పవన్‌తో పరేషానే! పోను పోను పొగనే!!

https://epaper.netidhatri.com/view/321/netidhathri-e-paper-17th-july-2024%09

-జగన్‌ కన్నా పవన్‌ రాజకీయమే టిడిపికి ప్రమాదకరం.

-ఏనాటికైనా సిఎం కావాలన్నదే పవన్‌ లక్ష్యం.

-వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ పుంజుకుంటే తొలి నష్టం టిడిపికే.

-పవన్‌ మిత్రధర్మం కొంత కాలమే!

-పొత్తు రాజకీయం మరి కొన్ని రోజులే!

-పవన్‌ దూకుడు స్వభావం తెలుగు దేశానికీ ఇబ్బందికరమే!

-స్వయం నిర్ణయాల వైపే పవన్‌ అడుగులు.

-అభిమానుల హడావుడికి పవన్‌ ఆశీస్సులు.

-అధికారంలో భాగమైనా ప్రశ్నించడం ఆపనని మొదట్లోనే చెప్పిన పవన్‌.

-ప్రతిపక్షం లేదు…ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు మనమే!

-ఇదీ పవన్‌ అంతరంగం.

-ఇప్పుడే అంత తొందరపడకపోయినా సమయం కోసం చూస్తున్నాడు.

-చంద్రబాబు ఎంత ప్రాధాన్యతనిచ్చినా ఉనికి పెంచుకోవాలనుకుంటున్నాడు.

-అనుభవం లేని పవన్‌కు ఆవేశమే బలం.

-అభిమానుల అండ దండలే ధైర్యం.

-జనసేన ఎదగడం కష్టమే!

-అభివృద్ధిలో పవన్‌ పాత్ర సముచితం కాకపోవచ్చు.

-పక్కన పెడితే పవన్‌ తిరుగుబాటు చేయొచ్చు.

-రాజకీయాలలో శాశ్వత మైత్రి మిద్యే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాల్లో పొత్తు ధర్మాలు ఎప్పుడూ నీటి మీద రాతలే. రాజకీయ పార్టీలన్న తర్వాత అధికారమే పరమావధిగా ముందుకు సాగుతాయి. ఒకపార్టీ మరొక పార్టీకి సహకారం అన్నది అప్పటికప్పుడు ఓటమి నుంచి బైట పడేందుకు వేసుకునే ఎత్తుగడ మాత్రమే. మంచి ఫలితాలు వస్తే రాజకీయం ఒక రకంగా వుంటుంది. ఓడిపోతే మరో రకంగా వుంటుంది. గెలిస్తే నా వల్లనే మిత్ర పక్షం గెలిచిందని ఒక పార్టీ ప్రచారం మొదలు పెడుతుంది. మా వల్లనే, పొత్తు వల్లనే ఆ పార్టీకి మెరుగైన సీట్లు వచ్చాయని మరో పార్టీ మొదలు పెడుతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఇదే సహజం. తన కాళ్ల మీద తాను నడవలేనప్పుడు ఊత కర్ర సాయం తీసుకుంటారు. తనకు తాను సొంతంగా ఎదగలేని సమయాల్లో ఎవరో ఒకరి సహకారం కోరుకుంటాం. ఊత కర్ర సాయం అవసరం తీరినప్పుడు దాన్ని విసిరేస్తాం. ఇతరుల సహాకారంతో ఎదుగుదల మొదలు కావడంతో ఒంటరిగా ప్రయాణం కోసం ఎదురుచూస్తాం. ఇదే ఫార్ములా రాజకీయాల్లోనూ అనుసరిస్తారు. ఎల్ల కాలం కలిసి సాగడం అన్నది మాత్రం ఎక్కడా ఏపార్టీకి కుదరనివే రాజకీయాలు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరు. ఎప్పటి అవసరాలు అప్పుడే. ఎప్పటి రాజకీయం అప్పటికే. ఆ తర్వాత ఎవరికి వారే..యమునా తీరే. రాజకీయాల్లో పవన్‌కు ఓ లక్ష్యం వుంది. ఆయన ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన బలంగా నాటుకుపోయింది. ఆ ఆశయంతోనే జనసేన ఏర్పాటు చేశారు. తన అన్న చిరంజీవికి సాధ్యంకానిది తాను సాధించి చూపించాలన్న కసితోనే రాజకీయాలు చేస్తున్నారు. 2014లో ఎన్నికల్లో జన సేన పోటీ చేయలేదు. అప్పుడు అందరూ ఎద్దెవా చేశారు.

2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయినా ఆయన వెరవలేదు.

