పంతళ్లకు కొలువు గండం!

*టీచర్లకు టెట్.. ఉద్యోగానికి త్రెట్*

*సుప్రీం కోర్టు తీర్పుతో టీచర్లలో అయోమయం.*

*2010కి ముందు రిక్రూట్ అయిన టీచర్లకు టెట్ పరీక్ష.*

పంతుళ్లకు కొత్త పరీక్ష!

టెట్ పాస్ కాక ఉద్యోగం ఊస్ట్

సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లలో ఆందోళన.

తమిళనాడులో తప్పని సరి చేస్తే ఒక్క శాతం పాస్ అయ్యారు.

ఏపిలో 50శాతం కూడా పాస్ కాలేదు.

తెలంగాణలో అమలు చేస్తే అంతే సంగతులు!

*ఆ పరీక్ష పెడితే నేను కూడా పాస్ కాకపోవచ్చు. అంటు ఉపాధ్యాయ సంఘ నాయకుడు శ్రీపాల్ ప్రకటన.*

*అప్పీలుకు వెళ్తామని ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం.*

తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి.

*టెట్ పరీక్ష వల్ల 50 వేల మంది ఉపాధ్యాయుల కొలువులు పోవొచ్చు.*

హైదరాబాద్‌, నేటిధాత్రి:

తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా పంతుళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత పనైంది. త్వరలో పంతుళ్లకు కొలువుగండం రానున్నది. తెలంగాణలో కనీసం ఓ 50వేల మంది ఉపాద్యాయులు కొలువులు పోయే పరిస్దితి తరుముకొస్తోంది. తాజాగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎంతోమంది ఉపాద్యాయులు కొలువులు రాంరాం కానున్నాయి. సుప్రింకోర్టు తీర్పుతో ఒక్కసారిగా టీచర్లు అయోమయానికి గురౌతున్నారు. ఉక్కిరిబిక్కిరౌతున్నారు. ఇప్పుడేం చేయాలన్నదానిపై సంఘర్షణ పడుతున్నారు. సుప్రింకోర్టే తీర్పు ఇచ్చిన తర్వాత తిరుగేముంటుంది. ఒక వేళ రివ్యూ పిటీషన్‌ వేసి మళ్లీ సుప్రింకోర్టు తలుపు తట్టినా, అదే తీర్పు రాదన్న గ్యారెంటీ ఏముంది? సహజంగా సుప్రింకోర్టు తీర్పులలో రివ్యూ పిటీషన్లు వీగిపోవడమే జరుగుతుంది. కోర్టుకు వెళ్లి మరోసారి చీవాట్లు తినడంకన్నా, కోర్టు ఆదేశాలను పాటించడమే మేలనుకునే సంఘాలు కూడా వున్నాయి. 2010కి ముందు టీచర్లుగా రిక్రూట్‌ అయిన వారు తప్పనిసరిగా టెట్‌ (టీచర్స్‌ టాలెంట్‌ టెస్ట్‌) పరీక్ష రాయాలి. అందులో పాస్‌ కావాలి. ఈ టెట్‌ కూడా రెండు రకాలుగా వుంటుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఒకటి, ప్రైమరీ టీచర్‌ పోస్టులకు మరోకటి నిర్వహిస్తారు. అలాంటి పరీక్షను ఇప్పుడు 2010 కి ముందు ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు రాయాలి. ఇదీ స్ధూలంగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో ఉపాద్యాయ అర్హత పరీక్షకు టెట్‌ అనేది వుండేది కాదు. కాని 2010 తర్వాత కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం కేంద్రం ప్రకటించింది. అయితే అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారిపై నిర్ణయం తీసుకోలేదు. కాని కొత్తగా డిఎస్సీలు రాయాల్సిన ప్రతి అభ్యర్ధి టెట్‌ రాయడం తప్పని సరి చేసింది. దాంతో క్వాలీటీ టీచర్లు వస్తున్నారన్నది గుర్తించారు. గతంలో కేవలం డిఎస్సీ(డిస్టిక్ట్‌ సెలక్షన్‌) జరిగేది. ఇందులో కూడా మరో మతలబు వుండేది. ఏ జిల్లా ఉపాద్యాయులను ఆ జిల్లా పరిషత్‌ రిక్రూట్‌ చేసుకునేది. తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో డిఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయినా ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు టెట్‌ రాయడం ఉపాధ్యాయులకు సాధ్యమా? అంటే సాద్యం కాకపోవచ్చు? ఎప్పుడో చదువుకున్న పాఠాలను ఇప్పుడు మళ్లీ చదువుకొని పరీక్షలు రాయడం అనేది సాధ్యం కాకపోవచ్చు? అనేదే ఎక్కువగా వినిపిస్తున్న మాట. అయితే టీచర్లు తప్పించుకోవడానికే ఈ పన్నాగం పన్నుతున్నారనేది కొంత మంది వాదన. డిఎస్సీ రాసిన సమయంలో అన్ని రకాల సబ్జెక్టులు చదివి, పరీక్షలు రాశారు. డిఎస్సీ సెలక్టయ్యారు. ఇప్పుడు కూడా ప్రైమరీ,అప్పర్‌ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్లకు ప్రత్యేక సబ్జెక్టు అనేది ఏదీ లేదు. వుండదు. అన్ని రకాల సబ్జెక్టులు చెప్పడానికి సిద్దంగా వుండాలి. చెప్పాలి. కాని ఇప్పుడు పరీక్షలు మేం రాయలేమని టీచర్లు చెప్పడం విడ్డూరంగా వుంది. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులు చెప్పే టీచర్లలో ప్రత్యేకంగా డీఎస్సీలో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులు పాసైన తర్వాతే ఉద్యోగాలు వచ్చాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్ష రాసే అధ్యాపక అభ్యర్ధులు సైన్‌ను ఎంపిక చేసుకుంటే అందులో మూడు రకాల విభాగాలు వుంటాయి. మ్యాథ్స్‌ సబ్జెక్టు వారికి ప్రత్యేకంగానే వుంటాయి. సోషల్‌లో కూడా భూగోళశాత్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్ధశాస్త్రం వేరువేరుగానే వుంటాయి. ఈ సబ్జెక్టులు చెప్పగలిగిన టీచర్లు పరీక్షలు ఎందుకు రాయలేరన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నిజానికి 2010 తర్వాత ప్రతి టీచర్‌ టెట్‌ రాయాల్సి వుండేది. కాని ప్రభుత్వాలు అలసత్వం చేశాయి. ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులను మన్నించాయి. వారికి సహకరించాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రమోషన్లలోకూడా టెట్‌తో పని లేకుండానే వచ్చాయి. ఇప్పుడు అవే గుదిబండగా మారాయి. ఆ సమయంలో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ నుంచి ప్రమోషన్‌ పొందిన వారిలో ఎక్కువ శాతం టీచర్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బిఈడీలు చేయలేదు. ఆ సమయంలో ఉద్యోగాలు పొందిన వారిలో సింహభాగం టీచర్లు అలగప్పా, అన్నామలై యూనివర్సిటీల నుంచి బీఈడీ చేసిన వారే. అందులోనూ అవి దూరవిద్య బిఈడీలు. అంటే ఆ బీఈడీలు చేసిన ఏ ఒక్క అభ్యర్ధి కాలేజీకి వెళ్లింది లేదు. చదవుకున్నది లేదు. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఆ యూనివర్సిటీల బీఈడీ చేసిన వాళ్లంతా ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్షలు రాశారు. కాని ఇప్పటికీ ఆ టీచర్లలలో ఎవరికీ ఒక్క ముక్క ఇంగ్లీష్‌ రాదు. కాని ప్రమోషన్లు సంపాదించి ఇంగ్లీష్‌ బోధిస్తున్నారు. ఇతర సబ్జెక్టులు బోధిస్తున్నారు. అసలు ఆ రోజుల్లో ఇంగ్లీష్‌లో పాస్‌ కావడమే గొప్ప. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు తెలుగు మీడియం చదువుకొని, ఇంగ్లీష్‌లో అన్నామలై, అలగప్పా యూనివర్సిటీల దూరవిద్య సర్టిఫికెట్లు పొందారు. అదృష్టం కలిసొచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాంటి వారు చెప్పే చదువుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల భవిష్యత్తు ఎలా వుంటుందో అర్దం చేసుకోవచ్చు. అందుకే మన విద్యా వ్యవస్ధ ఇలా తగలబడిపోయిందని చెప్పడంతో సందేహం లేదు. తర్వాత కాలంలో దూర విద్య బీఈడీలను ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించలేదు. దాంతో ఎంతో కొంత నాణ్యమైన చదువును చదువుకున్న ఉపాధ్యాయులు ఆ తర్వాత వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను నిలబెడుతున్నారు. కాని అలగప్పా, అన్నామలై యూనివర్సిటీల బిఈడీలు చేసిన వారి వల్ల విద్యా వ్యవస్ధ భ్రష్టుపట్టిపోయింది. ఇప్పుడు టీచర్ల యూనియన్లలో నాయకులుగా వున్నవారు ఎక్కువ ఆ బాపతు టీచర్లే అని అంటుంటారు. ందుకంటే వాళ్లు చదువులు చెప్పలేరు. మాటలు చెప్పి పొద్దు పుచ్చుకోగలరు. కాలయాపన చేసి కాలం వెల్లబుచ్చగలరు. నిజం చెప్పాలంటే ఆ తరం అదృష్టవంతులు. వారు చదవు చెప్పలేకపోయిన అడిగిన వారు లేదు. తర్వాత రాజకీయాల్లో దూరి ప్రజలను ప్రభావితం చేసినా పట్టించుకున్న వారు లేదు. అప్పుడే పెరిగిన రియలెస్టేట్‌ వ్యాపారాలు సాగించి కోట్లు సంపాదించడంతో వారిని చూసి ఇతర టీచర్లు భయపడం మొదలైంది. ఫైనాన్స్‌ కంపనీలు, చిట్‌ ఫండ్‌ వ్యాపారాలు మొదలు పెట్టారు. పిల్లలకు చదువులు చెప్పడం తప్ప అన్నీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా వారికి టెట్‌ పరీక్ష అంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే సుప్రింకోర్టు కూడా ఒక్క వెసులుబాటు కల్పించింది. రిటైర్‌ మెంటుకు 5 గడువు వున్న ఉపాధ్యాయులను మినహాయించింది. లేకుంటే ఇంకా ఎంత మంది టీచర్లు కొలువులు కోల్పోయేవారు. తమిళనాడు రాష్ట్రంలో టెట్‌ పరీక్షను రాస్తే అందులో ఒక్క శాతం ఉపాద్యాయులు కూడా ఉత్తీర్ణత సంపాదించలేదని తెలుస్తోంది. ఏపిలో కూడా టెట్‌ పరీక్ష నిర్వహిస్తే కనీసం సగం మంది ఉపాద్యాయులు పాస్‌ కాలేదని సమాచారం. ఇప్పుడు తెలంగాణలో టెట్‌ పరీక్షను ఆ తరం ఉపాధ్యాయులకు నిర్వహిస్తే ఎంత శాతం మంది పాస్‌ అవుతారో అని దిగులు పడుతున్నారు. అయితే టెట్‌ పాసైన వారికే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని కూడా సుప్రింకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల ప్రమోషన్లను ప్రకటించినా, ఆ తరం ఉపాద్యాయులు సైలెంటుగా వున్నారు. ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే మొదటికే మోసం వస్తుందన్న భయపడ్డారు. గొంతు సవరించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వారికంటే జూనియర్లకు ప్రమోషన్లు వస్తుంటే చూస్తూ వుండిపోయారు. అదే గతంలో అయితే సీనియర్లకు అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కేవారు. ప్రమోషన్లు ఎలాగూ పోయాయి. తర్వాత ఉద్యోగాలే పోయే పరిసి ్ధతి వస్తుందా? అని దిగులు చెందుతున్నారు. కాకపోతే కొంత గడువిచ్చి రెండుసార్లు అవకాశం కల్పించాలని కొంత మంది ఉపాద్యాయులు కోరుతున్నారు. కొంత మంది దీనిపై మళ్లీ రివ్యూ పిటీషన్‌కు వెళ్తున్నారు. మరి కొంత మంది ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని ఈ తిరకాసులు మాకే ఎందుకొని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది ఎటు దారి తీస్తుందో అని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అన్ని శాఖలు వేరు. విద్యా శాఖ వేరు. రేపటి తరాన్ని తయారు చేసే వ్యవస్ధలో లోప భూయిష్టంగా వుండొద్దు. నాణ్యమైన విద్య అందాలంటే టాలెంటెడ్‌ ఉపాద్యాయులు తప్పని సరి కావాలి. అందరూ కోరుకునేది ఇదే..!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version