ప్రాంతీయ పార్టీలదే పై ‘చేయి’!

https://epaper.netidhatri.com/view/225/netidhathri-e-paper–2nd-april-2024/3


`కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకం.

`బిజేపి సొంత మెజారిటీ కష్టం.

`కాంగ్రెస్‌ కు ఎంతో కొంత మరుగైన ఫలితం.

`గతం కన్నా మంచి స్థానాలు కాంగ్రెస్‌ కైవసం.

`ప్రాంతీయ పార్టీలతోనే జాతీయ పార్టీల మనుగడకు మార్గం.

`ప్రాంతీయ పార్టీలను మింగడం అసంభవం.

`పదేళ్ళ పాలన తర్వాత మిగిలేది పరాభవం.

`మూడోసారి బిజేపి వచ్చినా ప్రాంతీయ పార్టీలే ఆధారం.

`నేటిధాత్రి ‘‘డి ప్యాక్‌’’సర్వేలో వెల్లడౌతున్న వాస్తవం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కేంద్రంలో ఏ పార్టీ గెలుస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దేశ వ్యాప్తంగా అనేక సర్వేలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని బిజేపి గెలిచే అవకాశముందని, ఎన్డీయే కూటమికి గెలువొచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయంటున్నాయి. అయితే ఇండియా కూటమిలో ఎక్కువ పార్టీలు వుండడం మూలంగా ఆ కూటమే గెలుస్తున్న మాటలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మళ్లీ ప్రాంతీయ పార్టీలకు మంచి రోజులు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిజేపి అధికారంలో వున్న రాష్ట్రాలలో పైకి ఆ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం వుందన్న సంకేతాలు వెలువడుతున్నా, క్షేత్ర స్ధాయిలో పరిస్ఠితి మరో రకంగా వుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిజేపి కోల్పోయే స్ధానాలలో కాంగ్రెస్‌ పాగా వేయాల్సిన అవకాశం వున్నా, కూటమి మూలంగా కాంగ్రెస్‌ పార్టీ చాలా సీట్లు వదులుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎందుకుంటే ఉత్తర ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పోటీ చేసే సీట్లను చూస్తేనే అర్దమౌతోంది. మెజార్టీ సీట్లు సమాజ్‌వాది పోటీ చేస్తుండడం, అఖిలేష్‌ యాదవ్‌ ఇచ్చే సీట్లతో కాంగ్రెస్‌ సర్ధుకోవడం వంటివి కూడా కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశం వుంది. కాకపోతే కేంద్రంలో బలమైన కూటమిగా, పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరిస్తే చాలనుకొని కాంగ్రెస్‌ సర్ధుకపోయింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌కు అనూలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ యూపిలో సమాజ్‌వాదీ పార్టీ ఓ నలభై ఐద సీట్లు సాధించినా, కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తుంది. అలాగే తృణమూల్‌ కాంగ్రెస్‌కు ముప్పై సీట్లు వస్తే మమత బెనర్జీ కూడా చక్రం తిప్పేందుకు ముందుకు వస్తుంది. తమిళనాడులో డిఎంకే కనీసం 30 సీట్లు సాదించినా ఆ పార్టీ కూడా కీలకంగా మారే అవకాశం వుంది. ఇలా ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటే బిజేపికి పెద్ద దెబ్బ తగులుతుంది. ఈ విషయాన్ని పసిగట్టిన బిజేపి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలతో పొత్తుకు సై అన్నాయి. అయితే పుణ్య కాలం గడిచిపోయందన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల యూపిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బిజేపికి ఘోర పరాభవం ఎదురైంది. అవి పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
గతంలో యూపిఏ పదేళ్లు, ఇప్పుడు బిజేపి పదేళ్ల పాలనతో ఇరవై సంవత్సరాలు జాతీయ పార్టీల ఆదిపత్యంతో రాష్ట్రాలలో అభివృద్ది కుంటుపడిరదే వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా దక్షిణాదిన జరగాల్సినంత అభివృద్ది జరగలేదు. ఉత్తరాధికిచ్చినన్ని నిధులు, ముఖ్యంగా గుజరాత్‌ లో జరిగినంత అభివృద్ది దక్షిణాదిలో జరలేదు. మహారాష్ట్రలో కూడా అభివృద్ది కుంటుపడిరదనే వార్తలు వస్తున్నాయ. అందుకే మూడోసారి బిజేపికి అధికారం కట్టబెడితే ప్రాంతీయపార్టీల మనుగడ కనుమరుగౌతోంది. రాష్ట్రాల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, నిధుల పంపకాలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యే అవకాశం వుంది. గతంలో ప్రాంతీయ పార్టీలు నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ గా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఎన్టీఆర్‌ హయాంలో ఒకసారి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రెండుసార్లు కూటములు ఏర్పడ్డాయి. 2014 ఎన్నికల దాకా ఎన్డీయే కూటమికి చంద్రబాబు నాయుడే చైర్మన్‌గా వున్నారు. మోడీ ప్రభతో చంద్రబాబు ఎన్డీయేకు దూరమయ్యాడు. మళ్లీ ఇటీవల చేరాడు. అప్పుడు అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం కేంద్ర ప్రభుత్వంలో పెరిగింది. కాని ఇప్పుడు ఏక పార్టీ పాలన వల్ల రాష్ట్రాల భాగస్వామ్యం తగ్గిపోతుంది. నాయకుల మాటలకు విలువ లేకుండాపోతుంది. బిజేపిలో బలమైన నాయకులకు, వారి మాటలకు విలువ లేకుండాపోయింది. బిజేపి పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాలకే నిధులు వెళ్తాయన్న ఆరోపణలున్నాయి. కలలు,పగటి కలలు రాజకీయాల్లో కూడా వుంటాయి. అధికారంలోకి వచ్చేది మేమే అని పార్టీలన్నీ చెప్పుకుంటాయి. క్షేత్రస్ధాయిలో ప్రతి సభను చూసి మురిసిపోతాయి. నాయకుల మాటలు నమ్ముతుంటాయి. ప్రచారాలను బాగానే నమ్ముకుంటాయి. కార్యకర్తలు కూడా పార్టీలు అధికారంలోకి రావాలనే కోరుకుంటారు. కాని ప్రజలు ఏమనుకుంటున్నారన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. కార్యకర్తలు చెప్పిందే నిజమనుకుంటారు. ప్రచారం జరిగిందే వాస్తవమనుకుంటారు. సర్వేలలో తేలిందే జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ప్రజల నాడిని మాత్రం ఎవరూ పట్టుకోలేరు. అలా పట్టుకుంటే ఏ పార్టీ ఓడిపోదు. ఏ పార్టీ గెలవదు.
ప్రతిసారి మేమే గెలుస్తామనుకోకపోతే పార్టీలు మనలేదు. మనుగడ సాగించలేవు.
అధికారంలోకి రాలేవు. కాని ప్రజలు ఏమనుకుంటున్నారన్న వాటిని పట్టించుకున్నట్లు నమ్మిస్తారే గాని, ప్రజలను ఎప్పుడూ పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే అలా ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే ఈ పదేళ్లలో నోట్ల రద్దు జరిగివుండేదికాదు. ప్రజలు ఇబ్బందులు పడాల్సివచ్చేది కాదు. జిఎస్టీ తెచ్చేవారు కాదు. పన్నుల బారం ఇంతలా పడుతుందని ఊహించేవారు కాదు. జిఎస్టీ తేకముందే జీడిపి ఎక్కువగా వుందన్న వాస్తవాలు అంగీకరించరు. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడు పడుతున్న కష్టాలు నాయకులు పట్టవు. తాము గొప్పగా పాలిస్తున్నామనే అనుకుంటారు. గతంలో వాజ్‌పాయి ప్రభుత్వం కూడా దేశం వెలిగిపోతోందని ప్రచారం చేసుకొని ఓడిపోయింది. ఇప్పుడు కూడా దేశం వికసిస్తోందంటూ బిజేపి ప్రచారం చేసుకుంటోంది. వికసిత భారత్‌ ప్రచారంతో మూడోసారి అధికారంలోకి వస్తామనుకుంటోంది. యూపిఏ పేరుతో2004 నుంచి 2014 వరకు పదేళ్లు కాంగ్రెస్‌ పరిపాలన చేసింది. కొంత ప్రతిపక్షాల భయంతో పాలన సాగించింది. తర్వాత 2014లో ఎన్డీయే పేరుతో బిజేపి వచ్చింది. కాని మిత్రపక్షాల మాట పెడచెవినపెట్టింది.. 2019 వరకు చాలా మిత్రపక్షాలును బిజేపి దూరం చేసుకున్నది. ఈ ఎన్నికలలో పేరుకే ఎన్డీయే అయినా 400 సీట్లు సాధిస్తామని చెబుతోంది. అంటే మళ్లీ అధికారంలోకి వస్తే ఆ మిత్రపక్షాలను కూడా బిజేపి మింగేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర శివసేన పరిస్ధితి ఎలా అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక దశలో శివసేన మద్దతిస్తే చాలు నాలుగు సీట్లు గెల్చుకుంటామని అనుకున్న బిజేపి, శివసేనను దూరం చేసుకున్నది. శివసేనను చీల్చింది. ఇలా బిజేపి రాజకీయాలను చూసిన ప్రాంతీయ పార్టీలు ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాగైనా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల బలం చూపించాలని సంకల్పంతో వున్నాయి. కాని అవి బైటపడడం లేదు. ఎన్నికల్లో బిజేపికి సీట్లు తగ్గితే మాత్రం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు పూర్వ వైభవం రావడం ఖాయం. ప్రాంతీయ పార్టీల నేతలే ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకు సమర్ధవంతమైన నాయకులు అనేక మంది వున్నారు. అందులో అఖిలేష్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌, మమతా బెనర్జీ, మాయావతి, స్టాలిన్‌, కేసిఆర్‌, చంద్రబాబు నాయుడు, నవీన్‌ పట్నాయక్‌ ఇలా చాలా మంది నేతలున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపంలో బిజేపిని ప్రజలు అందలం ఎక్కించారు.
2014కు ముందు నమో రూపంలో నరేంద్ర మోడీ నామ జపం దేశమంతా చేసింది. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయితే దేశం ఎంతో ముందుకు వెళ్తుందని అనుకున్నారు. పారిశ్రామికంగా గుజరాత్‌ మోడల్‌తో దేశమంతా వెలిగిపోతుందనుకున్నారు. అలా ముందు ప్రచారం బాగా చేశారు. దానికి తోడు దేశంలో హైందవం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. రామాలయ నిర్మాణం దేశ ప్రజల ఆక్షంగా మార్చుకున్నారు. దాంతో మొదటిసారి బిజేపి రామాలయ నిర్మానంపై వెనుకడుగు వేసినా, రెండోసారి అవకాశం ఇస్తే తప్పకుండా నిర్మాణం చేస్తారని ఆశించారు. బిజేపి దేశ ప్రజలందరి కోరిక తీర్చారు. రామాలయం నిర్మాణం చేశారు. అయోధ్యను సుందరం చేశారు. అయోద్యకు కొత్త రూపును తెచ్చారు. అయినా బిజేపిలో ఏదో వెలికి కనిపిస్తోంది. రామాలయం నిర్మాణంకు ముందు ఇక బిజేపికి మూడోసారి కూడా ఎదురులేదనుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం బిజేపి శ్రేణులు అంత సంతోషంగా లేరు. కారణం ప్రజలకు ధర భారం పెను భారమౌతోంది. నిజానికి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఒక్కొక్క వస్తువు ధర పెరుగుతూ వచ్చింది. దాంతో దేశ ఆదాయం కూడా పెరుగుతూ పోయింది. కాని ప్రజలకేం వచ్చింది? అన్న ప్రశ్నకు సమాధానం లేకుండాపోయింది.
ఈ పదేళ్ల కాలంలో దేశంలో ఎక్కడైనా ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేశారా? అంటే చెప్పలేని పరిస్ధితి.
గతంలో కాంగ్రెస్‌ చేపట్టిన భహుళార్ధక సాధక ప్రాజెక్టులను మించిన ఒక్క ప్రాజెక్టైనా బిజేపి నిర్మాణం చేస్తుందని అందరూ ఊహించారు. ఎందకుంటే మన దేశంలో వ్యవసాయక దేశం. విభిన్నమై వాతావరణ పరిస్ధితులు కల్గిన భూభాగం. మన దేశంలో అనేక రకాల పంటలు పండేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. అందుకు అవసరమైన నీట వనరులు కూడా వున్నాయి. డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా పూర్తి స్ధాయిలో నీటి వనరులను వినియోగించుకోలేకపోతున్నాం. మన దేశానికి అవసరమైన ఆహర పదార్ధాలను పండిరచలేకపోతున్నాం. ఆకలి భారతాన్ని దూరం చేయలేకపోతున్నాం. ఏటా కొన్ని లక్షల మంది ఇంకా ఆకలితో చనిపోతున్నారన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. ఉత్తరాధి ప్రజలు ఎక్కువగా తీసుకునే పప్పులను కూడా విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్ధితుల్లో వున్నాం. సరే ఆహార పరిస్దితులు ఇలా వున్నా, పారిశ్రామిక పురోగతి ఏమైనా పెరిగిందా? అంటే దేశంలో నిరుద్యోగం పదేళ్లలో ఎన్నో రెట్లు పెరిగింది. ఉత్తరాది నుంచి ఎంతో మంది యువత దక్షిణాదికి చేరుకొని వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. రైల్‌ మిల్లుల్లో కూలీ పని చేస్తున్నారు. నిర్మాణ రంగంలో పనులు వెతుక్కుంటున్నారు. దేశం వికసిస్తుందంటే, ఇలా వలసలు ఎందుకు పెరుగుతున్నాయి? యువతకు భవిత శూన్యమెందుకౌతోంది. పల్లెల్లో వికాసం ఎందుకు కనుమరుగౌతోంది. పాడి పంటలు పండాల్సిన చోట ఎండిపోయిపోయి మోడువారిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతిలోనైనా దేశం పరుగులు పెడుతోందంటే, ఉత్తరాది నుంచి కొన్ని లక్షల మంది నిత్యం దక్షిణాదికి కూలీకి వస్తున్నారు. విద్య రంగాలలో వచ్చిన మార్పులేమీ లేదు. వైద్య రంగం ఎంతపురోభివృద్ది జరిగినా, పేదలకు నాణ్యమైన వైద్యం చౌకగా అందుబాటులోకి రాలేదు. కేంద్రం దేశ వ్యాప్తంగా ఉచిత వైద్యం అనుకున్నంత మేర అందుబాటులోకి తేలేదు. పైగా డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచేసి, ప్రజల సంపాదనను సగం పీల్చుకునేలా చేస్తున్నాయి. ఇవన్నీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రాంతీయ పార్టీలకు మంచి రోజులు వస్తాయన్న సూచనలే కనిపిస్తున్నాయి. నేటిధాత్రి దినపత్రిక, డీప్యాక్‌ సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *