కాళిగంజ్‌ ఉప ఎన్నిక ఏం సంకేతాలనిస్తోంది?

`ఓట్లశాతం తగ్గినా బీజేపీలో తగ్గని ఆశలు

`సెక్యులర్‌ ముసుగులో మమత బుజ్జగింపు రాజకీయాలు

`ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో హిందువుల కష్టాలు

`క్రమంగా వలసపోతున్న వైనం

`ఓట్లకోసం మమత కుటిల రాజకీయాలు

`హిందువుల ఓట్ల సంఘటితంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ

`ముస్లింల ఓట్లు గంపగుత్తగా తృణమూల్‌కే

డెస్క్‌ ,నేటిధాత్రి: 

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా కాళిగంజ్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణ మూల్‌ కాంగ్రెస్‌ విజయాన్ని అందరూ ముందుగా ఊహించిందే. విశేషమేమంటే ఇక్కడ గతంతో పోలిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెరగడమే కాకుండా, బీజేపీ ఓట్లశాతం కొంతమేర తగ్గడం గమనార్హం. ఇక లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓట్ల శాతం కూడా గతంతో పోలిస్తే కొంత మెరుగైన మాట వాస్తవం. ఇక్కడ ఓటమి ముందుగా అంచనా వేసినప్పటికీ, రాష్ట్ర బీజేపీ నాయకుల విశ్లేషణ మరోలా వుండటం గమనార్హం. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో హిందువల ఓట్లు సుసంఘటితమైన అంశాన్ని వారు గుర్తించడమే కాదు, ఈ పరిణామం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా వుండబోతున్నదీ అంచనా వేస్తున్నారు. కాళిగంజ్‌ స్థానం నుంచి ఎన్నికలైన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నసిరుద్దీన్‌ అహ్మద్‌ గత ఫిబ్రవరి నెలలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె అలీఫా అహ్మద్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్థి అశీష్‌ ఘోష్‌పై 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. 

ఈ ఎన్నికల్లో విశేషమేంటంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30.91% ఓట్లు పోలయిన బీజేపీకి ఈసారి 28.29% ఓట్లు మాత్రమే వచ్చాయి. కచ్చితంగా మమతా బెజర్జీకి రాష్ట్రంలో ఇంకా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతున్నదనడానికి ఇది నిదర్శనం కూడా. అయితే ఇక్కడి బీజేపీ నాయకులు చెప్పేదేమంటే, ఇది ముస్లిం మెజారిటీ కలిగిన నియోజకవర్గం కాబట్టి తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలిపిన ముస్లిం అభ్యర్థి గెలుపు సహజం. కానీ ఇదే సమయంలో నియోజకవర్గంలో హిందూ వోట్లు మరింత సంఘటితం కావడం గమనార్హమని వారు చెబుతున్నారు. 

2021 ఎన్నికల్లో పోటీచేసిన అలీఫా అహ్మద్‌కు 1,02,759 ఓట్లు రాగా, సాధించిన ఓట్లు 55.15%. అదే బీజేపీ తరపున పోటీచేసిన అశీష్‌ ఘోష్‌కు 52,710 ఓట్లు పోలయ్యాయి. అంటే 28.29% ఓట్లు సాధించినట్టు లెక్క. ఇక లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థికి 28,348 (15.21%) ఓట్లు పోలయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నసిరుద్దీన్‌ అహ్మద్‌కు 1,10,696 (53.35%) ఓట్లు రాగా, బీజేపీ తరపున పోటీచేసిన అభిజిత్‌ ఘోష్‌కు 64,709 (30.91%) ఓట్లు పోలయ్యాయి. ఇదే ఎన్నికలో కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన అబ్దుల్‌ ఖాసిమ్‌ కు 25,076 (1.98%) ఓట్లు వచ్చాయి. పరిశీలిస్తే బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే 2.62% ఓట్లు కోల్పోగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ 1.8% ఓట్లు అదనంగా పొందింది. ఈ గణాంకాల ను పరిశీలిస్తే బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రజలు మరోసారి తిరస్కరించారని ఎవరైనా ఇట్టేచెబుతారు. ఇదే సమయంలో ‘సెక్యులర్‌’గా తనను తాను చెప్పుకునే మమతా బెనర్జీ ప్రజాస్వా మ్యానికి పెట్టని కోటగా వున్నారని ప్రచారం జరగడం కూడా సహజమే. ఇదే సమయంలో 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ తన ఓటు షేరును 3.23% పెంచుకోవడం (11.98% నుంచి 15.21%కు) విశేషంగానే కనిపిస్తుంది. కానీ 2016 వరకు ఇది లెఫ్ట్‌`కాంగ్రెస్‌లునిలిపిన ఉమ్మడి అభ్యర్థులే తిరుగులేని విజయం సాధిస్తూ వచ్చారు. ఈ పార్టీల నాటి విజయ చరిత్రను పరిశీలిస్తే ప్రస్తుతం వాటి దుర్గతి ఏవిధంగా ఉన్నదీ అర్థమవుతుంది.