రాజకీయాలు నాకు వద్దని ప్రజల మీద అలగలేదు. వెనక్కితిరిగి చూసుకోలేదు. కాకపోతే పూర్తి స్ధాయి రాజకీయాలు చేయకపోయినా, తన నటనా వృత్తిని నిర్వరిస్తూనే, రాజకీయాలు చేశారు. ఇక ఇప్పుడు పూర్తి స్ధాయి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అయితే ఎంత కాదన్నా, నాకు కులాభిమానం ప్రత్కేకంగా లేదని అనేక సార్లు చెప్పారు. 2019లో ఓడిపోయిన తర్వాత తన కులం బలం విలువ తెలిసింది. అందరూ నావాళ్లే అనుకుంటే ఎందుకు ఓడిపోయానో అర్ధమైంది. అందుకే అప్పటి నుంచి కులం కార్డు పట్టుకున్నాడు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాడు. ఒక్కసారి కులం కార్డుతో విజయం సాదించిన నాయకుడికి తిరుగుండకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంత బడుగు బలహీన వర్గాల పార్టీ అని పైకి చెప్పుకున్నా, కమ్మలదే ఆ పార్టీ అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయమే. వైసిసి దళిత, మైనార్టీ పార్టీల ఆదరణ వుందని ఎంత అనుకున్నా రెడ్డిల ఆధిపత్యమే అక్కడ కనిపించేది. జనసేన అంటే కాపు అన్న ముద్ర వేసుకుంటేనే పవన్‌ భవిష్యత్తులో రాజకీయం చేసేది. ఇది ఎవరు ఔనన్నా,ఎవరు కాదన్నా అంగీకరించాల్సిన సత్యం. అందుకే పదునైన రాజకీయం చేయాలని పవన్‌ అనుకుంటున్నారు. కాని అది సాద్యమా? అన్నది కూడా బేరీజు వేసుకోవాలి. ఇక్కడ పవన్‌కు అనుకూలమైన అంశాలు కొన్ని వున్నాయి. తెలుగుదేశంతో ఈ ఐదేళ్లు పొత్తు సాగినా, ఎప్పటికైనా జనసేన సొంత గా ఎదగడం అన్నది ఎంతో అవసరం. భవిష్యత్తులో కూటమిని ఒక వేళ కొనసాగినా, మళ్లీ అదికారంలోకి వచ్చినా, అప్పుడు చంద్రబాబు వయసు సహకరించపోయినా, పొత్తు ధర్మంలో భాగంగా పవన్‌ను తెదేపా నాయకులు ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారని ఎవరూ నమ్మడం లేదు.

ఒక వేళ లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తానంటే పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోడు.

అంత దాక ఎందుకు ఏడాది కాలంలో ఎన్నో జరొగొచ్చు. ఎందుకంటే రాజకీయాలన్నాక, వ్యాపారలన్నాక పొత్తు ముందు బాగానే వుంటుంది. బాగస్వామ్యం విలువ బలంగానే వుంటుంది. లాభాలు పంచుకునే సమయం వచ్చినప్పుడే అసలు రంగు అందరిదీ బైట పడుతుంది. పెట్టుబడి పెట్టినప్పుడు ఇద్దరం వేరు వేరు కాదు..నువ్వు నేను ఒకటే అనుకుంటారు. కొన్ని విషయాల్లో ఇద్దరూ సర్ధుకుపోతారు. తర్వాత మధ్యలో ఎవరో ఒకరు దూరుతారు. ఇద్దరి మధ్య చిచ్చు రాజేస్తారు. ఇది అంతటా జరిగేదే. రాజకీయాల్లో ముఖ్యంగా తప్పకుండా జరిగేదే. రాజకీయాల్లో విభేదాలే కాదు, అనుమానాలు కూడా ఎక్కువే వుంటాయి. వారి ప్రతి కదలికను అనుమానిస్తూనే వుంటారు. పైకి ప్లాస్టిక్‌ నవ్వులు పూచించుకున్నా, వెనకాల ఏం జరుగుతుందో అన్న అనుమానమే ఎక్కువ వెంటాడుతుంది. అప్పుడు పని పాతర..అనుమానం జాతర అవుతుంది. అంతే కాదు అలాంటి సమాయాల్లో ఆత్మాభిమానం తెరమీదకు వస్తుంది. నిరంతర మధనాన్ని ముందు తెచ్చిపెడుతుంది. ఇద్దరినీ నిలకడగా వుండనివ్వవు. విడిపోయేదాకా తగాదాలు కొనసాగుతూనే వుంటాయి. ఇలాంటి వాటిని జయించాలంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నవి వ్యాపారాలు కాదు. రాజకీయాలు. స్నేహం అంతకన్నా కాదు. పొత్తు పొడుపు రాజకీయం. అది ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. ముందు బాగానే వుంటుంది. మైత్రి మంచిగానే వుంటుంది. కొద్ది రోజులు పోయాక కలత నిద్రలు తెచ్చిపెడుతుంది. నువ్వే ముందుండాలని నిరంతరం జోరిగా లాగా నాయకులను తొలుస్తుంది. ఎందుకంటే అదికారం ఒక కిక్కు. ఆ కిక్కు మరింత పెరగాలనే అందరూ కోరుకుంటారు. దిగిపోవాలని ఎవరూ కోరుకోరు. పదవిని జారవిడుచుకోవాలని అనుకోరు. అధికారం శాశ్వతం కాదని తెలిసినా, ఎప్పుడూ నేనే వుండాలనుకుంటారు. వుంటానని కలలు గంటుంటారు. అయితే ఒక్క ఒరలో ఎప్పుడూ రెండు కత్తులు ఇమడలేవు. పవన్‌ నడక,నడత, మాట అన్నీ స్పీడే. ఆవేశం వచ్చిందంటే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కాకుండా వుంటుంది. అభిమానులకు ఊపు రావడం కాన్న ముందు ఆయనే ఊగిపోతుంటాడు. చంద్రబాబు బోదలు, చేతలు, అడుగులు అన్నీ నెమ్మది. ఆలోచనను నానబెట్టి,నానబెట్టి నిర్ణయం తీసుకోవడం చంద్రబాబుకు అలవాటు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి, ఏది మంచి, ఏది చెడు అని బేరీజులు వేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు.

పవన్‌ కల్యాణ్‌ అలా కాదు.

ఏదైతే అది అయ్యింది. జరిగేవన్నీ మన మంచికే అని వెనక్కితిరిగిచూసుకోవడం పవన్‌కు వుండదు. ఈ ఇద్దరూ ఈ విషయంలో భిన్న దృవాలు. రాజకీయం కోసం ఈ రెండు దృవాలు కలిసినా, ఎల్లప్పుడూ ఈ దృక్కోణాలు కలిసి వుండడం అసాధ్యం. ఎందుకంటే పవన్‌ ఆలోచన పూర్తి కాకముందే అమలు పూర్తి కావాలంటాడు. ఏదీ వున్న ఫలంగా రాజకీయాల్లో సాద్యం కాదు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే తొందరపాటు పనికి రాదు. కాని పవన్‌కు నిలకడ లేని నాయకుడు అన్న పేరు వుంది. మరి అది మార్చుకున్నాడా? ఆయన మారాడా? పవన్‌ రాజకీయాల్లో అనుభవం గడిరచాడా? అన్నది కొంత కాలం ఆగితే గాని తెలియదు. ఆయన దూకుడు స్వభావం కొనసాగుతుందా? లేక పరిపూర్ణమైన ఆలోచనతో ఆచి తూచి అడుగులేస్తాడా? అన్నది కొంత కాలంపోతే గాని తెలియదు. అందుకు ఎంతో కాలం కూడా పట్టదు. ఎందుకంటే ఎంత కాలానికైనా జనసేన ఏపిలో వైసిపికి ప్రత్యామ్నాయంగానైనా ఎదగాలి. లేక తెలుగుదేశం స్ధానమైనా భర్తీ చేయాలి. ఏదో రకంగా భవిష్యత్తు రాజకీయాలను పవన్‌ శాసించాలి. ఇది ఆయన ముందున్న లక్ష్యం. అయితే చంద్రబాబు పనితీరు మీద కూడ జనసేన మనుగడ కూడా ఆధారపడి వుంటుందన్నది పవన్‌కు తెలియందికాదు. ప్రజల్లో ఐదేళ్లలో చంద్రబాబు పాలన సూపర్‌ అని తేలితే జనసేనను పక్కన పెట్టాలని తేదేపా శ్రేణులే పట్టుబడతారు. ఒక వేళ చంద్రబాబు పాలనలో మందగమనం కనిపిస్తే ఆ ప్రభావం మన మీద పడుతుందని జనసేన శ్రేణులు తప్పుకుందామని పవన్‌మీద ఒత్తిడి తెస్తారు. ఏది జరిగినా ముందు నష్టం జనసేనకే. పొత్తులో పవర్‌ చూసిన పవన్‌ ప్రతిపక్షంలో వుండాలంటే మళ్లీ జగన్‌ హయాంలో చూసిన పరిస్ధితులు తప్పకుండా ఎదుర్కొవాలి. అందుకు పవన్‌ సిద్దపడతాడా? లేక వున్న పవర్‌లోనే ఒదిగిపోతారా? అన్నది కూడా చెప్పడం కష్టమే. ఎంత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అండగా నిలిచినా, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు పవన్‌కు వుండనేవుంటాయి. తాను మునుగుతాను అనుకున్నప్పుడు అసలు రాజకీయాలు వెలుగు చూడొచ్చు. ఈ రాజకీయాలు నాకొద్దని అన్నలాగా వదిలేయొచ్చు. ఏడాది గడిస్తే ఇందులో ఏదైనా జరొగొచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version