బిజేపి పగ్గాలెవరికి!

https://epaper.netidhatri.com/view/293/netidhathri-e-paper-14th-june-2024%09/2

-బండిని భర్తీ చేసే మాటకారి తనం ఎవరిది!

-ఈటెలకంటూ ఊపందుకున్న ప్రచారం.

-చాలా సైలెంట్‌గా ప్రయత్నం చేస్తున్న అరవింద్‌.

-నేనున్నానంటున్న రఘునంధన్‌ రావు.

-కొత్తగా రామచంద్ర రావు పేరు తెరమీదకు.

-పోటీలో డికే. అరణ కూడా వున్నారు.

-ఈటెలను అడ్డుకునేదెవరు?

– ఈటెలకు బండి సహకరించేనా!

-రఘునందన్‌ రావుకు బండికి సయోధ్య లేదు.

-కిషన్‌ రెడ్డికి ఈటెలకు పొసగకపోవచ్చు.

-అరవింద్‌కు అవకాశం వచ్చేనా!

-అందరికీ అమోదయోగ్యుడు దొరికేనా!

-ప్రభుత్వాన్ని ఎండగట్టే సమర్థుడెవరు!

-ఈటెల మాటల వాడి సరిపోయేనా!

-రఘునంధన్‌ రావు వాగ్థాటి పనికొచ్చేనా!

-కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ లను ఈటెల ఉతికి ఆరేయగలరా!

-చలోక్తి మాటల చాతుర్యం వున్నదెవరికీ!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కొత్తవారొచ్చినప్పుడు ఆ సమయం వరకు వున్న అధ్యక్షుడి వారసుడు ఎవరు? అన్న చర్చ జరుగుతుంది. కాని తెలంగాణ బిజేపిలో మాత్రం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ వారసుడు ఎవరు? అన్న చర్చ జరుగుతుంది. ఇలాంటి విచిత్రమైన పరిస్దితి ఎక్కడా జరిగి వుండకపోవచ్చు. కారణం బండి సంజయ్‌ తెలంగాణ బిజేపి రాజకీయాలను అంతగా ప్రభావం చేశాడనే చెప్పాలి. గతంలో ఎంతో మంది బిజేపి నాయకులు పార్టీకి ప్రాతినిధ్యం వహించినా బండి సంజయ్‌ లాగా పార్టీ బలం పెరిగేందుకు, పెంచేందుకు కృషి చేయలేదనే చెప్పాలి. గతంలో పొత్తు ధర్మంలో బిజేపి ఉనికి తెలంగాణలో కనిపించేది. కాని ఇప్పుడు బిజేపి గాలిలో ఏ పార్టీ పొత్తు పెట్టుకోవాలో అన్నంతగా పార్టీని బలోపేతం చేసిన నాయకుడు బండి సంజయ్‌ అన్నది అందరూ చెప్పే మాట ఒప్పుకోవాల్సిన మాట. అందుకే తెలంగాణ త్వరలో బిజేపికి కొత్త అధ్యక్షుడు వస్తాడు. అది బండి సంజయ్‌ను మరిపించే నాయకుడు రావాలని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డే జోడు పదువుల్లో కొనసాగుతున్నారు. సరిగ్గా ఏడాదిన్న క్రితం తెలంగాణ అధ్యక్షుడుగా బండి సంజయ్‌ వున్నారు. కాని అనూహ్యంగా ఆయన పదవీ కాలమైపోయిందని చెప్పి తప్పించారు. ఒక దశలో శాసన సభ ఎన్నికల దాకా బండి సంజయే పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతారని అన్నారు. కాని బండి సంజయ్‌ను మార్చారు. కిషన్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేశారు. అంతే తెలంగాణలో బిజేపి ఒక్కసారిగా కుదేలైంది. అప్పటిదాకా అప్పటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బిజేపి ప్రత్నామ్నాయం అన్నంతగా పార్టీని బలోపేతం చేయడం కోసం బండి సంజయ్‌ అహర్నిషలు కృషి చేశారు. గతంలో ఏ అధ్యక్షుడు చేయనంత కసరత్తు చేశాడు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు ప్రత్నామ్నాయం బిజేపే, తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అందిరిలో కలిగించాడు. సంగ్రామ యాత్ర పేరుతో తెలంగానలో పాదయాత్ర కూడా చేశారు. గతంలో ఎప్పుడూ ఏ బిజేపి అధ్యక్షుడు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లోనే ఏ నాయకుడు పాదయాత్ర చేసింది లేదు. బండి సంజయ్‌ పాదయాత్ర తర్వాతనే ప్రస్తుత ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. అలా పాదయాత్రలకు కూడా తొలిసారి బండి సంజయ్‌ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అలాంటి నాయకుడు ఎవరున్నారు?

