https://epaper.netidhatri.com/view/373/netidhathri-e-paper-10th-september-2024%09
`విధ్వంసమైన ప్రకృతి కాపాడుతున్నాడు.
`చెరపట్టిన చెరువులను విడిపిస్తున్నాడు.
`చెరువుల హద్దులు చెరిపిన వారి బరతం పడుతున్నాడు.
`చెదిరిన చెరువులకు పూర్వ వైభవాన్ని తేనున్నాడు.
`అందమైన హైదరాబాదుకు ప్రకృతి శోభను అద్దనున్నాడు.
`కబ్జా కోరుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తున్నాడు.
`చెరువుల జోలికి రావాలంటే వణుకు పుట్టేలా చేస్తున్నాడు.
`అక్రమార్కులను పారద్రోలే యజ్ఞం చేస్తున్నాడు.
`ప్రకృతి సంపదకు జీవం పోయనున్నాడు.
`నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించనున్నాడు.
`మంచినీటి కొరత తీర్చే భగీరధ ప్రయత్నం మొదలు పెడుతున్నాడు.
`చెరువుల నగరంగా హైదరాబాదుకు కొత్త శోభను అద్దనున్నాడు.
`పట్టణ జీవితం పరవశాన్ని, ప్రశాంతతను నింపనున్నాడు.
`ప్రకృతి ప్రేమికులకు నగరాన్ని కలల స్వప్నం చేయనున్నాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని శ్రీరాముడు, లక్ష్మణుడు ఎదిరించి యజ్ఞం పూర్తి చేయించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విధ్వంసమైన ప్రకృతిని పరిరక్షించే యజ్ఞంచేస్తున్నారు. భవిష్యతులో హైదరాబాద్ నగరం, చెన్నై, బెంగుళూర్ నగరాలుగా ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సముద్రం పక్కన చెన్నై నగరం గుక్కెడు మంచినీటి కోసం తహతహలాడే పరిస్ధితి తెచ్చుకున్నది. చినుకుపడితే చెన్నై మునిగిపోతుంది. ఎండా కాలం వస్తే చుక్క మంచినీరు దొరక్క అల్లాడిపోతోంది. ఆ కష్టం ఇప్పడు వచ్చింది కాదు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఎనభైవదశకంలోనే ఎన్టీఆర్ తెలుగు గంగ కాలువను తవ్వించి, తెలంగాణ నుంచి చెన్నైకి మంచినీటిని తరలించి ఆదుకున్నారు. అయినా ఆ చెన్నై విస్తరణ ఆగలేదు. కాంక్రీట్ జంగిల్‌కు అడ్డుకట్టపడలేదు. దాంతో వానొచ్చినా చిగురుటాకులా వణికిపోతోంది. ఎండలు కాస్తే గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతోంది. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ అని పేరున్న బెంగుళూరు పరిస్దితి చెన్నైకన్నా అద్వాహ్నంగా తయారైంది. ఎండా కాలంలో చల్లని మలయమారుతంలాగా వుండే బెంగుళూరు ఇప్పుడు వేసవి కాలంలో ఉక్కపోతతో అల్లాడుతోంది. మంచినీరు దొరక్క తహతహలాడుతోంది. బెంగుళూరులో కూడా అనేక చెరువులు వుండేది. వాటన్నింటినీ మింగేశారు. చెరువుల్లో ఇండ్లు కట్టేశారు. బెంగుళూరును విస్తరించారు. ఇప్పుడు ఇబ్బందులు పుడుతున్నారు. అటు ట్రాఫిక్ సమస్యలు. ఇటు మంచినీటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మన హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్ధితులు ఉత్పన్నమౌతున్నాయి. చినుకు పడితే నగరం చెరువులౌతున్నాయి. కాలనీలు మునిగిపోతున్నాయి. దీనంతటికీ ప్రకృత్తి విద్వంసమే కారణం. చెరువుల మాయంతో ఇబ్బందుల మయం. దీనికి ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పెట్టాలి. కాని గత పాలకులు ఈ సమస్యలు పట్టించుకోలేదు. ప్రకృతి విద్వంసాన్ని ఆపలేదు. చెరువులను చెర పట్టేవారిని ప్రోత్సహించింది. నగర విస్తరణ పేరుతో హైదరాబాద్‌ను ఆగం చేసింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర పరిరక్షణకు నడుం బిగించారు. హైడ్రాను తెచ్చారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మాయమైన చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందకు కృషి జరుగుతోంది. చెరపట్టిన చెరువులను విడిపిస్తున్నాడు. చెరువుల హద్దులు చెరిపిన వారి భరతం పట్టండని హైడ్రాకు సర్వ హక్కులు కల్పించాడు. అడ్డొచ్చేవారు ఎంతటి వారైనా సరే లెక్క చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. చెరువుల హద్దులు చెరిపిన వారి, అందుకు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఓ ఐదుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. కబ్జా కోరుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరూ చెరువుపై కన్నెత్తి చూడకుండా చేస్తున్నారు. ఇప్పటికే హద్దులు చెరిగిన చెరువులను బాగు చేసేందుకు కసరత్తుచేస్తున్నారు. ప్రకృతి సంపదకు జీవం పోస్తున్నారు. నగర వాసులకు ఆహ్లాదకమైన వాతావరణం, మంచినీరు అందేలా నగర రూపు రేఖలు మార్చేందుకు అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ అంటే అందమైన చెరువుల నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. పట్టన జీవితంలో కూడా ప్రశాంతతను నింపనున్నారు. ప్రకృతి ప్రేమికులకు హైదరాబాద్ నగరాన్ని కలల ప్రపంచంగా మార్చనున్నారు. మనం గొప్పగాచెప్పుకునే ధేమ్స్ నది ఒడ్డున వున్న లండన్‌లను తలదన్నేలా హైదరాబాద్‌ను మార్చనున్నారు. అందుకే ఎవరూ ఊహించని హైడ్రాను తెచ్చారు. హైడ్రా అనగానే తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమణదారులు, దురాక్రమణదారులు, అక్రమంగా ప్రభుత్వం భూములు కొల్లగొట్టిన వారి అదిరిపడుతున్నారు. ఆ పేరు వినపడితే ఉలిక్కి పడుతున్నారు. ఇంత కాలం గత పాలకుల సమయంలో అదికారులను గుప్పిట్లో పెట్టుకొని, చెట్టు,పుట్ట, చెరువు, చేమ, గుడి, బడి అన్నట్లు ఏది వదలకుండా భూములను చెరపట్టారు. కజ్భాల పేరుతో దర్జా వెలగబెట్టారు. చెరువు కనిపిస్తే చాలు మాయం చేశారు. రాత్రికి రాత్రే అక్కడ కాంపౌండ్ వాల్ కట్టేవారు. మరునాటికి చెరువులనే మాయం చేసేవారు. వెంచర్లు చేసేవారు. ప్లాట్లు విక్రయించేవారు. కొన్ని నిర్మాణ సంస్ధలు మాత్రమే లేక్‌వ్యూ పేరుతో అందమైన బ్రోచర్లు అచ్చేచి, అచ్చం పల్లె వాతారణంలో ఇల్లు అని ప్రకనటలు గుప్పించి, కోట్ల రూపాయలకు విక్రయించారు. చేతులు దులుపుకున్నారు.
ఇలా హైదరాబాద్ పరిధిలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేల చెరువులు మాయం చేశారు.
రియల్ వ్యాపారం సాగించారు. భూదందా మొదలు పెట్టారు. దేశ దేశాలలో భూ వ్యాపారం చేసేంతగా ఎదిగారు. తెలంగాణలో రియల్ వ్యాపారం చేసి అమెరికాలో స్ధిరపడిన వారు ఎంతో మంది వున్నారు. వాళ్లంగా బాగానే వున్నారు. కాని వాటిని కొన్నవాళ్లు ఇప్పుడు నిరాశ్రయులౌతున్నారు. రాత్రికి రాత్రి తమ కలలు కూలిపోతుంటే నిరాశ్రయులౌతున్నారు. అయితే ఆస్దులు కలిసి రాగానే హైదరాబాద్‌లో స్ధలం కొనుగోలు, ఇల్లు కొనుగోలు సోషల్ స్టేటస్ అయ్యింది. దాంతో ఒకరిని చూసి ఒకరు ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేశారు. రియల్ వ్యాపారుల చేతిలో మోస పోయారు. అసలు మనకు విక్రయిస్తున్న భూములు ఏ రకమన్నది ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ పర్మిషన్లు వున్నాయా? లేదా? అనుకున్నారే గాని, అమ్మకానికి చెందని భూములను విక్రయిస్తున్నారని గుర్తించలేదు. చెరువుల్లో నిర్మాణాలెలా కడుతున్నారన్న ఆలోచనలు అసలే చేయలేదు. హైదరాబాద్‌లో ఇల్లుంటే చాలు. అది కొండైనా, బండైనా,చెరువైనా, కుంటైనా అనుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమించుకొని, నగరాన్ని కాంక్రిట్ జంగిల్ చేసి, ప్రకృతిని విధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి నిర్మాణాలు కూల్చివేస్తోంది. చెరపట్టిన చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటోంది. చెరువుల్లో వెలసిన అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తే తప్ప ప్రకృతిని కాపాడుకోలేం. అందుకు అనేక అడ్డంకులు ఎదురౌతాయి. ఇవన్నీ గమనించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిళ్లు లేని స్వయం ప్రతిపత్తిసంస్ధ హైడ్రాను ఏర్పాటు చేశారు. పుల్ పవర్స్ ఇచ్చారు. హైడ్రాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకడుడు లేదని ప్రకటించారు. ఆక్రమణదారులు ఎలాంటి వారైనా, అక్రమ నిర్మాణాలు చేసుకున్నవారు బంధువులైనా సరే కూల్చుడే..నగరాన్ని కాపాడుడే అని తేల్చి చెప్పేశారు. అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం సహించకూడదు. చెరువుల ఆక్రమణ దారులను ఉపేక్షించకూడదు. అయితే రియల్ వ్యాపారం పేరుతో చెరువును ఆక్రమించి, సామాన్యులను నమ్మించి, అదికారుల సహాకారంతో పర్మిషన్లు ఇప్పించి, అమ్ముకొని సొమ్ము చేసుకున్న వారు బాగానే వున్నారు. సామాన్యులు సమిధలౌతున్నారు. ప్రకృతి మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇది అనేక సార్లు రుజువైంది.
అడవులు నరికేసిన సమయంలో వర్షాలు లేక ప్రజలు అల్లాడారు.
పాలకులు కొంత తేరుకున్నాక వరణుడు కరుణిస్తున్నాడు. అలాగే ప్రకృతి విధ్వంసం ఇప్పటికైనా ఆపడం ఎంతో మేలు. అంతే కాకుండా విధ్వంసమైన ప్రకృతికి జీవం పోస్తే మరింత మేలు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో పాలకుల పుణ్యమా? అని హైదరాబాద్ పరిధిలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అనేక చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే సుమారు 3800లకు పైగా చెరువులు వుండేవని చరిత్ర చెబుతోంది. అది కాలక్రమేణా కనుమరుగౌతూ 2700 చెరువులు, కుంటలకు చేరాయి. సరిగ్గా ఈ మూడు నాలుగు దశాబ్దాలలో 1000కిపైగా చెరువులు మాయమయ్యాయి. అక్కడ భవనాలు వెలిశాయి. అది ఇలాగే కొనసాగుతూ పోతే భవిష్యత్తులో చెరువు ఎలా వుంటుంది అన్నది ఫోటోలు చూసుకోవాల్సిందే. భూర్భజలాలు లేక ప్రజలు అల్లాడాల్సిందే. చినుకు పడితే నగరమంతా నరకం చూడాల్సిందే. చిన్న వానకే నగరం చిరుగుటాకులా వనకాల్సిందే. ఇప్పుడు విజయవాడలో చూస్తున్న పరిస్ధితులు ప్రత్యక్ష్యంగా ఎదుర్కొవాల్సిందే. అందుకే భవిష్యత్తు తరాలే కాదు, ఇప్పటి తరం కూడ ఎండా కాలం వచ్చిందంటే గుక్కెడు మంచినీటి కోసం కటకటలాడుతున్నాము. ఎండాకాలంలో చుక్క నీటి కోసం తహతహలాడుతున్నాము. పాలతో సమానంగా మంచినీటిని కొనుక్కుంటున్నాం. దీనంతటికీ కారణం ప్రకృతి విధ్వంసమే.