కల్వకుర్తి/నేటి ధాత్రి
రేయింబవళ్లు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న కల్వకుర్తి నియోజకవర్గంలోని పలువురు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారని.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వనపర్తి జిల్లా పర్యటన వెళ్తున్న.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్ కుమార్ రెడ్డి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల మాఫీ చేయడం హర్షనీయమన్నారు. కానీ కల్వకుర్తిలో అర్హులైన కొందరు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరగలేదన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎక్కువ శాతం పాడి సంపద, వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ కాకపోవడం, విజయ డైరీలో పాలు పోసే రైతులకు పాల బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ.. మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి కల్వకుర్తి నియోజకవర్గంలో అర్హులైన రైతులకు రుణమాఫీ, పెండింగు పాల బిల్లులను చెల్లించాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను వినతి పత్రంలో కోరారు.