బంగ్లాదేశ్‌కు సరిహద్దున వున్న నదియా జిల్లాలోని కృష్ణనగర్‌ లోక్‌సభ స్థానానికి చెందిన అసెంబ్లీ నియోజకవర్గమే కాళిగంజ్‌ . 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2019 నుంచి ఈ కృష్ణనగర్‌ లోక్‌సభ స్థానానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ మహువా మొయిత్రా ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. 1947లో నదియా జిల్లాలో హిందువులే మెజారిటీలుగా వుండేవారు. 1950 నుంచి బంగ్లాదేశ్‌కు సరిహద్దున వున్న జిల్లాల్లోకి పెద్దఎత్తున బంగ్లా ముస్లింలు వలసలు వచ్చి స్థిరపడటంతోఆయా ప్రాంతాల్లో జానాభా సంఖ్యల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా నదియా జిల్లాలో ముస్లిం జనాభా ఇప్పుడు 27%కు చేరుకోగా, కృష్ణనగర్‌ లోక్‌సభ నియోజవవ ర్గంలో వీరి జనాభా 37%గా వుంది. ఇదే లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన కాళిగంజ్‌ అసెంబ్లీ స్థానంలో మెజారిటీ జనాభా ముస్లింలే. 2011 జనగణన ప్రకారం ఈ నియోజకర్గంలో ము స్లింలు 58.51% కాగా హిందువులు 41.36%గా వున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు 14 సంవత్సరాల కాలంలో ఇక్కడ ముస్లిం జనాభా బాగా పెరిగి 61%కు మించిపోయిందని అంచ నా. 

2001 జనగణన ప్రకారం ఇక్కడ ముస్లింల జనాభా 55.59% కాగా హిందువులు 44.25%. ఇక 1991 జనాభాలెక్కల ప్రకారం ముస్లింలు 52.03% కాగా హిందువుల జనాభా 47.96%.1981 జనగణనలో ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా 48.8% కాగా హిందువులు 51.1%గా వున్నారు. అంతకు పదేళ్ల ముందు అంటే 1971 జనగణ ప్రకారం ఇక్కడ హిందువులు 54.6% కాగా ముస్లింలు 45.3% శాతంగా వున్నారు. కాళిగంజ్‌లో హిందువుల జనాభా 1961లో 56.7%, 1951లో 58%గా వుండేది. 

పై విశ్లేషణను పరిశీలిస్తే కాళిగంజ్‌లో ముస్లిం జనాభా నాటకీయంగా పెరుగుతూ రాగా, హిందువుల జనాభా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం జిల్లాకు సరిహద్దున వున్న బంగ్లాదేశ్‌నుంచి పెద్దఎత్తున ముస్లింలు వలస రావడంతో వీరి జనాభా పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో స్థానికంగా వున్న హిందువులు ఈ ప్రాంతాలను విడిచిపెట్టి సురిక్షత ప్రదేశాలకు తరలివెళ్లడం మొదలైంది. ఈవిధంగా జనాభాలో వచ్చిన మార్పు ఇప్పడు కాళిగంజ్‌ అసెంబ్లీ స్థానం ఫలితాన్ని నిర్దేశిస్తున్నది. నిజానికి 2011కు ముందు ఈ నియోజకవర్గం నుంచి హిందు వులే ఎన్నికవుతూ వచ్చారు. కానీ 2011 తర్వాత ఇప్పటివరకు కాళిగంజ్‌ స్థానం నుంచి ముస్లి మేతరులు విజయం సాధించలేదు. నిజానికి నియోజకవర్గంలో హిందువులు మెజారిటీగా వున్న కాలంలో 1951,1962, 1967 మరియు 1969ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నిలిపిన ముస్లిం అభ్యర్థి ఎస్‌.ఎం. ఫజులార్‌ రహమాన్‌ విజయం సాధిస్తూ వచ్చారు. 1957లో కాంగ్రెస్‌ పార్టీకే చెందిన హిందూ అభ్యర్థి మహానంద హల్దార్‌ ఈ నియోజకవర్గంలో గెలుపు సాధించారు. 1971లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మీర్‌ ఫకీర్‌ మహమ్మద్‌ విజయం సాధించగా, 1972 లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిబ్‌శంకర్‌ బందోపాధ్యాయ్‌ గెలిచారు. 1977, 1982 ఎన్నికల్లో వామపక్ష కూటమిలో భాగస్వామిగా వున్న రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) తరపున పోటీచేసిన దేబ్‌శరణ్‌ ఘోష్‌ గెలిచారు. 1987, 1991, 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అబ్దుస్‌ సలాం మున్సీ కాళీగంజ్‌ నుంచి ఎన్నికయ్యారు. 2001 మరియు 2006 ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీకి చెందిన ధ నుంజయ్‌ మోదక్‌ గెలిచారు. 

1951 నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల విశ్లేషణను పరిశీలిస్తే కాంగ్రెస్‌ లేదా ఆర్‌ఎస్‌పీలు బలమైన ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినప్పుడు పార్టీతో సంబంధం లేకుండా గంపగుత్తగా ముస్లింలు అతనికే ఓటు వేయడం కనిపిస్తుంది. అయితే హిందువులుకూడా సంఘటితం గా ఓటు వేయడం 1972, 1977 మరియు 1982 సంవత్సరాల ఎన్నికల్లో కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం 1971 మార్చినెలలో పాక్‌సైన్యం ‘ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌’ పేరుతో జరిపిన అమానుష, దారుణ కృత్యాలను తట్టుకోలేక నాటి తూర్పు పాకిస్తాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో పారిపోయి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిన హిందువులు సుసంఘటితంగా ఓటుచేయడం. 1971లో హిందూ పురుషులు, పిల్లలను దారుణంగా హతమార్చడం, హిందూ మహిళలపై జరిపిన సా మూహిక అత్యాచారాలతో పాటు వారిని బానిసలుగా ఉపయోగించుకోవడం వంటి దారుణాలు వీరి మనోఫలకాలపై పడిన బలీయమైన ముద్ర ఈ సంఘటితత్వానికి కారణమని ఎన్నికల విశ్లేషకుడు అశిష్‌ బిశ్వాస్‌ వివరించారు. 1987 నుంచి ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా మెజారిటీస్థాయికి చేరుకోవడంతో, అప్పటినుంచి వీరి ఓట్లు సంఘటితం కావడం మొదలైంది. అయితే 2001 మరియు 2006 ఎన్నికల్లో ధనుంజయ్‌ మోదక్‌ ఇక్కడ విజయం సాధించడానికి ప్రధాన కారణం వామపక్ష భావజాలం బలీయంగా వుండటమే. అప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రమాదఘంటికలను గుర్తించిన లెఫ్ట్‌ పార్టీలు ఈ రెండు ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో పోరాడాయి. అయినప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

ప్రస్తుత ఉప ఎన్నిక విషయానికి వస్తే కాళిగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 309 పోలింగ్‌ బూత్‌లున్నాయి. వీటిల్లో 109 పోలింగ్‌ బూత్‌ల్లో హిందువులు మెజారిటీగా వున్నారు. మిగిలిన 200 బూత్‌ల పరిధిలో హిందువుల జనాభా శాతం చాలా తక్కువ. హిందువులు మెజారిటీగావున్న బూత్‌ల్లో కేవలం ఒక్కదాంట్లో తప్ప 108 బూత్‌ల పరిధిలో బీజేపీ అభ్యర్థికి పెద్దఎత్తున మెజారిటీ ఓట్లు పడ్డాయి. కేవలం ఒక్క బూత్‌ (బూత్‌ నెం.12)లో మాత్రం హిందువుల మెజారిటీ ఓట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి పడ్డాయి. ఈ బూత్‌ పరిధిలో 592 ఓట్లుండగా, 351 మంది తమ ఓటుహక్కును వినియోగించకున్నారు. వీటిల్లో కేవలం 132 ఓట్లు మాత్రమే బీజేపీకి అనుకూలంగా పోలయ్యాయి. 108 పోలింగ్‌ బూత్‌ల్లో 73%కు పైగా ఓట్లు సాధించడం హిందువుల ఓట్లు సుసంఘటితమయ్యాయనడానికి ఉదాహరణగా రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నా రు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికారపార్టీకే అనుకూలంగా వుంటాయి. దీనికితోడు ముస్లిం మెజారిటీ నియోజకవర్గం. అయినప్పటికీ అద్బుతమైన పనితీరును పార్టీ కనబరచిందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ ఓట్లశాతం తగ్గడానికి వీరు చెబుతున్న ప్రధాన కారణం ఉప ఎన్నిక కావడంవల్ల దీనికి ఎటువంటి ప్రాధాన్యత వుండదు. దీనిలో గెలుపు ఓటములు అధికార మార్పిడికి ఎటువంటి దోహదం చేయవు కనుక చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లిప్త వైఖరి అవలంబించడం. అదీకాకుండా ఎన్నికల సమయంలో విద్యాసంస్థలు మూసివేయడంతో, సెలవులు కారణంగా పెద్దసంఖ్యలో హిందువులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం మరో కారణంగా రాష్ట్ర బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. 

