మీడియా బాధ్యతయుతంగా వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
అర్హులకే జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డులు
నకిలీ పాత్రికేయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఆన్ లైన్ దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలని ఆదేశం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మీడియా సంస్థలు ప్రజలందరికీ వాస్తవాలు తెలిసేలా వార్తలు ప్రచురించాలని జిల్లా కలెక్టర్,జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సంబంధాల అధికారి,జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ మాదంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దినపత్రికలు,న్యూస్ చానళ్లు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని తెలిపారు.2026-28 సంవత్సరాలకు గాను ప్రభుత్వ ఉత్తర్వులు 252,ఆర్.టి. 103 ప్రకారం అర్హత గల వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయడంలో కమిటీ ప్రభుత్వ ఉత్తర్వుల మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు.సరైన గుర్తింపు,అర్హత లేనివారు పాత్రికేయులుగా చలామణి కావడంతో అసలైన పాత్రికేయులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో అందిన దరఖాస్తులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హత గల వారిని ఎంపిక చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు అల్గువెల్లి రమేష్ రెడ్డి,గొల్లపల్లి సిద్ధార్థ,పార్వతి సురేష్ కుమార్, డేగ సత్యనారాయణ,మొహమ్మద్ ఇమాద్ ఉద్దీన్,రూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి,అయినంపూడి నవీన్ కుమార్,గొల్లన నరేష్,బెక్కం సదానందం,మొదంపురం సంతోష్, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది కొల్లూరి సంపత్ కుమార్,జి.రవితేజ, మంత్రి సునీల్ కుమార్ పాల్గొన్నారు.
