చెత్తను తొలగించండి మహాప్రభో…..!
మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వినతి.
నెల రోజులుగా ఆటోలోనే పేరుకుపోతున్న చెత్త.. చోద్యం చూస్తున్న మున్సిపల్ సిబ్బంది..
ప్రధాన రహదారి పార్కింగ్ మయం.. ఆటోనగర్ రోడ్డు ఇరువైపుల ఇష్టారాజ్యంగా పార్కింగ్..
వరంగల్ రోడ్ల మీద గుంతలు.. ప్రయాణికుల ఇబ్బందులు
అసలే వర్షాకాలం.. ప్రధాన రహదారుల్లో గుంతలలోకి నీరు చేరి ప్రమాదాలు..
కమీషనర్ బయటకు వస్తేనే, కదులుతున్న మున్సిపల్ అధికారులు? లేదంటే ఏసీ రూములకే పరిమితం.
బల్దియా అధికారుల నిర్లక్ష్యం…?
పేరుకుపోయిన చెత్త ఓ వైపు.., రోడ్ల మీద గుంతలు మరోవైపు..
వరంగల్ నగర ప్రజల ఆవేదన.. పట్టించుకొని స్థానిక కార్పొరేటర్లు?
మృత్యు మార్గాలుగా ప్రధాన రహదారులు? నిర్వహణ లేక అధ్వాన్నంగా మారిన కొన్ని రోడ్లు.
“పోతననగర్ నుండి హంటర్ రోడ్డు” వైపు వెళ్ళే మార్గం మరి అధ్వాన్నంగా తయారయ్యింది
అడుక్కో గుంతతో భయంభయంగా వాహనదారుల రాకపోకలు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిధ్రమైన పలు రోడ్లు, కాగితాలకే పరిమితమైన మరమ్మతుల ప్రతిపాదనలు?.
గుంతలను పూడ్చండి, పేరుకుపోయిన చెత్తను తొలగించండి, ప్రాణాలను కాపాడండి. బల్దియా కమిషనర్ కు నగర ప్రజల వేడుకోలు.
❗❗సమస్య_1❗❗❗
వరంగల్ రోడ్ల మీద గుంతలు.. ప్రయాణికుల ఇబ్బందులు
వరంగల్, నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారులు అక్కడక్కడ గుంతలతో ఉండటం, ప్రయాణం చేస్తున్న వాహనదారులకు సడన్ బ్రేక్ వేయలేక అందులో నుండి వెళ్ళే క్రమంలో కింద పడటం , సడన్ బ్రేక్ వేయడం వలన ప్రమాదాలు జరుగుతున్న తీరు. ఎంజిఎం నుండి ములుగు రోడ్డు వెళ్లే ప్రధాన రహదారిలో కియా కార్ షో రూమ్ ముందు, పాత సిటీ గ్రాండ్ హోటల్ ముందు, గార్డెన్ ముందు రోడ్డు మధ్యలో గుంతలు ఉండటం వల్ల ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతన నగర్ నుండి హంటర్ రోడ్డు వెళ్ళే మార్గం మరి అధ్వాన్నంగా తయారయిన పట్టించుకునే నాథుడు లేడు. ఈ ఏరియా నగర మేయర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు ప్రజా ప్రతినిధులకు వారి డివిజన్ లో రోడ్ల మీద ఎలాంటి నిర్లక్ష్యం ఉందో అని. అలాగే ములుగు రోడ్డు జంక్షన్ లో రోడ్డు గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పోచంమైదాన్ నుండి కాశీబుగ్గ వైపు వెళ్ళే దారిలో రోడ్డులో అక్కడక్కడా గుంతల వల్ల ఇబ్బందులు. మరికొన్ని చోట్ల రోడ్డు పనుల వల్ల ఇబ్బందులు జరుగుతున్న తీరు. తాత్కాలికంగా బోర్డు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. గుంతలు ఉన్న చోట తాత్కాలికంగా గుంతలు పూడ్చే అవకాశం ఉన్న కూడా పట్టించుకొని బల్దియా అధికారులు. స్థానిక కార్పొరేటర్లు సైతం వారికి ఏమి పట్టనట్లు ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రజలకు రోడ్డు ప్రమాదాల నుండి కాపాడే ప్రయత్నం అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ చేయకపోవడం పట్ల నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడుక్కో గుంత.. ఆపై అడపాదడపా కురుస్తున్న వర్షాలతో బురదమయంగా మారిన రోడ్లు వాహనదారులను భయపెడుతున్నాయి. వాహనదారులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు మృత్యుఢంకా మోగిస్తున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు, కాలనీల్లోనీ రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. గుంతలు పూడ్చడానికి తట్ట మట్టి కూడా వేసే వారు లేక పోవడంతో, రోడ్డెక్కాలంటే వాహన చోదకులు వణికిపోతున్నారు. పెద్దపెద్ద గోతులతో.. నీటితో నిండిన గుంతలతో రోడ్లు వాహన చోదకులను బెంబేలెత్తిస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లుకు ఇటీవల కురుస్తున్న చిన్న చిన్న వర్షాలు తోడవడంతో చిధ్రమై పోయాయి. ప్రమాదాలకు కేంద్రాలుగా నగరంలోని పలు రోడ్లు మారాయి. పగలు అష్టకష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్నా.. రాత్రుళ్లు మాత్రం ఆయా రోడ్లపైకి వెళ్లేందుకు భారీ వాహన చోదకులు సైతం భయపడుతున్నారు. రోడ్లు బాగు చేయండి సార్ అని ఆయా ప్రాంతాల ప్రజలు చేసుకుంటున్న వేడుకోలు అటు అధికారులను.. ఇటు ప్రజాప్రతినిధులను కూడా కదల్చలేకపోతున్నాయి.