తెలంగాణ కొత్త బిజేపి బాస్‌ ఎవరౌతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

తెలంగాణ బిజేపికి ఇప్పుడు మంచి మాట కారి కావాలి. ప్రజల్లోకి వెళ్లగలిగే నాయకుడు కావాలి. అన్ని వర్గాలను ఆకర్షించే తత్వం వున్న నాయకుడు రావాలి. ఇప్పటి బలాన్ని పదింతలు పెంచే శక్తి వున్న నాయకుడు కావాలి. తెలంగాణ ప్రజల భాష తెలిసిన నాయకుడు కావాలి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పగలిగే నాయకుడు కావాలి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద విరుచుకుపడే నాయకుడు కావాలి. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ను కడిగేయలగల నాయకుడు కావాలి. ప్రస్తుత ప్రభుత్వ తప్పులన ఎండగట్టే నాయకుడు కావాలి. గత ప్రభుత్వం తప్పులను ప్రజల ముందుంచే నాయకుడు కావాలి. తెలంగాణ మీద పూర్తి పట్టున్న నాయకుడు కావాలి. తెలంగాణ ప్రాంతాల మీద పట్టున్న నాయకుడు కావాలి. తెలంగాణ సమస్యలు తెలిసిన నాయకుడు కావాలి. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకొని మాట్లాడే నాయకుడు కావాలి. తెలంగాణ భూములు లెక్కలు తెలిసిన నాయకుడు కావాలి. రైతు సమస్యలు తెలిసిన నాయకుడు రావాలి. అంతే కాని ఏసి గదుల్లో కూర్చొని పేపర్లు ముందు పెట్టుకొని మాట్లాడే నాయకుడు కాదు. నిత్యం ప్రజల్లో వుండగలగాలి. అవసరమైతే పాదయాత్ర చేయగలగాలి. పల్లె నిద్రలు చేయాలి. ప్రజలను తట్టిలేపాలి. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటే జనం నమ్మేలా వుండాలి. జనాన్ని నమ్మించేలా చెప్పగలగాలి. తెలంగాణ ఆదాయం తెలియాలి. అప్పుల గురించి తెలిసిన నాయకుడు కావాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్దిక స్దితి గతుల మీద అధ్యయనం చేయగలిగే శక్తి వున్న నాయకుడు కావాలి. భవిష్యత్తులో బిజేపి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో స్పష్టత వున్న నాయకుడు కావాలి. ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్న నిధుల మీద అవగాహన వున్న నాయకడు కావాలి. బిజేపి క్షేత్ర స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి నాయకులతో మమేకమయ్యే నాయకుడు కావాలి. వారిని గుర్తించే నాయకుడు కావాలి. వారి చేత పార్టీన బలోపేతం ఎలా చేయాలో వ్యూహాలు రచించే నాయకుడు కావాలి. మరి అలాంటి లక్షణాలు, అన్ని అర్హతలున్న నాయకుడు ఎవరున్నారు? అయితే ఈటెల రాజేందర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయినా ఈటెల రాజేందర్‌కు పగ్గాలు అప్పగిస్తారా? లేదా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ఈటెల రాజేందర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ముందుగా వ్యతిరేకించే నాయకుడు బండి సంజయ్‌ అంటున్నారు.

తెలంగాణలో బిజేపిని ఒక ఊపుకు తీసుకొస్తున్న దశలో ఆయనను దింపేయడంలో ఈటెల రాజేందర్‌ పాత్ర వుందనేది అప్పట్లో జరిగిన ప్రచారం.

ఈ విషయాన్ని బండిసంజయ్‌ పేరు ప్రస్తావించకపోయినా, ఈటెలనుద్దేశించే అప్పట్లో వ్యాఖ్యలు చేశారన్నది అందరికీ తెలుసు. బండి సంజయ్‌ను దింపేసి, అప్పటికే కేంద్ర మంత్రిగా వున్న కిషన్‌రెడ్డిని బిజేపి చీఫ్‌గా ప్రకటించన తర్వాత బండి సంజయ్‌ కిషన్‌రెడ్డినైనా పనిచేయనివ్వండి అంటూ పరోక్షంగా ఈటెలకు చురకలంటించారు. తనను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నం చేసిన ఈటెలను ప్రస్తుత కేంద్ర మంత్రి స్ధానంలో వున్న బండి సంజయ్‌ సూచిస్తాడని ఎవరూ అనుకోవడం లేదు. సోమవారం బండి సంజయ్‌, ఈటెల రాజేందర్‌ కలిసి అమిత్‌షాను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బండి సంజయ్‌ మద్దతు ఈటెలకు వుందన్న పరోక్ష సంకేతాల కోసమే జరిగిందనేది కొందరి అభిప్రాయం. కాని ఎట్టిపరిస్ధితుల్లోనూ ఈటెల రాజేందర్‌కు పార్టీలో సహకారం వుంటుందని మాత్రం అనుకోలేం. ఇక బండి సంజయ్‌కు బిజేపి పగ్గాలు కోరుకుంటున్న రఘనందర్‌రావుకు కూడా మధ్య సరైన టర్మ్స్‌లేవు. బండి సంజయ్‌ పాదయాత్ర సమయంలో తనకు సమాచారం ఇవ్వరని,లేదని చెప్పిన సందర్భాలున్నాయి. ఇక బండి సంజయ్‌ బిజేపి రాష్ట్ర చీఫ్‌గా వున్న సమయంలోనే అసెంబ్లీలో పార్టీపక్ష నేతగా రఘనందన్‌ ఎంత కోరినా పార్టీ పరంగా నిర్ణయం తీసుకోలేదు. నిజానికి బండి సంజయ్‌ని బిజేపిచీఫ్‌గా ఎంపిక చేయడానికి ముందు రఘునందన్‌ రావు పేరు బలంగా వినిపించింది. కాని అనూహ్యంగా బండి సంజయ్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు పదవి వరించింది. అప్పటి నుంచి రఘునందన్‌ రావుకు ఆ కోరిక అలాగే వుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. పైగా రఘనందన్‌ మంచి మాటకారి. స్పాంటేనియస్‌గా స్పందించి ఎదుటి వారిని ఇరుకునపెట్టడంలో ఆయన దిట్ట. ఇప్పుడు సరిగ్గా అలాంటి నాయకుడే బిజేపి చీఫ్‌ కావడం అవసరం.

ఈటెల రాజేందర్‌ మంచి వక్తే అయినా ఆయన మాటలు యువతను ప్రభావితం చేయలేవు.

అదే రఘునందన్‌ చెప్పే మాటలు సూటిగా వుంటాయి. జనంలోకి బాగా వెళ్తాయి. యువతను ఆకర్షిస్తాయి. తెలంగాణ ఉద్యమ కారుడైనా ఈటెల రాజేందర్‌ కొంతమాటలు మృదుస్వభావాన్ని కలిగి వుంటాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పోటీ పడి పార్టీని బలోపేతం చేయడం అన్నది ఈటెలకు సాధ్యమయ్యే పని కాదు. కాని రఘనందన్‌ రావు ఎవరినా టార్గెట్‌ చేసి మాట్లాడే నేర్పరితనం వుంది. కాంగ్రెస్‌ పార్టీని ఉతికి ఆరేయగలడు. బిఆర్‌ఎస్‌ నాయకులను తూర్పారపట్టగలడు. ఇదే రకమైన దూకుడు కూడ కలిగి వున్న మరో నాయకుడు నిజామాబాద్‌ ఎంపి అరవంద్‌. అయితే అరవింద్‌ కూడా ఒకరకంగా సౌమ్యుడనే చెప్పాలి. ఎవరినైనా ఎదుర్కొవాలంటే మాత్రం ఆయన దూకుడు కొంత స్వాభావికంగానే వుంటుంది. బండి సంజయ్‌, రఘనందన్‌ రావు లాంటి దూకుడు ప్రదర్శించలేదు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బిజేపి చీఫ్‌గా రఘునందన్‌ను మించిన నాయకుడు ఆ పార్టీలో కనిపించడం లేదు. అయితే మహబూబ్‌ నగర్‌ ఎంపి. డి.కే. అరుణ కూడా మంచి వక్త. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద విరుచుకుపడాలన్నా, బిఆర్‌ఎస్‌ను తూర్పార పట్టాలన్నా ఆమెకు కూడా సాధ్యమే. కాకపోతే పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్ధాయిలో ఆమె పర్యటనలు చేయడం అంత సులువైనపని కాదు. అదే రఘనందన్‌, అరవింద్‌ లాంటి నాయకులు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లగలరు. ఈటెల రాజేందర్‌ కూడా ప్రజల్లో మమేకమౌతారు. అందువల్ల ఈ ముగ్గురులోనే ప్రధానమైన పోటీ వుండొచ్చు. కాకపోతే ఈ ముగ్గురూ బండి సంజయ్‌కు నచ్చే నాయకులు కాదు. మరి బిజేపి అధిష్టానం ఎవరి వైపు మొగుతుందో చూడాలి. నిజానికి ఇప్పుడున్న నాయకులకన్నా సీనియర్‌ నాయకుడు రాజాసింగ్‌. మరి ఆయనకు పదవిపై ఎవరూ ఆలోచనలు చేయడం లేదు. ఎందకంటే రాజాసింగ్‌ దూకుడు ఒక్కోసారి పార్టీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టొచ్చు. అయినా బిజేపిలో ఏ అధ్యక్షుడి పదవీ కాలమైనా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. ఐదేళ్లపాటు పొడిగిందే అవకాశం లేదు. అందువల్ల ఈ మూడేళ్లకు ఎవరినొ ఒకరిని ఎంపిక చేస్తారా? లేదా ఇప్పటినుంచే పోరాట యోధుడిని గుర్తించి పదవి అప్పగిస్తారా? అన్నది తేలాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *