వనపర్తి నేటిధాత్రి :
తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. 2024 స్పెషల్ సమ్మరీ రివిజన్ పై శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ సిద్ధం చేసిన ముసాయిదా ఓటర్ జాబితాను ఈరోజు ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. జాబితాను రాజకీయ పార్టీలకు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచడం జరుగుతుంది అన్నారు. ఓటర్ జాబితాలో ఓటర్లు, తమ పేర్లను పరిశీలించుకుని ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ముసాయిదా జాబితాలో తప్పులు గుర్తిస్తే చేయాల్సిన మార్పులను జనవరి 22వ తేదీ నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు.
వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి మార్పులు సవరించి ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ మధ్య కాలంలోనే ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోని వాళ్లకు ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటుచేసి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మరణించిన వారి పేర్లను లేదా ఈ ప్రాంతం నుండి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన వారిని గుర్తించి ఫారం 7 ద్వారా పరిశీలన చేసి తగిన ఆధారాలతో పేర్లను జాబితా నుండి తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. మరణించిన వారి ధ్రువీకరణ పత్రము లేని పక్షంలో స్థానిక సంస్థల కార్యాలయ రిజిస్టర్లలో నమోదు అయిన జనన మరణాలను వివరాలను పరిగణలోకి తీసుకొని పూర్తి విచారణ అనంతరం పేర్లను తొలగించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు స్వయంగా తమ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకావాలని సూచించారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు లేదా పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు వంటివి ఉంటే ప్రతిపాదనలు ఇవ్వాలని రాజకీయ పార్టింప్రతినిధులను కోరారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తుతం ఉన్న బి.ఎల్. ఒ ల పనితీరును సమీక్షించాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్. తిరుపతి రావు, రాజకీయ పార్టీల నుంచి సిపిఎం తరఫున పరమేశ్వర చారి, బిజెపి తరఫున దాసోజు శ్రవణ్, ఐ ఎన్ సి తరఫున త్రినాథ్, బిఆర్ఎస్ తరఫున సయ్యద్ జమీల్, టిడిపి తరఫున బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
