-ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా పనిచేస్తా
-ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసిన పల్లా
-రాజేశ్వర్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన స్థానికులు
-భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు, పార్టీ శ్రేణులు
-జనసంద్రమైన జనగామ యువకుల భారీ బైక్ ర్యాలీ
జనగామ, నేటిధాత్రి:-
సమగ్రాభివృద్ధికి పనిచేస్తానని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ బీఆర్ ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.ఈసందర్భంగా నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు వేలాది మంది తరలివచ్చారు. మహిళలు మంగళహారతులు, బోనాలు, బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం నుంచి ఆర్ఢీవో కార్యాలయం వరకు యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా అభిమానులు నృత్యాలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. నియోజకవర్గ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, బోడకుంటి వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సిద్ధిరాములు, పోకల జమున, టౌన్ అధ్యక్షుడు సురేష్ నాయకత్వంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు. జనగామ సమగ్రాభివృద్ధి కోసం ప్రజలంతా బీఆర్ ఎస్ అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. జనగామ నియోజకవర్గం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిందని, ఇంకా చెందాల్సి ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, నియోజకవర్గ పెద్దల సలహాలు, సూచనలతో అభివృద్ధిని వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రజల సంపూర్ణ సహకారంతో జనగామ ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుపొందుతానన్న విశ్వాసం నాకు ఉందన్నారు. నియోజవర్గ అందరి పెద్దల సహకారంతో ఎన్నికల రణరంగంలో దిగుతానని, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి సలహాలు, సూచలను పాటిస్తూ జనగామపై బీఆర్ ఎస్ జెండాను ఎగువేస్తానని స్పష్టం చేశారు.ప్రత్యేక ప్రణాళికతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననిజనగామ కు చెందిన ప్రజాప్రతినిధుల సహకారంతో నియోజవర్గ సమగ్రాభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు.