అయినవోలు మల్లన్న జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమావేశంజనవరి 2026 జరిగే జాతర ఉత్సవాల కోసం కీలక నిర్ణయాలు
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సర జాతర ఉత్సవాలు జనవరిలో జరగనున్న నేపధ్యంలో అవసరమైన ఏర్పాట్లపై దేవాలయ అధికారులు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ మరియు వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి చాహత్ వాజ్ పాయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, దేవస్థాన చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, సిబ్బంది కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అధికారులు కమిషనర్ ముందు ప్రధానంగా ప్రతిపాదించిన అంశాలు:-
దేవాలయ ఆవరణలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన 12 హైమాస్ లైట్ల మరమ్మతులు అత్యవసరంగా చేయించవలసిందిగా కోరడం.
దేవాలయ ప్రాంగణంలో నిర్మాణం ప్రారంభమైనప్పటికీ బేస్మెంట్ దశలోనే ఆగిపోయిన కమ్యూనిటీ కం డార్మెటరీ హాల్ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయించవలసిందిగా సూచించారు.
భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో ఒక సులభ్ కాంప్లెక్స్ (శౌచాలయం) నిర్మాణం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
కమిషనర్ స్పందన
పైన పేర్కొన్న ప్రతీ అంశంపైన కమిషనర్ శ్రీమతి చాహత్ వాజ్ పాయ్ సానుకూలంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా భరోసా ఇచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.
