– లేడీ సింగం ప్రచార హోరులో అసదుద్దీన్ ఉక్కిరి బిక్కిరి
– ఎంఐఎం కోటను గెలిచే దిశగా కాషాయ పార్టీ అడుగులు
– సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారంలో ఫుల్ బిజీ
– బలమైన ప్రత్యర్థిని ఢీకొడుతూ బాణంలా దూసుకెళ్తూ..
– అసదుద్దీన్ ఓవైసీ ఆటలు సాగనివ్వబోనని వార్నింగ్
– బెదిరింపులు, రిగ్గింగ్ చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిక
– హిందూ, ముస్లిం ఓటర్లు ధైర్యంగా ఓటేయాలని పిలుపు
నేటిధాత్రి, స్టేట్ బ్యూరో:
ఎంపీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో హైదరాబాద్సెగ్మెంట్లో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తుండుగా.. మరోవైపు హైదరాబాద్ఎంపీ అభ్యర్థి మాధవీలత వినూత్న రీతిలో దూసుకుపోతున్నారు. ప్రచార సరళిని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూ తనదైన శైలిలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ఓడించే దిశగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా ఎంఐఎం ఆగడాలను, అభివృద్ధికి వెనుకబడడానికి గల కారణాలను పాతబస్తీ ప్రజలకు పూసగుచ్చినట్లు వివరిస్తూ ముందుకు సాగిపోతున్నారు. దీంంతో ఎంఐఎం అడ్డాలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మాధవీలత స్థానిక బీజేపీ నేతలు, మహిళా నాయకులతో పాతబస్తీ ముస్లిం, హిందూ మహిళలను ఏకం చేస్తూ..లేడీ సింగంలా దూసుకెళ్తుండగా.. అగ్నికి ఆయువు తోడైనట్లు ఆమెకు మద్దతుగా కాషాయదండు రోజు రోజుకు జోరు పెంచుతోంది. బీజేపీ అగ్రనేత, రాష్ట్ర మాజీ గవర్నర్తమిళిసై సౌందర రాజన్ కూడా ఇటీవల ప్రచారం చేశారు. హైదరాబాద్ లోక్సభపరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహాల్, కార్వాన్, మలక్‌పేట , యాకత్‌పురాలో ఇప్పటికే కలియ తిరిగిన మాధవీలత చివరి రెండు రోజులు మరోసారి చుట్టేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, పాతబస్తీలో అసదుద్దీన్ఓవైసీ అసత్య ప్రచారాలతో ముస్లీం ప్రజలను మభ్యపెడుతున్న విధానాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా అవకాశం లభించిన మాధవీలత ఎంపీగా గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తమకు పోటీగా బలమైన ప్రత్యర్థి ఉన్నా.. కదనరంగంలో వీరనారిగా వారిని ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని చర్చ జోరుగా సాగుతోంది. సాదా సీదాగా షురూ చూసి.. ప్రత్యర్థులపై పదునైన బాణాలు సందిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్న మాధవీలతను గమనిస్తున్న వాళ్లు ఆమెను లేడీ సింగంలా పేర్కొంటున్నారు. అలాగే మాధవీలతను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా కూడా ప్రశంసించారు. ఎలాగైనా పాతబస్తీపై కాషాయ జెండా ఎగరేయాలని పార్టీ అగ్ర నేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. ఓ వైపు ఎండల ధాటిని తట్టుకుని కార్యక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 29న నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రచారం జోరందుకోనుంది.
ముస్లిం మహిళలనూ ఆకట్టుకుంటూ..
హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడే మాధవీలత.. తనదైన శైలిలో ముస్లిం మహిళలను కూడా ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులైన మాధవీలత బీజేపీలో చేరి కొంత కాలమే అయినా.. ఎంతో సీనియర్నాయకులైన కూడా మెప్పిస్తూ దూసుకెళ్తున్నారు. పాతబస్తీలో నిత్యం ఆధ్యాత్మిక కార్యకమ్రాలు నిర్వహిస్తుండడంతోపాటు స్థానిక హిందూ, ముస్లింలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. అయితే తాజా ఎన్నికల్లో ఆర్థిక, అంగ బలం కలిగిన మాధవీలతను బరిలోకి దింపిన హైకమాండ్హైదరాబాద్ సీటును కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఓల్డ్ సిటీలో ఈసారి రిగ్గింగ్ చేయనివ్వం
ఎంఐఎంపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మండిపడ్డారు. మతాన్ని రెచ్చగొడుతున్నది తాము కాదని, అసదుద్దీన్ ఓవైసీ అని ఆమె ఎదురుదాడి చేశారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అద్భుతమైన విజయం సాధిస్తుందని మాధవీలత దీమా వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ చేయనివ్వమని స్పష్టం చేశారు. ‘ముస్లిం, హిందూ సోదరులందరూ ధైర్యంగా ఓటేయండి’ అని పిలుపునిచ్చారు. పాతబస్తీలో వెదవ వేషాలు వేసే వారికి తగిన శాస్తి చేస్తామని మాధవీలత వార్నింగ్ ఇచ్చారు. ఎంఐఎంకు ముందుంది ముసుళ్ల పండుగ అని అన్నారు. ‘‘ లేని బాణాలను మసీదుపై వేసింది ఎవరు? ఇంతకు బాణాలు వేసింది ఎవరు? ఓవైసీ చూశారా..? ప్రేమ, అభిమానం, సాహసం, విజయం.. అన్నీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీపై విమర్శలు చేస్తున్న వారందరూ పని పాట లేనివారే. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు హిందూ దేవుళ్లను తిట్టిన వారే విమర్శలు చేస్తున్నారు. పురోహితులతో కండువాలు వేయించుకుంటున్నారు” అని మండిపడ్డారు మాధవీలత.