కాళిగంజ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.34లక్షలు. వీరిలో 1.1లక్షల మంది హిందువులు. వీరిలో 66శాతం మంది హిందువులు (72600) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందు లో బీజేపీకి పోలయినవి 52,710 ఓట్లు. అంటే మొత్తం హిందువుల ఓట్లలో 72.6% ఓట్లు బీజేపీకి పడినట్టు లెక్క. మరి కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్లశాతం పెరగడం వెనుక కారణమేంటనేది స హజంగా ఉదయించే ప్రశ్న. తృణమూల్‌ కాంగ్రెస్‌ తాను బలహీనంగా వున్న బూత్‌ పరిధుల్లో బీజేపీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి, కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటువేయమని తనకున్న కొద్దిపాటి మద్దతు దార్లకు ఆ పార్టీ నాయకులు చెప్పారంటూ బీజేపీ నాయకులు చెబుతున్నప్పటికీ అది అంత విశ్వసనీయంగా లేదు. కాకపోతే లెఫ్ట్‌`కాంగ్రెస్‌ మద్దతుదార్లు మరింత ఎక్కువమంది ఓటుహక్కును వినియోగించుకొని వుండటం కారణంగా భావించడం సముచితంగా వుంటుంది. 

ఇప్పుడు ప్రధానంగా బీజేపీ నేతలు ఆరోపించేది, బెంగాల్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విపరీత బుజ్జగింపు రాజకీయాలు, ప్రతిదానికి వారికే ప్రభుత్వం అండగా వుండటంతో మైనారిటీ వర్గాలు ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం జరుగుతోందని. ఫలితంగా కాళిగంజ్‌ ప్రాంతం నుంచి కూడా హిందువులు క్రమంగా మరింత సురక్షిత ప్రదేశాలకు తరలిపోవడం కొనసాగుతోంది. ఇటీవలం పక్కనేవున్న ముర్షిరాబాద్‌ జిల్లాలో హిందువులపై జరిగిన దాడులు కూడా క్రమంగా రాష్ట్రంలో వీరు సుసంఘటితం కావడానికి దోహదం చేస్తున్నాయని బుర్ద్వాన్‌ యూనివర్సిటీలో బోధకురాలిగా వున్న సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కల్లోల్‌ కంటి భట్టాచార్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువుల్లో భయాందోళనలు వ్యక్తమవుతుండటం కూడా రాబోయే ఎన్నికల్లో హిందువులు సు సంఘటితంగా ఓట్లు వేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. మరో సామాజికవేత్త అమియ బసు ప్రకారం, బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింల రాడికలైజేషన్‌ వేగంగా జరుగుతోంది. ఫలితంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో హిందువులపై దాడులు, హింస నిత్యకృత్య మయ్యాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఓట్లు మరింత సంఘటితమవుతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాళిగంజ్‌ ఉప ఎన్నిక ఇందుకు ఒక బలమైన సంకేతాన్నిచ్చిందని భావిస్తున్నారు. బెంగాల్‌ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. 220 స్థానాల్లో హిందువులు సుసంఘటితమైతే మమతా బెనర్జీ ఓటమి ఖాయమన్నది వారి అభిప్రాయం. 102 అసెంబ్లీ స్థానాల్లో ముస్లి ఓటర్లు 30% వున్నారు. 2021లో బీజేపీ వీటిల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. మరో 74 స్థానాల్లో ముస్లిం మెజారిటీ కనుక అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశా లు లేవు. హిందువుల్లో 80శాతం మంది ఓటింగ్‌లో పాల్గని, వీరిలో 74% మంది బీజేపీకి ఓ టు వేస్తే, పార్టీ అధికారంలోకి రాగలదని రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. మరిది సాధ్యమా? వేచిచూడాలి!!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version