ఆకుదారి రమేష్ సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ.
భూపాలపల్లి నేటిధాత్రి
సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి ఆర్టీసీ డిపో వద్ద ధర్నాను నిర్వహించడం జరిగింది.
2019 డిసెంబర్ నెల నుండి ఆర్టిసి కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలు ఎత్తివేయాలని తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని సామాజిక భద్రత పథకాలైన పిఎఫ్, ఎస్ ఆర్ బి ఎస్,బి టి ట్రస్టులకు కార్మిక సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను నియమించాలని ప్రజాతంత్ర హక్కులను పునరుద్ధరించాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.
ఆర్టీసీ కార్మికుల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికోద్యమంపై ఆంక్షలు విధించింది. కార్మికుల నుండి ప్రశ్నే రాకుండా చేయడం ద్వారా ఆర్టీసీని తమ ఇష్టాను రాజ్యాంగ నడవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అధికారులు డిపో మేనేజర్ నుండి పై అధికారి వరకు తమ ఇష్టాను రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. పని గంటలు, పని వేళలు, పనివారాలు విపరీతంగా పెంచారు. వారంలో ఆరు రోజులపాటు సింగిల్ క్రూ డ్యూటీలు చేయిస్తున్నారు. సిబ్బంది సరిపోను లేరని ఆఫ్ క్యాన్సిల్, డబుల్ డ్యూటీ చేయాలని ఒత్తిడి చేయడమే కాక డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా మరో ట్రిప్పు వేయమని వొత్తిడి చేస్తున్నారు. మహిళలను కూడా మినహాయించడం లేదు పెరిగిన పని భారం మూలంగా మహిళలను ఇప్పుడు అర్ధరాత్రి వరకు డ్యూటీలు చేయిస్తున్నారు.కొంతమంది కార్మికులు డబుల్ డ్యూటీ చేయడం లేదని నెలకు నాలుగు డబల్ డ్యూటీ కచ్చితంగా చేయాలని అలా చేయని పక్షంలో వారికి సెలవు ఇవ్వమని వారిపై చర్యలు తీసుకుంటామని డ్యూటీ చార్టులో మార్పులు చేస్తామని ఒక డిపో మేనేజర్ బహిరంగ నోటీసు బోర్డులు వేశారు. ఇదే తరహాలో అనేక మంది డిపో మేనేజర్లు వ్యవహరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఒక్కరోజు సెలవు పొందడం గగనంగా ఉంది. దీనికి ప్రధాన కారణం సిబ్బంది కొరత. అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేయకుండా కార్మికులను వేధించడం సరైనది కాదు. తక్షణమే ఇటువంటి వేధింపులు ఆపాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలకు అనుమతిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చింది.అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయిన ఇంకా ఇంతవరకు హామీలు అమలు చేయలేదు. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం అనేది పాలకుల బిక్ష కాదు దశబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కు ఈ ట్రేడ్ యాక్ట్ 1926. రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన పాలకులు ఈ రాజ్యాంగం కల్పించిన ప్రజాతంత్ర హక్కులను కాలరాయడం యూనియన్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించడం కార్మికుల గొంతు నొక్కడం అత్యంత దుర్మార్గమైనది. ఈ వైఖరితో ఉన్న పాలకులు రాష్ట్ర ప్రజల ప్రజాతంత్ర హక్కులను హరించే ప్రమాదం ఉంది. అందుకనే ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర కార్మిక వర్గం, ప్రజానీకం యావత్తు అండగా నిలబడాలని సిఐటియు పిలుపునిస్తోంది.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండి సుభాన్, సిహెచ్ రవికుమార్, ఆర్టీసీ కార్మికులు సమ్మయ్య, పుష్ప, రవికుమార్, ఉమా, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.