https://epaper.netidhatri.com/
`కాంగ్రెస్ కు కన్ను గీటుతున్న తమ్ముడు కోమటి రెడ్డి.
`శత విధాల ప్రయత్నిస్తున్న అన్న వెంకటరెడ్డి.
`అన్నదమ్ముల గ’లీజు’ లాలూచి రాజకీయం!
`ఆరితేరిన అ’రాజీ’కీయం!!
`నల్లగొండ రాజకీయాలలో కోమటి రెడ్డి సోదరుల దుష్టపన్నాగం.
`తమ స్వార్థం కోసం ఎంతమందినైనా తొక్కుకుంటూ వెళ్తారు.
`అనుచరుల నెత్తిన నడుస్తూ వారికి పాతాలానికి తొక్కేస్తారు.
`మునుగోడు ప్రజలను నిండా ముంచారు.
`అనుచరులను ఆగం చేశారు.
`హస్తానికి హాండిచ్చిననాడు అనుచరుల ఒత్తిడన్నారు.
`కాంగ్రెస్ కు రోజులు లేవన్నారు.
`నమ్మి గెలిపిస్తే మునుగోడు ను నిండా ముంచారు.
`ఇప్పుడూ అదే పాట పాడుతున్నారు.
`కమలం వాడిరదంటున్నారు…
`బిజేపి నుంచి గెలవలేమనుకుంటున్నారు.
`ఏ ఎండకా గొడుగు…కాంగ్రెస్ గూటికి పరుగోపరుగు.
`ఈసారి అన్నదమ్ములనే నమ్మమంటున్న జనం.
`కాంగ్రెస్ ను కోమటి రెడ్డి సోదరులు నిండా ముంచడం ఖాయం.
`రేవంత్ రాజకీయంలో ఇద్దరూ ఓడిపోవడం తధ్యం.
హైదరాబాద్,నేటిధాత్రి:
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ ఎందుకు మారినట్లు? ఇలా పార్టీలు మారి ఏం సాధించాలనుకుంటున్నట్లు? తనపాటు తాను నమ్మిన వాళ్లను ఎందుకు ఆగం చేస్తున్నట్లు? మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసినట్లు? వున్న పదవి పోగొట్టుకొని ఎందుకు చతికిలపడినట్లు? అమ్మలా అదరించిన పార్టీని కాదనుకొని పోయి, తిరిగి ఏ ముఖం పెట్టుకొని వస్తానంటున్నట్లు? కాంగ్రెస్ శ్రేణులు ఎంత వద్దన్నా వినకుండా, వారి ఒత్తిడి మేరకే అంటూ పట్టుబట్టి మరీ పార్టీని వదిలి కాషాయ జెండా ఎందుకు వేసుకున్నట్లు? ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికి ఎందుకు చేరాలనుకుంటున్నట్లు? తెలంగాణలోనే కాదు, దేశంలోనే కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని జోస్యం చెప్పిన రాజగోపాల్ రెడ్డి లెక్క ఎక్కడ తప్పింది? ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు తెలంగాణలో మంచిరోజులొచ్చాయని ఎవరు చెప్పింది? ఎవరు ఏంచెప్పినా వినే రాజకీయం చేస్తూ, నమ్మిన వారిని నిండా ఎందుకు ముంచుతున్నట్లు? ఆపన్న హస్తంలా రాజకీయ బిక్షపెట్టిన పార్టీకోసం పనిచేయాల్సిందిపోయి, తన దారి తాను చూసుకోవాలనుకున్న రాజగోపాల్‌కు మళ్లీ పార్టీ బిక్ష పెట్టడం కూడా క్షమించరాని తప్పే అవుతుంది. అవకాశవాదులను కూడదీసుకుంటే, కండువాలు మర్చరన్న గ్యారెంటీ లేదు. పార్టీ కష్టాలలో వున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినంత గట్టిగా పట్టుకొని వుండాల్సిన రాజగోపాల్‌రెడ్డి, హాండిచ్చి కమలం గూటిలో దూరిపోయాడు. అప్పుడు గొప్పగా కనిపించిన కమలవికాసం ఎక్కడ దెబ్బతిన్నది? మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఇచ్చిన కాంట్రాక్టు ఎందుకు చేజారింది? నాడు వెబ్‌సైట్‌లో కనిపించిన కాంట్రాక్టు ఇప్పుడు ఎందుకు మాయమైంది? అంటే ఆనాడు అన్ని