.20 లక్షల జరిమానా.. ముజఫర్ నగర్‌లో ఏం జరిగిందంటే..
మనదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు.. బైకర్లు హెల్మెట్ ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే భారీ జరిమానాలు విధిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు.
మనదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు.. బైకర్లు హెల్మెట్ ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే భారీ జరిమానాలు విధిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఒక వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోనందుకు ఏకంగా 20 లక్షల రూపాయల ఫైన్ పడింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (scooter rider challan).
ముజఫర్ నగర్‌లోని నాయి మండి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గాంధీ కాలనీలో నవంబర్ 4న ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో అతడికి చలానా జారీ అయింది. హెల్మెట్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడికి జరిమానా విధించారు. అయితే చలానా కాపీని చూసి ఆశ్చర్యపోవడం అతడి వంతైంది. ఎందుకంటే పోలీసులు విధించిన ఆ చలాన్ మొత్తం 20.74 లక్షల రూపాయలు. అంత జరిమానా విధించడం చూసి అందరూ షాకయ్యారు (helmet rule violation).ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు (helmet challan viral). భారతీయ రోడ్లపై ఒక వ్యక్తి బైక్ నడపాలంటే కనీసం కోటీశ్వరుడు అయ్యి ఉండాలా అని ఒకరు ప్రశ్నించారు. లగ్జరీ కారుకు కూడా ఇంత భారీ జరిమానా విధించరు అని మరొకరు కామెంట్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. చలానా నింపేటపుడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేసిన తప్పిదం వల్లే అలా జరిగిందని స్పష్టతనిచ్చారు. ఆ తర్వాత చలాన్ మొత్తాన్ని రూ.4,000 కు తగ్గించారు.
