ఇష్టానుసారంగా మొరం దందా

అనుమతులు లేకుండా రాత్రి తవ్వకాలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలో ప్రకృతి వనరుల విధ్వంసం యదేచ్చగా కొనసాగుతోంది. ఒకవైపు మానేరులో ఇసుక, మరొకవైపు చెరువులలో మట్టి అక్రమార్కులకు వరంగా మారింది. మండలంలోని అనేక గ్రామాలలోని చెరువుల నుండి జెసిబి యంత్రాలను ఉపయోగించి అక్రమార్కులు మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు.
గత పది రోజులుగా మండలంలోని కొమిర గ్రామంలో గల కొత్తచెరువు నుండి ఇష్టా రాజ్యంగా చెరువులో మట్టిని తవ్వి రాత్రి వేళలో తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చెరువులో అత్యధిక లోతులో జెసిబి యంత్రాలతో తవ్వుతూ మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇష్టారాజ్యంగా జెసిబి యంత్రాలతో త్రవ్వకాల కారణంగా చెరువులో అనేక చోట్ల 10 నుండి 15 ఫీట్ల లోతులో గోతులు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో ఈ గోతులలో నీరు నిండి భవిష్యత్తులో ఇవి ప్రజల పాలిట ప్రమాదాలుగా మారనున్నాయి.
చెరువులో ఏర్పడ్డ ఇలాంటి గోతుల వల్లనే గత సంవత్సరం జీలకుంట గ్రామంలో ఒక నిండు ప్రాణం బలయింది. ఒక రైతు తన ఎడ్ల బండి తో సహా చెరువులో ఏర్పడిన గోతిలో మునిగి మరణించారు. ప్రస్తుతం విచ్చలవిడిగా చెరువులో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలు భవిష్యత్తులో రైతుల పాలిట యమపాషాలుగా మారనున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి

చెరువులో పూడిక పేరుకపోతే, ఆ మేరకు మాత్రమే త్రవ్వకాలు జరిపి అవసరమైన వారికి ప్రభుత్వం సీనరేజి చార్జీలు కట్టించుకుని మట్టిని సరఫరా చేయాల్సి ఉండగా, ఇలాంటి నిబంధనలు ఏమీ పాటించకుండానే అక్రమార్కులు రాత్రిపూట యదేచ్చగా ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరిపి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సీనరేజి చార్జీలలో స్థానిక గ్రామ పంచాయతీలు తమకు రావలసిన వాటా కోల్పోతున్నాయి.
ఇట్టి విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. అక్రమార్కులు అందజేసే ముడుపుల కారణంగానే ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని చెబుతున్నారు. అక్రమార్కులు అందజేసే ముడుపులలో ఎవరి వాటా ఎంత అని వారు చర్చించు కుంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా మామూళ్ల మత్తు వదిలి రైతుల ప్రయోజనాలను కాపాడాలని వారు కోరుతున్నారు. కళ్ళ ఎదుట లక్షలాది రూపాయల విలువ చేసే ప్రకృతి సంపద, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తరలించుకు పోతుంటే, అధికారుల అలసత్వం వెనుక గల మతలబు ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఎస్సారెస్పీ, రెవెన్యూ అధికారుల పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version