రాజకీయ పక్షాలు చెప్పిన మాట నిజమే! అన్నది రాజగోపాల్‌రెడ్డి ఒప్పుకున్నట్లేనా? కేవలం తన ఆర్ధిక పరిపుష్టి కోసం కాంగ్రెస్‌ను కాదనుకొని వెళ్లి, బిజేపి చూపిన ఆశల ఆశపడి, కాంట్రాక్టు కథ కాస్త ఉత్తతి కావడంతో మళ్లీ చేయి చెంతకు చేరాలనుకున్నట్లా? అయితే ఇక్కడ ఉదయించే కొన్ని ప్రశ్నలు రాజకీయంగా చూసుకున్న తెలంగాణలో కమలం వాడిరదన్నది ఎలా తెలుసుకున్నారు? ఎవరు నిర్ధారించారు? స్వయం నిర్ణయమా? లేక అన్నా దమ్ములు మళ్లీ మొదలుపెట్టిన కొత్త నాటకమా? ఒక దశలో అన్న వెంకటరెడ్డి కూడా కమలం గూటికి అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! కర్నాకట ఫలితాలు మరో రకంగా వుంటే రాజగోపాల్ రెడ్డి హస్తం వైపు చూసేవారా? వెంకటరెడ్డి ఇంత కాలం కాంగ్రెస్‌లో వుండేవారా? కాంగ్రెస్‌లో వున్నంత కాలం నిత్యం అసమ్మతి వాదిలా ఇక కాంగ్రెస్ పనైపోయింది? అంటూ అనుచరులతో రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా వైరల్ అవుతూనే వున్నాయి. అన్న వెంకటరెడ్డి కాంగ్రెస్ వస్తే నేనే సిఎం. అంటాడు. బిజేపిలోకి వెళ్తే నేనే సిఎం అని రాజగోపాల్ అన్నాడు. తాను బిజేపిలోకి వెళ్లగానే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని కరోనా సమయంలో రాజగోపాల్‌రెడ్డి అనుచరులతో చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అద్దంకి దయాకర్ సభలో ఏదో అన్నాడని ఆఖరుకు ఆయన చేత క్షమాపణ కూడా చెప్పించుకున్నారు. కాంగ్రెస్‌పార్టీకి తీరని ద్రోహం చేస్తూనే వచ్చారు. తనతో తన తమ్ముడి రాజకీయానికి సంబంధం ఏమిటంటూనే, ఆస్ట్రేలియానుంచి తమ్ముడికి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఎంతో నమ్మకంగా సేవ చేసిన అనేక మంది అనుచరుల రాజకీయ జీవితాలను చిదిమేసిన వెంకటరెడ్డి కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం జానయ్య లాంటి వారికి మద్దతు పలకడానికి కూడావెనుకాడడం లేదు. అంటే వారి రాజకీయ దివాళా కోరుతనం ఎంత నీచమైందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి నల్లగొండ రాజకీయాలకు, సూర్యాపేట జిల్లా రాజకీయాలకు అసలే సంబందం లేదు. ఇలా తన ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయాలు చేయడం మాత్రం వెంకటరెడ్డికి వెన్నతోపెట్టిన విద్య. ప్రస్తుతం ఆయన భువనగిరి పార్లమెంటు స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్లగొండలో రాజకీయాలు చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాలో వేలుపెడుతున్నారు. 2018లో తానే నల్లగొండలో గెలవలేదు. పార్లమెంటు ఎన్నికల విషయంలో జనగామ ప్రాంతం కొంత సపోర్టుగా నిలవడంతోనే వెంకటరెడ్డి గెలవగలిగారు. లేకుంటే ఆ ఎన్నికల్లో కూడా ఓటమిపాలయ్యేవారు. గెలిచి జనగామ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. నల్లగొండ జిల్లాలోనే మునిగితేలుతున్నారు.
అసలు రాను రాను రాజకీయాల్లో నీతి అన్న పదం వెతుక్కొవాల్సి వస్తుందమో?
అన్న అనుమానం వస్తోంది. నల్లగొండ జిల్లా కోమటటిరెడ్డి సోదరుల రాజకీయం చూస్తే మరీ అసహ్యం వేస్తోంది. ప్రజల కోసం అంటూ వాళ్లు చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎక్కడా పొంతన కుదడం లేదు. ఎంత సేపు వారి రాజీకయ స్వార్ధం తప్ప, ఎక్కడా ప్రజలకు మేలు కనిపించదు. మాటకు ముందు సామాజిక సేవ సేవా కార్యక్రమాలు చేపడుతుంటామంటారే గాని, వాటి వెనుక రాజకీయ భవితవ్యం దాగి వుందన్న సత్యాన్ని ప్రజలు గుర్తించలేరన్న అపోహలో అన్నాదమ్ములున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అన్న గెలిచాడు. తమ్ముడు ఓడిపోయాడు. 2018 ఎన్నికల్లో అన్న ఓడిపోయాడు. తమ్ముడు గెలిచారు. ఇద్దరూ కలిసి చక్రం తిప్పే రాజకీయాలను చూడాలనుకుంటే నెరవేరడం లేదు. అందుకని తమ అతి తెలివిని పెట్టుబడిగాపెట్టి తెలంగాణ రాజకీయాలను శాసించాలన్న పధకం రచించకున్నట్లున్నారు. వారి రాజకీయమే కాంగ్రెస్ పెట్టిన బిక్ష. ఒక దశలో ఇద్దరూదాన్ని విస్మరించారు. 2018 ఎన్నికల తర్వాత ఇక కాంగ్రెస్‌కు దేశంలోనే భవిష్యత్తు లేదని ఊహించుకున్నారు. అయినా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వెంకటరెడ్డి పోటీ చేసి గెలిచారు. అయినా కృతజ్ఞత లేని రాజకీయం రుచి చూపించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని రాజగోపాల్‌రెడ్డిని 2009 ఎన్నికల్లో ఎంపిని చేసింది కాంగ్రెస్ పార్టీ. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అలా అడుగడుగునా రాజగోపాల్‌రెడ్డికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. కాని తన సామర్ధ్యం మూలంగానే కాంగ్రెస్ తనకు అవకాశాలు కల్పించిందని భ్రమలో రాజగోపాల్‌రెడ్డి తేలియాడుతూ వచ్చారు.
నల్లగొండ కాంగ్రెస్ రాజకీయాల్లో చీడపురుగులు ఆ ఇద్దరు సోదరులు.
ఈ మాటలు అనేది ఎవరో కాదు సాక్ష్యాత్తు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఆ ఇద్దరే కోమటిరెడ్ది సోదరులు. ఈ ఇద్దరు ఎవరినీ ఓర్వరు. ఆ జిల్లాలో ముఖ్యంగా కాంగ్రెస్‌లో తాము తప్ప మరెవరూ రాజకీయాలు చేయెద్దు. ఎదుగొద్దు. ఇదే వారి అభిమతం. జానారెడ్డి లాంటి పెద్దలతో కూడా ఈ ఇద్దరికి పొసగదు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి లాంటి వారితో సఖ్యత కుదరదు. మాకు మేమే బ్రాండ్ అనుకుంటూ, ఏదో బూమరాంగ్ చేద్దామనుకుంటారు? ప్రతిసారి బొక్కాబోర్లాపడుతారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు తొలిపిసిసి అధ్యక్షుడిని కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలలు గన్నాడు. పొన్నాల లక్ష్మయ్య తన్నుకుపోయాడు. పొన్నాల మంత్రిగా వున్న సమయంలో కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడుగా వున్నప్పుడు నల్లగొండ రాజకీయాలను ఉమ్మడి వరంగల్‌లో రుద్దాలనుకున్నారు. కాని కుదరలేదు. తెలంగాణ వచ్చిన జరిగిన ఎన్నికల్లో అన్న వెంకటరెడ్డి నల్లగొండ నుంచి గెలిచాడు. తమ్ముడు మునుగోడు నుంచి ఓడిపోయాడు. అన్న ఎలాగైనా సిఎల్పీ నాయకుడు కావాలనుకున్నాడు. అక్కడ బంగపడ్డాడు. సిఎల్పీ నాయకుడుగా వున్న జానారెడ్డికి అడుగడుడునా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తూ వస్తుండేవారు. అనుకున్న లక్ష్యం నెరవేరలేకపోవడం వంటి ప్రస్టేషన్‌తో అసెంబ్లీ, మండలి ఉభయ సభల సమావేశంలో అప్పటి స్పీకర్ మధుసూధనా చారిపైకి మైక్ విసిరేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పైకి పేపర్లు విసిరేశారు. ఆ ఇద్దరి కళ్లకు గాయాలయ్యాయి. అసెంబ్లీనుంచి వెంకటరెడ్డి సస్పెండ్ అయ్యాడు. పొన్నాల తర్వాత పిసిసి. అధ్యక్షుడు కావాలని మళ్లీ ఆశలుపెట్టుకున్నాడు. అప్పుడు కూడా వెంకటరెడ్డి ఆశలు నెరవేరలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడయ్యారు. చివరికి 2018 ముందుస్తు ఎన్నికల్లో ఏకంగా నల్లగొండ నుంచి వెంకటరెడ్డి ఓటమిపాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడితే మిగిలేది రాజకీయ సన్యాసమే. జనం కళ్లముందు కనిపిస్తున్న అన్నాదమ్ముల రాజకీయ భవిష్యత్తు అదే…