· ఓటర్ల ఆలోచనా తీరులో వస్తున్న పరిణితి
· ఏ స్థాయి ఎన్నికలకు ఆ స్థాయి సమస్యలకు ప్రాధాన్యత
· బోడిగుండుకు మోకాలకు లంకెపెట్టడం కుదరదు
· లీగల్ కేసులు, ఈడీ దాడుల వల్ల పాలనపై దష్టిపెట్టలేకపోతున్న ప్రభుత్వం
· “టీ4సి” అని ప్రభుత్వానికి బండి సంజయ్ పెట్టిన ముద్దుపేరు
· థర్మల్ టెండర్లలో అవినీతిపై హరీష్‌రావు ఆరోపణలు
· అవినీతిపై క్రూసేడర్లమంటూ రేవంత్ ప్రతిదాడి
· మున్సిపల్ ఎన్నికల్లో అవినీతిపై విపక్షాల ప్రచారం “పాక్షిక” సక్సెస్
· 2029 జమిలి ఎన్నికలు జరిగితే బీఆరఎస్‌కు నష్టం
· అప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లకు పెరగనున్న ప్రాధాన్యం
హైదరాబాద్, నేటిధాత్రి:
గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ స్థాయిల్లో వోటర్ల ఆలోచనా పద్ధతి జరిగే ఎన్నికలను బట్టి మారుతోందన్నది స్పష్టమవుతోంది. నిజంగా ఇది ఓటర్లలో సానుకూల చైతన్యానికి చిహ్నం. “సైద్ధాంతికత” స్థానాన్ని “పనితీరు” ఆక్రమించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు తమ “పనితీరు”నే సిద్ధాంతంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఇందుకు బీజేపీకి పడిన ఓట్లే ఉదాహరణ. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి 35% ఓట్లుపోలవగా, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో 15% మాత్రమే రావడం, ఈ పార్టీని జాతీయస్థాయి సమస్యలకు పరిష్కారంగా వోటర్లు పరిగణిస్తున్నారని అర్థమవుతోంది. ఈ కారణంగానే రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఓటర్లు ప్రాధాన్యతనిస్తున్నారనుకోవాలి. ఇక బీఆరఎస్ విషయానికి వస్తే ఓట్ల కోసం ఇక ఎంతోకాలం తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం వుండదని తేలిపోయింది. అధికారంలో వున్న పార్టీ మాత్రమే స్థానిక సమస్యలను సత్వరం పరిష్కరించగలుగుతుందన్న విశ్వాసం కూడా ఓటర్లు అధికార పార్టీ వైపునకు మళ్లడానికి మరో కారణం. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని నమోదు చేసిన బీఆరఎస్ ఈసారి ఓటమి పాలవడానికి ప్రధాన కారణమేంటంటే, అధి కారంలో ఉన్న కాంగ్రెస్ వల్లనే సమస్యలు తీరతాయన్న విశ్వాసం. ఇక్కడ వోటర్లలో వున్నది పార్టీ సెంటిమెంట్ కాదు, తమ సమస్యలకు సత్వర పరిష్కారం ఎట్లా లభిస్తుందన్న దానిపై ఏర్పడిన నమ్మకం! ఇవ్వాళ బీఆరఎస్ లేదా బీజేపీ అధికారంలో వున్నా తప్పకుండా ఆ పార్టీలకే ఓటర్లు పట్టం కట్టేవారన్నది తధ్యం. దీన్ని పార్టీలు గుర్తెరిగి, ఏ స్థాయి ఎన్నికలకు అనుగుణంగా తమ వ్యూహాలను, పనితీరు ప్రదర్శనను ప్రజలకు వివరించాలి. లేకపోతే అంతే సంగతులు! ఇదే సమ యంలో తెలంగాణ ఓటర్లలో మరో మార్పును కూడా గమనించాలి. కేవలం కాంగ్రెస్, బీఆరఎస్‌లపైనే ఆధారపడకుండా మూడో పార్టీకి కూడా పోటీలో స్థానం కల్పించడం వీరి అద్భుత పరిణితికి నిదర్శనం. అదే బీజేపీ! ఇప్పటికి స్థానిక ఎన్నికల్లో పూర్తిస్థాయి బలాన్ని ప్రదర్శించలేకపోయినా, స్థిరమైన అభివద్ధిని నమోదు చేయడం, వోటర్లు కాషాయపార్టీని కూడా పోటీలోకి దించుతున్నా రనుకోవాలి. ఈ పరిణితి ఆంధ్ర ఓటర్లలో ఇంకా కనిపించడంలేదు! అందువల్ల వారి రాజకీయాలు కేవలం టీడీపీ, వైసీపీలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈ ట్రెండ్‌నుంచి బయటపడితేఆంధ్రప్రజలు తమకు అవసరమైన రీతిలో పనిచేసేలా పార్టీలను శాసించగలుగుతారు.
ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ చాలా స్థానాల్లో తిరిగి బలం పుంజుకోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రధానంగా ఆరుగ్యారంటీల అమలుపై ఆధారపడి ఎన్నికల్లో పోటీపడగా, వీటి అమలు వైఫల్యాలను చూపుతూ బీఆరఎస్ కాంగ్రెస్‌ను ఎదుర్కొంది. ఫలితంగా పట్టణ ప్రాంత మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ 29% వరకు ఓట్లను పొందగలిగిందంటే కాంగ్రెస్ అమలు చే స్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇంకా పూర్తి విశ్వాసం కలగడంలేదనే అర్థం. ఈ కారణంగానే చాలా మున్సిపాలిటీల్లో బీఆరఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇదే సమయంలో ఇక్కడ మరో కీలక పరిణామాన్ని కూడా గమనించాలి. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు బీఆరఎస్‌కు పెట్టని కోట లుగా పరిగణించే కరీంనగర్, నిజామాబాద్‌ల్లో బీజేపీ ప్రవేశించడం! ఇదేమాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చాపకింద నీరులా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటూ వెళితే అది బీఆరఎస్ ఆమేరకు క్రమంగా నష్టపోవడం ఖాయం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్యమైన నా యకులు కాంగ్రెలో చేరిపోవడం బీఆరఎస్‌కు తీరని నష్టం కలిగించింది. ఇక పార్టీ నాయకుడు కేటీఆర్‌కు పట్టణ ప్రాంతాల్లో మంచి పలుకుబడి, అభిమానం వుంది. కాకపోతే గ్రామీణ ప్రాంతా ల ప్రజల్లో కేసీఆర్ పట్ల లోతైన భావోద్వేగపరమైన అనుసంధానత ఇప్పటికీ వుంది. అయితే కేటీఆర్ దీన్ని నిలుపుకోవడంలో ఇంకా ఎంతో కషిచేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కొత్త సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్న కేసీఆర్ స్థానాన్ని, ఆరు గ్యా రంటీల వంటి ఇతర సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ఆక్రమించడమే!
గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ సుస్థిరంగా నెలకొల్పిన భావోద్వేగపరమైన సంబంధాన్ని పార్టీ నిల బెట్టుకోలేకపోతే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పట్టణ ప్రాంతాలకే పరిమితమై కేవలం అర్బన్ పార్టీగానే మిగిలిపోయే అవకాశాలున్నాయి. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వంలోని పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అందుకు అతీతమేం కాదు. అందువల్ల 2027 వరకు కేటీఆర్, హరీష్‌రావులు రాష్ట్రంలో పార్టీ పలుకుబడి పడిపోకుండా కాపాడుకోగలగాలి. ఇందుకు ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరిగే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే రీతిలో గట్టి వ్యూహాలను అమలు చే యాలి. ఒకవేళ 2029లో జమిలి ఎన్నికలు ప్రకటిస్తే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కొనడం బీఆరఎస్‌కు కష్టమవుతుంది. ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీల వనరు లు మరింత బలంగా వుండటమే ఇందుకు కారణం. మొత్తంమీద చెప్పాలంటే బీఆరఎస్‌కు సం స్థాగతమైన క్షేత్రస్థాయి బలం బాగా వుంది. కానీ తిరిగి అధికారంలోకి రావడమనేది అనేక కారకాలపై ఆధారపడివుంటుందనేది సుస్పష్టం.
కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రిబండి సంజయ్ కాంగ్రెస్‌ను ఇప్పటికే “టీ4సీ” అని పిలుస్తున్నారు. అంటే “తెలంగాణ కరప్షన్, కలెక్షన్, కమిషన్ కాంగ్రెస” అని ఆయన పెట్టిన ముద్దుపేరు! ముఖ్యంగా కొందరు మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు కుమ్మక్కయి యదేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారన్నది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. థర్మల్ విద్యుత్ కేంద్రం టెండర్లలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తంలో 30% నుంచి 40% వరకు కమిషన్ల రూపంలో మింగేశార న్నది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.250కోట్ల మేర అవినీతి జరిగిందని బీజేపీ ఏకంగా గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసును ఎదుర్కొనేందుకు పార్టీకి అసరమైన నిధులను రేవంత్‌రెడ్డి సమకూర్చి ఇందుకు ప్రతిగా రాజకీయ పదవుల విషయంలో తన ఆధిపత్యం కొనసాగేగా చూసుకున్నారని బీఆరఎస్ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ లేదా బీఆరఎస్‌లు చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలను పట్టణ స్థానిక ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఒకవేళ పూర్తిగా పట్టించుకున్నట్లయితే కాంగ్రెస్‌కు 1537 వార్డులు వచ్చివుండేవి కావు. ఒకవేళ అసలు పట్టించుకోకపోతే ఇంకా మరిన్ని స్థానాలను కైవసం చేసుకొని వుండేది. కేవలం 50% కంటే కొద్దిగా మాత్రమే గెలిచిందంటే విపక్షాల ప్రచారం, ప్రజల్లో కొంతమేర ప్రభావం చూపిందనేగా అర్థం! ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆరఎస్ సమయంలో జరిగిన అవినీతిని ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులపై విమర్శల దాడులకు దిగారు. అంతేకాదు తమ ప్రభుత్వా న్ని “అవినితీపై పోరాటం చేస్తున్న క్రూసేడర”గా ప్రజల్లో ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.
గ్రామీణ ప్రాంత ఓటర్లు సంక్షేమ పథకాల అమలుపై, పట్టణ ఓటర్లు రాజకీయ అవినీతి, కమిషన్లపై ప్రధానంగా దష్టిపెడతారు. బీజేపీ ఈ రెండు అంశాలను బాగా కనెక్ట్‌చేసి ప్రజల్లోకి తీసుకెళ్ల గలిగితే దీని ప్రభావం రాబోయే జీహెచఎంసీ ఎన్నికలపై అదేవిధంగా 2029 జమిలి ఎన్నికలపై తప్పకుండా వుండి తీరుతుంది.
తెలంగాణ ఆదాయం జాతీయ కాంగ్రెస్‌కు “ఏటీఎం” మాదిరిగా ఉపయోగపడుతున్ననదని విప క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిధులను అభివద్ధి పనులకు ఉపయోగిస్తే రాష్ట్ర పరిస్థితి మరో స్థా యిలో వుండేదని అవి స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు రాష్ట్రంలో పడకేసిన మౌలిక సదుపాయాల కల్పనను ఉదాహరణగా చూపుతున్నాయి. పునరుద్ధానం కోసం యత్నిస్తున్న బీఆరఎస్ ఈ అవి నీతిని “తెలంగాణ ఆత్మగౌరవానికి” ముడిపెట్టి బలంగా ముందుకు సాగితే ఫలితం వుండవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విచారణలు, లీగల్ కేసులపై (నేషనల్ హెరాల్డ్ కేసు, ఈడీ దాడులు) ప్రభుత్వం అనివార్యంగా దష్టిపెట్టడంవల్ల పరిపాలన దెబ్బతింటోంది. పాలనాపరమైన ఈ అంతరాన్ని 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి విపక్షాలు ప్రజల్లో బాగా నాటగలిగితే, ప్రభుత్వ వ్యతిరేక తకు ఇది కూడా తోడవడం లాభిస్తుంది.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే రేవంత్ దూకుడును అడ్డుకోవడానికి విపక్షాలు అందుకు దీటైన ప్రణాళికలు వేస్తూ ముందుకెళ్లడం తప్ప మరోమార్గంలేదు. దీన్ని ఎంతమేర రాబోయే ఎన్నికల నాటికి విపక్షాలు అందిపుచ్చుకోగలుగుతాయన్నది వేచిచూడాలి.
