`సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి.
`అటు పర్యావరణ పరిరక్షణ.
`ఇటు పేద ప్రజల సంరక్షణ బాధ్యత.
`అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికలలోపు ఇరవై లక్షల ఇందిరమ్మ ఇల్లు రెడీ.
`డబుల్ బెడ్ రూంల ఇండ్లు నిర్మిస్తే మరో పదేళ్లు రేవంత్ రెడ్డికి ఎదురుండదు.
`హైదరాబాదులో పేదలకు చోటు.
`భవిష్యత్తు తరాల భరోసాకు ప్రగతి వేధికలు.
`పేదల ఇంటికల సాకారానికి దారులు.
`ఇది జరిగితే పేదల పెన్నిదిగా చిరస్థాయిగా రేవంత్ రెడ్డి పేరు.
`ఏక కాలంలో రెండు వ్యవస్థలకు పోషణ.
`అభివృద్ధిలో సమతుల్యానికి అడుగు.
`చెరువుల పునరుద్ధరణతో రెండు రకాల ప్రయోజనాలు.
`కాంక్రీటు మయమైన హైదరాబాదులో తీర్చనున్న మంచి నీటి కొరత.
`కాలుష్య నియంత్రణనకు చర్యలు.
`భూగర్భ జలాల పెంపుకు మార్గాలు.
`ప్రభుత్వ భూముల స్వాధీనంలో రెండు రకాల ఉపయోగాలు.
`ఇతర ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి తొలగే అడ్డంకులు.
`కేసిఆర్ ఎక్కడ పోగొట్టుకున్నాడో రేవంత్ అక్కడ మొదలుపెడుతున్నాడు.
`బీఆర్‌ఎస్‌కు తెలంగాణ రాజకీయాలలో చోటుండదు.
`బీజేపి మనుగడకు దారిదొరకదు.
`ఇందిరమ్మ ఇండ్లతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం.
`కాంగ్రెస్ రాజకీయాలలో రేవంత్ తిరుగులేని శక్తికి నాంది.
`తెలంగాణలో ఎదురులేని నేతగా అవతరించే దారి.
`తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలపై త్వరలో దృష్టి.
`చెరువుల పరిరక్షణకు హైడ్రాకు అనుబంధ సంస్థల సృష్టి.
`గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ భూముల రక్షణ.
`బీఆర్‌ఎస్ పది కిలోమీటర్ల పాతాళానికి పునాది.
`ఒకే దెబ్బకు బీజేపి, బిఆర్‌ఎస్ ఖతం.
`సీఎం రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలలో శాశ్వతం.
హైదరాబాద్,నేటిధాత్రి:
నాయకుడి సంకల్ప బలం ఎంత ఉన్నతంగా వుంటే వచ్చే ఫలితాలు రాజకీయంగా అంత గొప్పగా వుంటాయి. నాయకుడి సంకల్పం ఎంత గొప్పగా వుంటే అంత మంచి విజయాలు చేతికందుతుంటాయి. ఇది అక్షరాల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వర్తిస్తాయి. వచ్చే ఐదేళ్లనాడు ఏం చేయాలన్నదానిపై ఈ రోజే ఆలోచనలు మొదలు పెడతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వారంటారు. స్వయంగా ఆయన కూడా ఇదే విషయాన్ని కూడా ఓ సందర్భంలో ఔనని కూడా చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ఎవరికీ రాని అవకాశాలు ఆయనకు మాత్రమే వచ్చాయని కూడా చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్నది ఆటు పోట్లు కూడా ఎవరూ ఎదుర్కొలేదు. ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొన్నారు. ఎక్కడా తగ్గలేదు. రాజకీయంగా ఎవరి ముందు తలదించుకోలేదు. ఎంతటి వారినైనా ఎదిరించారే గాని, ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాజకీయంగా ఎన్ని విషవలయాలు ఎదురైనా సరే వాటిని చేధించుకుంటూ ముందుకే వెళ్లారు. అదే ఆయనను బలమైన నేతగా నిలబెట్టాయి. ఆయన ఆశయాలే ముఖ్యమంత్రిని చేయగలిగాయి. సహజంగా మొదటిసారి చట్టసభల్లో అడుగుపెట్టిన వారు ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చారంటే రకరకాలగా తమ అభిప్రాయలు చెప్పి వుంటారు. కాని ధైర్యంగా నేను ముఖ్యమంత్రిని కావాలన్నదే నా లక్ష్యం అని చెప్పిన నాయకుడు రేవంత్‌రెడ్డి. అందుకే మహా సముద్రంలాంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఎదులేని నేతగా నిలబడ్డారు. పార్టీని గెలిపించే నేతగా అవతరించారు. సీనియర్లందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్లారు. తన లక్ష్యం కోసం ఆయన చేసిన అకుంఠిత దీక్ష అంతా ఇంతా కాదు. ఆయన లక్ష్యం ముందు ప్రతి సమస్య, ప్రతి సవాలు చాలా చిన్నదిగానే కనిపించింది. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా ఏం చేయాలన్నదానిపై కూడా స్పష్టమైన క్లారిటీ వున్న నాయకుడు రేవంత్ రెడ్డి. తాజాగా హైడ్రా మూలంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నిన్నటిదాకా ప్రభుత్వ పరిపాలన తీరుపై పెదవి విరిచిన వారు కూడా రుణమాఫీ తర్వాత శెభాష్ అన్నారు. హైడ్రాతో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తించేలా చేయడంతో ముఖ్యమంత్రి అంటే రేవంత్‌రెడ్డిలా వుండాలని తెలంగాణ కీర్తిస్తోంది. పాలకుడు ఎవరైనా తన మార్కువుండాలని చూసుకుంటారు. తన పాలనను కొన్నేళ్లు చెప్పుకోవాలని ఆలోచిస్తారు. అంతే కాదు, తనశక్తి సహకరించినంత కాలం తాను పాలకుడిగా వుండాలని కూడా నాయకుడు కోరుకుంటాడు. అందుకోసం ఆ నాయకుడి పేరు చెప్పగానే గుర్తొచ్చేలా కొన్ని గొప్ప కార్యక్రమాలు చేపడుతుంటారు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే రెండు రూపాయల కిలో బియ్యం వంటివి గుర్తుకు వస్తాయి. రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ వంటివి గుర్తుకు వస్తాయి. చంద్రబాబు గురించి చెప్పగానై ఐటి రంగం గుర్తుకు వస్తుంది.. కేసిఆర్ గురించి ప్రస్తావిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన వంటివి గుర్తుకు వస్తాయి. అలాగే భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చరిత్ర మర్చిపోని విధంగా గొప్ప కార్యక్రమం ఏదైనా చేయాలని అనుకుంటున్నారు. అదే ఇప్పుడు అనుసరిస్తున్న ఆక్రమణల కూల్చివేతలు. ఆపై పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తే కార్యక్రమాలు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లుండి ఒక్కసారిగా హైదరాబాద్‌లో ఆక్రమణలను తొలగిస్తూ, చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేయడం వల్ల లాభం ఏమిటి? అని కొందరు? ఇది ఎంత కాలం సాగుతందని కొందరు? దాని వెనకాల వున్న మతలబు ఏమిటని? మరి కొందరు ఇలా రకరకాల పొంతనలేని ఆలోచనలు చేస్తూ వస్తున్నారే గాని, సిఎం ఆలోచనలు ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు సుమారు 2వేలకు పైగా చెరువులు వుండేది. అవి మంచినీటి తటాకాలుగా వుండేవి. కాని రాను రాను చెరువులు మురికి కుంటలుగా మారిపోయాయి. కుంటలు పూర్తిగా మాయమైపోయాయి. పెద్దఎత్తున్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోయాయి. గత నలభై సంవత్సరాలలో హైదరాబాద్ పర్యావరణం మొత్తం విద్వంసమైపోయింది. దాంతో మంచినీటి కొరత గత ముప్పైఏళ్లుగా చవిచూస్తూనే వుంది. నగరానికి మంచినీటి కోసం ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు ఏటా ఖర్చు చేస్తున్నా సమస్య తీరడం లేదు. పైగా మరిన్ని సమస్యలు ఎదురౌతున్నాయి. వీటంతటికీ కారణం చెరువులు మాయమైపోవడమే. ఆనవాలు లేకుండాపోయిన చెరువులను గుర్తించి, వాటిలో నిర్మాణమైన అక్రమ నిర్మాణాలను తొలగించి, చెరువుల పునరుద్దరణ చేపడితే భవిష్యత్తు హైదరాబాద్ దాహర్తికి గురికాకుండా వుంటుంది. పర్యావరణ పరిరక్షించబడుతుంది. హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగిల్ మయమైపోయింది. దాన్ని కాపాడాల్సిన పాలకులు మంచినీటి అవసరాల కోసం ఎప్పటికప్పుడు తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేపట్టారు. కాని అసలు మూలం ఎక్కడుందని ఆలోచించేలేదు. దానిపై దృష్టిపెట్టలేదు. కాని కొన్ని దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఆచరణకోసం కార్యాచరణ కూడా చేపట్టారు. బెంగుళూరు లాంటి సిలికాన్ వ్యాలీ నగరంలో కూడా గత వేసవిలో మంచినీటి కటకట ఎదురైంది. అక్కడ కూడా నగరం విస్తరించడంకోసం ప్రకృతిని విద్వంసం చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ పరిస్ధితి భవిష్యత్తులో హైదరాబాద్‌కు రాకుండా వుండాలని రేవంత్‌రెడ్డి ఆలోచించి, చెరువుల పరిరక్షణ యజ్ఞం చేపట్టారు.
ఇక హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూముల గురించి అప్పటికప్పుడున్న సమచారంతో అక్కడ వెలిసిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇది త్వరలో జిల్లాలలో కూడా అమలు చేయనున్నారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి, ప్రభుత్వం సాదీనం చేసుకునేందుకు చకచకా కార్యాచరణ జరుగుతోంది. ఎన్నికల ముందు ప్రజలకు వరాలు ఇవ్వడం, తర్వాత చేతులెత్తేయడం రాజకీయ పార్టీలు అలవాటు చేసుకున్నాయి. గత పదేళ్ల కాలంలో కేసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన డబుల్ బెడ్‌ం ఇండ్లకోసం స్ధలాలు లేక చేతులెత్తేసిన సందర్భం చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఆ ఇండ్లను పిట్ట గూళ్లు, అగ్గిపెట్టే డబ్బాలు అంటూ కేసిఆర్ ఎద్దేవా చేశారు. అందరికీ డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని హమీ ఇచ్చారు. కాని తెలంగాణ పల్లెల్లో ఆయన ఒక్క ఇల్లు కూడా కట్టింది లేదు. అందువల్ల కేసిఆర్‌ను ప్రజలు పక్కన పెట్టారు. రెండు పడకల గదుల హమీని కేసిఆర్ విస్మరించడంతో దాని ప్రభావం ఓటమిని కొనితెచ్చుకున్నట్లైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అర్హులందరికీ రెండు పడకల గదుల ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పింది. ఆ హమీని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వున్నారు. ముందుగా హైడరాబాద్ , రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు స్వాదీనం చేసుకొని, అక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేస్తే పేదల పక్షపాతి అన్న పేరు రేవంత్‌రెడ్డికి చిరస్దాయిగా నిలిచిపోతుంది. పేదల పెన్నిదిగా రేవంత్‌రెడ్డిని చెప్పుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన స్ధలాలనే సేకరించి, వచ్చే ఐదేళ్లలో ఓ పది లక్షల ఇండ్లు నిర్మాణం చేసినా, తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారు. వచ్చే రెండు దశాబ్దాల పాటు ఆయన నాయకత్వమే ప్రజలు కోరుకుంటారు. ఇక బిఆర్‌ఎస్, బిజేపిలకు నూకలు లేకుండా చేస్తారు.