ఎమ్మెల్యేకు పెరిగిన భద్రత.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మావోయిస్టు హెచ్చరిక లేఖపై స్పందిస్తూ గడ్డం వినోద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు
ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతూ, రౌడీయిజం చేస్తూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వెంటనే ఎమ్మెల్యే వినోద్ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఇటీవల హెచ్చరిక లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వినోద్ విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులం, కాంగ్రెస్ నాయకులు అంటూ ఎవరైనా భూ కబ్జాలపై పాల్పడిన సహించేది లేదని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇది వరకు జరిగిన భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.జిల్లా కలెక్టర్, ఆర్డీఓ లు మాట్లాడుతూ భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఎవరైనా భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.