పేర్నాల మాటలు..పేకుడు దద్దమ్మలు!?

`ఉద్దండుల పోకడలు.. పొంకనాల చేష్టలు!?

`ప్రజా తీర్పును అవహేళన చేస్తున్రు!

`రాజ్యాంగ స్పూర్తిని పాతరవెట్టిన్రు.

`ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్రు.

`త్రిశంఖు స్వర్గంలో యాలాడుతున్రు!

`ప్రమాణం చేసి పచ్చి అబద్దాలా!?

`ఇమానం తప్పిన్రు!?

`ఇజ్జత్‌ ఇడిశిపెట్టిన్రు?

`నియ్యత్‌ మరిశిండ్రు!

`తొండి మాటలు నేర్శిన్రు!

`కారు దిగలేదంటన్రు

`కాంగ్రెస్‌లో చేరలేదంటన్రు

`ప్రజల నమ్మకాన్ని వంచించిన్రు.

`పార్టీ మారలేదంటన్రు!

`కప్పుకున్నది కాంగ్రెస్‌ కండువ కాదంటున్రు!

`జాతీయ జెండా కండువా అని తొండి ముచ్చట్లు చెప్తున్రు!

`బీఆర్‌ఎస్‌ లోనే వున్నామని బుకాయిస్తున్రు!

`బీఆర్‌ఎస్‌ సభ్యులుగానే కొనసాగుతున్నామంటున్రు.

`నియోజకవర్గ అభివృద్ధి కోసమే సిఎం ను కలిశినమంటున్రు!

`పూటకో మాట మారుస్తున్రు!