రోడ్ల మరమ్మతులు మరిచారు..
వర్షాకాలం మొదలైంది. దెబ్బతిన్న రోడ్లకు చేసే మరమ్మతులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. బల్దియా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉన్నారు కానీ, ఉన్న రోడ్లు, గుంతలు పడ్డ రోడ్లకు, మరమ్మతు పనులకు బడ్జెట్‌ని విడుదల చేయకపోతుండటంతో కొత్త రోడ్ల నిర్మాణం మాట అటుంచి, ఉన్న రోడ్ల మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. గతంలో వర్షాకాలంలో ధ్వంసమైన రోడ్లకు సంబంధించి తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల పేరుతో తొలుత ప్రతిపాదనలు స్వీకరించి ఆ తర్వాత నిధులు మంజూరు చేసి రోడ్లకు రిపేర్లు చేయించేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కోశాన కనిపించడం లేదు.
❗❗సమస్య_2❗❗❗
చెత్తను తొలగించండి మహాప్రభో…
మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వినతి.
నెల రోజులుగా ఆటోలోనే పేరుకుపోతున్న చెత్త.. చోద్యం చూస్తున్న మున్సిపల్ సిబ్బంది..
ప్రధాన రహదారి పార్కింగ్ మయం.. ఆటోనగర్ రోడ్డు ఇరువైపుల ఇష్టారాజ్యంగా పార్కింగ్..
వరంగల్, నేటిధాత్రి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో రోడ్లపై చెత్త వేయడం వాటిని నెలల తరబడి తీయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరు. అసలే వర్షాకాలం మొదలైంది. చెత్తను ఇంటింటి నుండి సేకరించి ఆటోల్లో తరలించే విధానం ఉన్న కూడా అక్కడక్కడా కొందరు సిబ్బంది నిర్లక్యం వల్ల చెత్త రోడ్డు మీద వేయడం, అక్కడి చెత్తను రోజుల తరబడి తీయకపోవడం జరుగుతుంది. హనుమకొండ నగరంతో పోల్చుకుంటే వరంగల్ లో పారిశుధ్యం పనులు వెనుకబడే ఉన్నాయి. నగరంలోని 23వ డివిజన్ వార్డులో, ఎంజిఎం సర్కిల్ నుండి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రోడ్డు మార్గంలో, యూనివర్సిటీ ముందు, ప్రభుత్వ కంటి దవాఖాన పక్కన, ప్రధాన రహదారిపై, ఆటోలోనే చెత్త వేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా చెత్తను తొలగించడం లేదని అటు వైపుగా వెళ్తున్న వాహనదారుల ఆవేదన. ఆ చెత్తవల్ల దోమలు చేరి విష జ్వరాలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. చెత్తను తొలగించండి మహాప్రభో అంటూ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను వేడుకుంటున్నారు.
రోడ్ల మీద చెత్తను వెంటనే తొలగించాలి.
రోడ్ల మీద చెత్త వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, అలాగే పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి, చెత్తను రోడ్లపై వేయకుండా ఉండటానికి, ప్రతి ఒక్కరూ తమ చెత్తను చెత్త కుండీలలో వేయాలి. మరియు, చెత్తను సేకరించే సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ ఉండాలి. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిలో కొన్ని ఆరోగ్య సమస్యలు, రోడ్ల మీద పేరుకుపోయిన చెత్తలో దోమలు, ఈగలు మరియు ఇతర క్రిములు వృద్ధి చెందుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తాయి మరియు దుర్వాసన వస్తుంది. ఆటోనగర్ లో కొందరు రోడ్ల మీదే చెత్తను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వర్షం వచ్చినప్పుడు, రోడ్లపై ఉన్న చెత్త మురుగునీటి వ్యవస్థను అడ్డుకుంటు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ప్రజలు అటు అధికారులు చెత్త తొలగింపు విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక కార్పొరేటర్లు కూడా చొరవ తీసుకొని పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చి చెత్తను తొలగించాలని, స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.