చలో ఇందిరా పార్కు ధర్నాను విజయవంతం చేయండి

చలో ఇందిరా పార్కు ధర్నాను విజయవంతం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో “చలో ఇందిరా పార్క్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, విద్య హక్కు చట్టం–2009 అమలు కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలాదిగా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా నుండి కూడా భారీగా తరలిరావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఎల్కేజీ సీటు పొందాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పుస్తకాలు, యూనిఫామ్, బెల్ట్, బూట్లు తదితరాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఈ భారాన్ని భరించలేక ప్రజలు అప్పులపాలు అవుతూ, తమ ఆస్తులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యా దోపిడీ ఇప్పటికే ఆగిపోయేదని, కానీ పాలకుల అండదండలతో విద్యా మాఫియా రెచ్చిపోతుందని రవి పటేల్ విమర్శించారు. విద్య హక్కు చట్టం–2009ను పూర్తిగా అమలు చేస్తే సామాన్యుడి బిడ్డ కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుందని, ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఏర్పడుతుందని, విద్యా వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతుందని తెలిపారు.

తెలంగాణ సమాజం ఇకనైనా మేల్కొని, పిల్లల విద్య కోసం అప్పులపాలు కావడం ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. “చదువు అమ్ముకునే వస్తువు కాదు – ఇది ప్రతి బిడ్డ హక్కు” అని స్పష్టం చేశారు.

తెలంగాణలో వెంటనే విద్య హక్కు చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ విద్యా దోపిడిని అరికట్టాలని, పేదవారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మన హక్కులను సాధించాలంటే మరో ఉద్యమం తప్పదని, అందరం కలసి పోరాడాలని రవి పటేల్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మడే సంతోష్, వైద్య లక్ష్మణ్, రామ్ చరణ్, రేణుకుంట్ల సునీల్, లక్ష్మణ్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version