`ప్రజలను ఏమారుస్తున్రు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          నిజాలు ఎలాగూ చెప్పలేరు. కనీసం అబద్దాలైలు కూడా ఆడలేనప్పుడు ధైర్యవంతులని ఎలా అంటారు. అలాంటి వారికి రాజకీయాలెందుకు? ప్రజా ప్రతినిధులు అయ్యేందెందుకు? వారికి పదవులెందుకు? ప్రజల పక్షాన నిలిచినట్లు లేదు? కనీసం తమకు తాముగా రాజకీయ నాయకుడిగా చెప్పుకోవడానికి లేదు? ఇంకా ఎందుకు ఆ పదువులు? రాజకీయం ఎప్పుడూ సూటీగా వుండదని అంటారు. కాని డొంకతిరుడుగు రాజకీయాలైనా సరే సరిగ్గా చేయలేని వారు ప్రజలకు మేలు చేయలేరు. వారి పదవుల కూడా కాపాడుకోలేరు. తెలంగాణలో పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ధైర్యం లేదు. రాజీపడే రాజకీయాలు చేసే శక్తిలేదు. ఏ పార్టీలో వున్నామో చెప్పడానికి నోరు కూడా రావడం లేదు. పార్టీ మారినట్లు ఒప్పుకునే ఆత్మస్ధైర్యం లేదు. ఇంతగా దిగజారి రాజకీయాలు చేసి ఆ ఎమ్మెల్యేలు చేసేదేమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన మూడునెలల్లో పది మంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కారు దిగారు. కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ విషయం వాళ్లే స్వయంగా మీడియా సాక్షిగా, కార్యకర్తల సమక్షంలో చెప్పారు. కాని ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. తాము పార్టీ మారలేదంటున్నారు. కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. ఇది అనైతిక కాదా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా? ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్లు కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పడం కాదా? రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా? కనీసం ఆత్మ ప్రబోధం అనేది కూడా వారిలో లేదా? ఎనుకున్న ప్రజలను వంచించడం కాదా? నమ్మి టికెట్‌ ఇచ్చిన పార్టీని మోసం చేయడం కాదా? గెలిపించిన కార్యకర్తలను నట్టెట ముంచడం కాదా? నమ్మించి గొంతు కోసినట్లు కాదా? కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్వాల ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌. సంజయ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంక్రట్‌రావు, దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలు బిఆర్‌ఎస్‌ కు రాం రాం చెప్పి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వారితోపాటు ఎంత మందిని కాంగ్రెస్‌లో చేర్చారు. సుప్రింకోర్టు తీర్పు దృష్ట్యా గడువు దగ్గరపడుతుండడంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ వారికి నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాదానం చెప్పాలన్నారు. అందులో 8మంది ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని చెప్పారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మరింత సమయం కోరారు. అయితే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి సీనియర్‌ నాయకుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పాడు. ఆయన పార్టీ మారిన రోజు తన రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌ నుంచి అని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్లానని, ఆ తార్వత బి ఆర్‌ఎస్‌లో వున్నానన్నారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వచ్చానని మీడియా ముందు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో సమర్ధవంతమైన నాయకుడు. ఆయన పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయాలని పార్టీ మారినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి యువకుడు, ఇంకా మరో ముప్పై ఏళ్లు రాజకీయం చేయగలిగే శక్తి వున్న నాయకుడితో పనిచేయడం ఆనందంగా వుందన్నారు. కాని స్పీకర్‌కు మాత్రం తాను పార్టీ మారలేదని సమాధానమిచ్చారు. సరే అదే నిజమని అనుకుందాం. కాని ఆయన ప్రభుత్వంలో భాగాస్వామిగా వున్నారు. ఓ కార్పోరేషన్‌కు చైర్మన్‌గా క్యాబినేట్‌ ర్యాంగ్‌ పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆయన పచ్చి అబద్దంచెప్పినట్లు కాదా? అనేక సార్లు సిఎల్‌పి సమావేశంలో పాలు పంచుకోలేదా? ఎంతో సుధీర్ఘమైన అనుభవం వున్న నాయకుడు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, అలాంటి నాయకుడి సేవలు రాష్ట్రానికి అవసరమని నమ్మి కేసిఆర్‌ 2014 తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిని చేశారు. 2018 తర్వాత ఏకంగా స్పీకర్‌ పదవిని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌గా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇలా అబద్దాలు చెప్పడం విడ్డూరం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ఫ్లెక్సీలున్నాయి. పార్టీ మారినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ఇంటి మీదకు దాడికి దిగిన సందర్భం కూడా అరికెపూడికి వుంది. అయినా పార్టీ మారలేదని చెప్పడం విడ్డూరంగా వుంది. వీరిలో డాక్టర్‌ సంజయ్‌ మీద కేసిఆర్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. నిజానికి జగిత్యాల టికెట్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఆమె ఎంపిగా వున్న సమయం నుంచి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించారు. నిజామాబాద్‌ ఎంపిగా వున్న సమయంలో నిజామాబాద్‌తోపాటు , జగిత్యాల అభివృద్దికి కవిత ఎంతో కృషి చేశారు. అయినా కన్న కూతురు కవితను కాదని సంజయ్‌కు టికెట్‌ ఇస్తే గెలిచి, పార్టీ మారడం అనేది ఏమాత్రం నైతికత కాదని అంటున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసిఆర్‌ ఎంతో ప్రాదాన్యతనిచ్చారు. ఉన్నత విద్యావంతుడు. పరిపాలనపై పట్టున్న నాయకుడు అని ఎంతో కేసిఆర్‌ నమ్మారు. 2014 ఎన్నికల్లో వరంగల్‌ ఎంపిగా గెలిచిన కడియం శ్రీహరిని, ఉన్న ఫలంగా ఎమ్మెల్సీని చేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో ఓ మీడియాలో ఇంతకన్నా నాకు వేరే ఆశలు లేవు. రాజకీయాలు చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఉప ముఖ్యమంత్రి కావడం నా అదృష్టం. ఇక నా జీవితం బిఆర్‌ఎస్‌లోనే పరిసమాప్తమని చెప్పారు. అలా నమ్మిన కడియం శ్రీహరి, రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆఖరుకు గత ఎన్నికల ముందు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్‌ ఇచ్చారు. అయినా కడియం శ్రీహరి మూడు నెలలు కూడా బిఆర్‌ఎస్‌లో లేరు. ఇంకా విచిత్రమేమిటంటే ప్రభుత్వం పడిపోకుండా చూసుకో అని ఒక దశలో రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో సూచించిన కడియం శ్రీహరి, పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు. కాని రాజకీయ అనుభవం నేర్పిన పాఠంతో ఆయన చూపించిన రాజకీయ చాణక్యం నిగూడమైంది. కేసిఆర్‌ మరింత నమ్మకంతో కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్‌ ఎంపి. టికెట్‌ కూడా ఇచ్చారు. ఆ సీటు కోసం ఎంతో మంది పోటీ పడినా వారికి కాదని కడియం శ్రీహరికి ప్రాదాన్యతనిచ్చారు. అటు బిఆర్‌ఎస్‌ భీఫామ్‌ ఇచ్చిందో లేదో, ఇటు డిల్లీకి వెళ్లి కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ బిఫామ్‌ తెచ్చుకున్నారు. తన కూతురు కోసం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక సార్లు తాను కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. కాని ఇటీవల మీడియా ప్రశ్నిస్తే ఏ పార్టీలో వుండాలో ఆ పార్టీలోనే వున్నానంటూ సమాదానం దాట వేశారు. వరంగల్‌ రాజకీయాల్లోనే టాలెస్టు పర్సనాలిటీ అని గొప్పగా చెప్పుకునే కడియం శ్రీహరిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే తన కూతురు కోసం పార్టీ మారడమే కాదు, ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్న విషయం భహిరంగ రహస్యమే. తప్పించుకునే ఛాన్స్‌లేదని తెలిసినా పార్టీ మారినట్లు కడియం శ్రీహరి ఒప్పుకోకపోవడం రాజకీయ అవకాశవాదమే అవుతుంది. ఇక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తప్పించుకునే పరిస్ధితి అసలే లేదు. ఎందుకుంటే ఆయన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా వుంటూనే కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ తరుపున సికింద్రాబాద్‌ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. వేటు పడాల్సి వస్తే ముందుగా దానం నాగేందర్‌ కు అందరికంటే ముందుపదవిపోక తప్పదు. కాని ఎన్నుకున్న ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తే ఏమౌతుందో దానం నాగేందర్‌కు గతంలోనే ఓ అనుభవం వుంది. 1999లో మొదటి సారి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్‌కు 2004కు కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దాంతో రాత్రికి రాత్రి టిడిపి పార్టీ టికెట్‌ తెచ్చుకొని సైకిల్‌ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. కాని కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. గెలిచిన వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే పదవి పోగొట్టుకొన్న అనుభవం దానంకు వుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న భయం వుంది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ పోటీ చేయాలంటే భయం పట్టుకున్నది. అందుకే రాజీనామా అంటే భయపడుతున్నారు. ఇప్పుడు వారికి ఒకటే దారి అయితే రాజీనామా చేయాలి. లేకుంటే వేటుకు సిద్దపడాలి. రెండిరటిలో ఏదో ఒకటి తప్పదు. రాజకీయాలలో ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే తప్ప భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీ మారరు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version